అక్కడంతా.. మామూలే

22 Aug, 2019 07:20 IST|Sakshi

అక్రమాలకు అడ్డాగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయం

చేయి బరువెక్కితే తిరకాసు చేయడంలో దిట్టలు

ప్రభుత్వ, దేవదాయ శాఖ భూములు పరులపాలు

కోర్టు సివిల్‌ కేసులకు సగం కారకులు వీరే

తిరుపతి సర్వే నంబర్‌ 212/2లో  దేవదాయశాఖ భూమి ఉంది. ఆ భూమి క్రయ విక్రయాలకు నిషిద్ధం. అదే భూమిని ఏకంగా రిజిస్ట్రేషన్‌ చేసిన ఘనత తిరుపతి అర్బన్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి దక్కింది. దస్తావేజు నంబర్‌ 3329/2019లో భాగపరిష్కార దస్తావేజుకు ఏకంగా రిజిస్ట్రేషన్‌ కల్పించారు. 

స్వయార్జిత ఆస్తులు భాగపరిష్కారం చేయరాదు. సెటిల్‌మెంటు దస్తావేజుకు మాత్రమే అనుమతించాలి. ఏకంగా భాగపరిష్కార అగ్రిమెంటుకు రిజిస్ట్రేషన్‌ కల్పించారు. దస్తావేజు నంబర్‌ 3438/2019లో రిజిస్ట్రేషన్‌ శాఖ యంత్రాంగం చేతివాటం ప్రదర్శించి, ప్రజాధనానికి పోగు కావాల్సిన స్టాంప్‌ డ్యూటీకి ఎగనామం పెట్టింది. ఇలాంటి అక్రమాలు ఇక్కడ చాలా చోటుచేసుకున్నాయి.

సాక్షి, తిరుపతి: తిరుపతి అర్బన్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం కేంద్రంగా చోటుచేసుకుంటున్న అవినీతి అక్రమాల ఘటనలు అనేకం ఉన్నాయి. నిత్యం సరాసరి 20 డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. వీటిని క్షుణ్ణంగా పరిశీలించే తీరిక, ఓపిక అక్కడి యంత్రాంగానికి లేక కాదు, చేతులు బరువెక్కితే ‘నందిని..పంది, పందిని..నంది’ చేయగల సమర్థులు అక్కడ ఉండడంతో ఏకంగా దేవదాయశాఖ, ప్రభుత్వ భూములు పరులపాలవున్నాయి. 

పరిధి తక్కువ.. పైరవీలు ఎక్కువ
తిరుపతి అర్బన్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం పరిధి చాలా తక్కువ. తిరుపతి రూరల్, అర్బన్‌ రెండింటికి కలిపి ఒకే కార్యాలయం ఉండగా, 2007లో అర్బన్‌ కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు. కాగా తిరుపతిలో భూములకు భారీ డిమాండ్‌ ఉండడంతో అక్రమ రిజిస్ట్రేషన్‌ వ్యవహారాలు వెలుగుచూస్తున్నాయి. ప్రభుత్వ, మఠం భూములు అధికంగా ఉండడంతో రిజిస్ట్రేషన్‌ కార్యాలయ యంత్రాంగం చేతివాటం ప్రదర్శిస్తోంది. నిత్యం పైరవీలతో కార్యాలయం కళకళలాడుతూ ఉంటుంది. అంతర్గత సెటిల్‌మెంటు తర్వాతే తుది నిర్ణయం వెలువడుతోంది. పైన పేర్కొన్న రెండు రిజిస్ట్రేషన్లు కూడా ఆ క్రమంలో భాగంగా చోటుచేసుకున్నవే. కార్యాలయంలో డాక్యుమెంటు అనుమతి పెట్టుకున్న తర్వాత నెల రోజులకు రిజిస్ట్రేషన్‌ చేశారు. పెద్ద ఎత్తున చేతులు మారడంతోనే ఫైనల్‌ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నెలకు సరాసరిగా 600 రిజిస్ట్రేషన్లు ఉంటున్నా, అంతర్గత ఒప్పందాలు లేకుండా రిజిస్ట్రేషన్లు చేయడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో భారీ స్థాయిలో స్థలాలకు ధరలు ఉండడంతో అక్రమార్కులు డాక్యుమెంట్లకు లింకు డాక్యుమెంట్లు సృష్టించే పనిలో నిమగ్నమయ్యారు. అందుకు రిజిస్ట్రేషన్‌ కార్యాలయం సంపూర్ణ సహకారం అందిస్తోంది. అక్రమ రిజిస్ట్రేషన్‌ కారణంగానే కోర్టులో అనేక సివిల్‌ కేసులు ఉత్పన్నమవుతున్నట్లు పలువురు వివరిస్తున్నారు. ఒకరు చేసే తప్పు ఒకరి తర్వాత ఇంకొకరు ఎత్తిపోసుకోవాల్సిన దుర్గతిని రిజిస్ట్రేషన్‌ కార్యాలయం కల్పిస్తోందని నగరవాసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.  

మరిన్ని వార్తలు