సెంట్రల్ బ్యాంకులో దోపిడీకి యత్నం

4 Oct, 2013 02:56 IST|Sakshi

రఘునాథపల్లి, న్యూస్‌లైన్ : మండలంలోని కంచనపల్లి సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో గుర్తుతెలియని దుండగులు దోపిడీకి యత్నించిన సంఘటన గురువారం ఆలస్యంగా వెలుగు చూసింది. గ్యాస్ కట్టర్‌తో బ్యాంకు వెనకాల నుంచిలోనికి దూరి చోరీకి యత్నించడంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. ఈ నెల 1న సాయంత్రం 6 గంటలకు విధులు ముగించుకున్న బ్యాంకు మేనేజర్ వేణుగోపాల్, సిబ్బంది బ్యాంకు తాళాలు వేసి ఇంటికి వెళ్లారు. 2న గాంధీ జయంతి సందర్భంగా సెలవు కావడంతో బ్యాంకు తెరవలేదు.
 
గురువారం ఉదయం 9 గంటలకు బ్యాంకు మేనేజర్, సిబ్బంది వచ్చి చూసేసరికి వెనక ఉన్న తలుపులు, కిటికీలు తెరచి ఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించా రు. బ్యాంకు వెనుకవైపు తలుపులను గ్యాస్ కట్టర్‌తో కట్ చేసి లోపలి గడియను చేతితో తీసిలోనికి ప్రవేశించారు. లోపల ఉన్న గదిలోని కిటికీ ఇనుపచువ్వలను గ్యాస్ కట్టర్‌తో తొలగించి స్ట్రాంగ్ రూంలోకి దూరారు. అందులోని లాకర్లను గ్యాస్ కట్టర్‌తో కట్ చేయడానికి దుండగులు విఫలయత్నం చేశారు. గ్యాస్ అయిపోవడంతోనే దాదాపు మూడు గంటల సేపు శ్రమించి వెనుదిరిగినట్లు తెలుస్తుంది. లాకర్లు పటిష్టంగా ఉండడంతో తెరుచుకోకపోవడంతో దుండగులు నిరాశకు గురై చోరీ యత్నాన్ని విరమించుకుని పరారైనట్లు పోలీసులు భావిస్తున్నారు.

ఒకవేళ లాకర్లు తెరిచి ఉంటే అందులో ఉన్న రూ.7 లక్షలతోపాటు, తాకట్టు పెట్టిన 252 బంగారు ఆభరణాల ప్యాకెట్లు చోరీకి గురయ్యేవి. ఈ ఘటనతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బ్యాంకు మేనేజర్ వేణుగోపాల్ ఫిర్యాదు మేరకు జనగామ రూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై సతీష్, సీసీఎస్ సీఐ శ్రీనివాస్, ఫింగర్ ప్రింట్ సీఐ రఘు బృందాలు రంగంలోకి దిగి బ్యాంకులో అణువణువు క్షుణ్ణంగా పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్ బ్యాంకు పరిసర ప్రాంతాలను నిశితంగా పరిశీలించింది.
 
భద్రతలో బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం

 గతంలోనూ ఇదే  బ్యాంకులో చోరీ ుత్నం జరిగినా బ్యాంకు అధికారులు మాత్రం ఎలాం టి జాగ్ర త్తలు తీసుకోలేకపోయారు. బ్యాంక్ వెనుక ఖాళీస్థలం ఉండడంతో దుండగులు లోపలికి వెళ్లేందుకు సులువుగా మారింది. బ్యాంకులోని తలుపులు, కిటికీలు, లాకర్లపై గ్యాస్ కట్టర్ వాడినా బ్యాంక్‌లో అలారం మోగకపోవడం బ్యాంకు అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. బ్యాంకులోని సీసీ కెమెరాల్లో రికార్డయిన దుండగుల దృశ్యాలను గుర్తించి పట్టుకుంటామని  పోలీసులు తెలిపారు. సీబీఐ రీజనల్ మేనేజరు డీఆర్ చాల్లీ, సెక్యూరిటీ అధికారి శివరాం సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
 

మరిన్ని వార్తలు