మీరు తగ్గించాలి.. కాదు మీరే..!

24 May, 2018 04:10 IST|Sakshi

     ఇంధన ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరిదీ..

     ఎనిమిది రోజులుగా మండుతున్న పెట్రోల్, డీజిల్‌

     అల్లాడుతున్న వాహనదారులు.. షెడ్డుల్లోనే లారీలు

     పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే అధికం

     పన్నులు తగ్గించేందుకు ముందుకు రాని రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, అమరావతి: పెట్రోల్, డీజిల్‌ ధరలు రోజురోజుకూ మండిపోతున్నా సామాన్యుడికి ఊరట కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపటం లేదు. గత ఎనిమిది రోజుల వ్యవధిలో లీటర్‌ పెట్రోలు రూ. 2.64, డీజిల్‌ రూ.2.25 చొప్పున పెరిగినా ఉపశమన చర్యలు చేపట్టకపోవటంతో వాహనదారులు అల్లాడుతున్నారు. 2016 జనవరి నుంచి చూస్తే పెట్రోలు లీటరుకు రూ.17.9, డీజిల్‌ రూ.25.17 చొప్పున పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రికార్డు స్థాయిలో లీటరు పెట్రోలు రూ. 83.37, డీజిల్‌ రూ. 75.61కు చేరుకున్నాయి. పెట్రోల్‌పై రూ.11.47, డీజిల్‌పై రూ.15.47 దాకా పెరిగిన పన్నుల భారమే ఉండటం గమనార్హం. 

ధరలు దించండి... వ్యాట్‌ తగ్గించుకోండి
ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో గతేడాది జూన్‌ నుంచి రోజు వారీ ధరల విధానం అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి చూస్తే లీటరు పెట్రోలు  రూ.12.45, డీజిల్‌ రూ.14.58 పెరిగాయి. ఇంత భారీగా ధరలు పెరిగితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించకుండా మీరు తగ్గించాలంటే మీరు తగ్గించాలంటూ తప్పించుకుని సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినప్పుడు కేంద్రం తగ్గించలేదు కాబట్టి ఇప్పుడు ధరలు పెరిగినప్పుడు ఆ భారం ప్రజలపై పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేస్తూ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఏకంగా పత్రికా ప్రకటనలు కూడా విడుదల చేశారు. అయితే ఒక లీటరు పెట్రోల్‌లో కేంద్రానికి పన్నుల రూపంలో రూ.12 వస్తే రాష్ట్రం ఏకంగా రూ. 26 తీసుకుంటూ కేంద్రంపై విమర్శలు చేయడాన్ని బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్థన్‌రెడ్డి తప్పుపట్టారు. ఇప్పటికే తాము కొంత ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించాం కాబట్టి మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాలే వ్యాట్‌ను తగ్గించుకోవాలని కేంద్రం సూచిస్తోంది.

‘వ్యాట్‌’ వాత అధికం..
పొరుగు రాష్ట్రాల కంటే ఏపీలో ఇంధన ధరలు అధికంగా ఉన్నందున ఇన్నాళ్లూ అదనపు ఆదాయం ఆర్జించిన నేపథ్యంలో ఇకనైనా పన్నులు తగ్గించి ఉపశమన చర్యలు చేపట్టకపోవటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సరిహద్దు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో పెట్రోల్‌పై లీటరుకు రూ.1.58 నుంచి రూ.7.51 వరకు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. డీజిల్‌పై లీటరుకు రూ. 1.29 నుంచి రూ.6.06 వరకు ఎక్కువ భారం పడుతోంది. దీనికి కారణం మన రాష్ట్రంలో విధించిన అదనపు వ్యాటే. 2015లో రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఆదాయం కోసం ప్రతి లీటరుపై రూ.4 అదనపు వ్యాట్‌ విధించింది. ప్రస్తుతం రాష్ట్ర ఖజానాకు ప్రతి లీటరు పెట్రోల్‌పై రూ.21.83, డీజిల్‌పై రూ.16.52 చొప్పున ఆదాయం నేరుగా వస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్, డీజిల్‌ విక్రయాలపై ఖజానాకు రూ.9,785 కోట్ల రికార్డు స్థాయి ఆదాయం సమకూరింది.

మీరే తగ్గించొచ్చుగా...
కేంద్రం సహకరించకపోయినా బాండ్లు సమీకరించి మరీ అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తానని, జాతీయ రహదారులను కేంద్రం అభివృద్ధి చేయకుంటే తామే బాగు చేసి టోల్‌ వసూలు చేసుకుంటామని చెబుతున్న సీఎం చంద్రబాబు సామాన్యుల గోడు పట్టించుకోవటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌పై మోపిన అధిక పన్నులను తగ్గించాలంటూ రెండేళ్లుగా గగ్గోలు పెడుతున్నా ఫలితం లేదు. సామాన్యుడికి ఉపశమనం కలిగించేలా ముందుగా తానే పన్నులు తగ్గించి కేంద్రానికి ఆదర్శంగా నిలవవచ్చు కదా? అని ప్రశ్నిస్తున్నారు. 

అమ్మకాలు డీలా...
ఇంధన ధరలు భారీగా పెరుగుతుండటంతో అమ్మకాలు పడిపోతున్నాయని పెట్రోలియం డీలర్లు వాపోతుండగా, లారీలు నడపలేని పరిస్థితుల్లో ఉన్నామని లారీ యజమానులు చెబుతున్నారు. గతంలో తమ బంకులో ప్రతి రోజూ 4,500 లీటర్ల పెట్రోలు అమ్మకాలు జరుగుతుండగా గత వారం రోజులుగా ధరల పెరుగుదలతో విక్రయాలు 3,500 లీటర్లకు పడిపోయినట్లు గుంటూరుకు చెందిన ఒక డీలరు తెలిపారు. డీజిల్‌ విక్రయాలు 10 వేల లీటర్ల నుంచి 7 వేల లీటర్లకు తగ్గాయని చెప్పారు.  పెరుగుతున్న డీజిల్‌ ధలరకు వ్యతిరేకంగా వచ్చే నెలలో దేశవ్యాప్తంగా బంద్‌ నిర్వహించే యోచనలో ఉన్నట్లు ఏపీ లారీ యజమానుల అసోసియేషన్‌ నాయకులు తెలిపారు. 

మరిన్ని వార్తలు