సబ్సిడీ చెల్లించకుంటే కేంద్రం విద్యుత్తు కట్!

17 Sep, 2013 02:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: విద్యుత్ పంపిణీ సంస్థలకు ప్రభుత్వం సకాలంలో సబ్సిడీ చెల్లించకుంటే కేంద్ర ప్రభుత్వరంగ విద్యుత్ ప్లాంట్ల నుంచి రాష్ట్రాలకు సరఫరా చేసే విద్యుత్ కోటాలో కోత పడనుంది. వివిధ ప్రభుత్వ శాఖలు కూడా ప్రతి నెలా కరెంటు బిల్లులు చెల్లించాల్సిందే. లేని పక్షంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి అందే విద్యుత్ కోటా కట్ కానుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ నిర్వహణ బాధ్యత బిల్లు-2013ను కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ సిద్ధం చేసింది. ముసాయిదా బిల్లును ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు పంపింది. ముసాయిదా బిల్లుపై సూచనలు చేయాలని పేర్కొంది. అనంతరం ఈ బిల్లును రాష్ట్రాలు అసెంబ్లీలో ఆమోదించాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ ఆదేశించింది. తాజా ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రానికి విద్యుత్ కోటా కోత పొంచి ఉందని ఇంధనశాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
 
 వస్తోందే తక్కువ...!: వాస్తవానికి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రానికి కేంద్ర నుంచి విద్యుత్తు కోటా తక్కువగా ఉంది. మన రాష్ట్రానికి కేంద్రం నుంచి 2010లో 3006 మెగావాట్ల విద్యుత్ రాగా... 2013 నాటికి ఇది కేవలం 3,700 మెగావాట్లకు మాత్రమే పెరిగింది. మరోవైపు 2010 నాటికి కేవలం 3433 మెగావాట్ల విద్యుత్‌ను మాత్రమే పొందిన మహారాష్ర్ట 2013 నాటికి ఏకంగా 6396 మెగావాట్ల విద్యుత్‌ను పొందగలిగింది. మధ్యప్రదేశ్‌కు కూడా 2010లో కేవలం 2268 మెగావాట్లు రాగా 2013 నాటికి ఏకంగా 4295 మెగావాట్ల విద్యుత్‌ను కేంద్రం నుంచి రాబట్టగలిగింది. డిస్కంలకు ప్రభుత్వశాఖల నుంచి కరెంటు బకాయిలు ఏళ్ల తరబడి భారీగా పేరుకుపోతున్నాయి. ప్రభుత్వ శాఖలు కరెంటు బకాయిల రూపంలో విద్యుత్ సంస్థలకు రూ.1300 కోట్ల మేరకు చెల్లించాల్సి ఉంది. తాజా మార్గదర్శకాల నేపథ్యంలో రాష్ట్రానికి అందే విద్యుత్తులో మరింత కోత పడే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరిన్ని వార్తలు