పొత్తులపై నిర్ణయం కేంద్ర కమిటీదే

3 Feb, 2014 01:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల పొత్తు ఖరారు వ్యవహారాన్ని పార్టీ కేంద్ర కమిటీకి అప్పగిస్తూ సీపీఎం రాష్ట్ర కమిటీ తీర్మానించింది. రెండు రోజులపాటు హైదరాబాద్‌లో జరిగిన సమావేశాల్లో ఎన్నికల ఎత్తుగడలు, సర్దుబాట్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో రాష్ట్ర కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కమిటీ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని కేంద్ర కమిటీని కోరినట్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు ఆదివారమిక్కడ మీడియాకు తెలిపారు. ఇప్పటిదాకా తమ ముందు మూడు మార్గాలుండేవన్నారు. అయితే టీడీపీ.. బీజేపీ వైపు వెళుతుండటంతో ఒకటి మూసుకుపోయిందని వ్యాఖ్యానించారు. మిగతా రెండింటిలో ఒకటి స్వతంత్రంగా వెళ్లటం మరొకటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు.  సీపీఐతో కలసి పని చేయాలన్నదన్నదే తమ చర్చల్లో మొదటి అంశమన్నారు. సీపీఐతో మాట్లాడాకే తమ నిర్ణయం ఉంటుందన్నారు.
 
 పొత్తులతో అనూహ్య ఫలితాలు: వైఎస్సార్ సీపీతో పొత్తుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ గతంలో దీనిపై చర్చించలేదని, ఇప్పుడు మాత్రం చర్చించామని రాఘవులు వివరించారు. వివిధ అంశాలపై భిన్నాభిప్రాయలున్నా సీపీఐతో కలసి పని చేయడానికి, సర్దుబాట్లకు ఆటంకమేమీ ఉండబోదన్నారు. రాష్ట్ర విభజన తర్వాత టీఆర్‌ఎస్‌తో సర్దుబాట్లు ఉంటాయనేదాన్ని ఇప్పుడు చెప్పలేమన్నారు. రెండు రాష్ట్రాలు ఏర్పడితే రెండు కమిటీలుంటాయని, అవి చర్చించి నిర్ణయాలు తీసుకుంటాయన్నారు. గతానికి భిన్నంగా మున్ముందు పొత్తులు, సర్దుబాట్ల ప్రాధాన్యత పెరుగుతుందని, ఫలితాలు కూడా అనూహ్యంగా ఉంటాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 41 అసెంబ్లీ, ఆరు లోక్‌సభ (4 తెలంగాణ, 2 సీమాంధ్ర) సీట్లలో పోటీ పడాలనుకుంటున్నట్టు తెలిపారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటేయదగిన అభ్యర్ధి లేకపోవడం, రెబెల్ లేదా ఇతరులకు ఓటేయాలనుకోకపోవడం వల్లే దూరంగా ఉండాలని నిర్ణయించామన్నారు. వామపక్షాల సమైక్య పోరాటంలో ఇటీవలి కొంత స్తబ్ధత నెలకొన్నా విద్యుత్, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ లాంటి సమస్యలపై కలిసే ఆందోళనలు నిర్వహించామన్నారు.
 
 విద్యుత్తు చార్జీలపై రేపు హైదరాబాద్‌లో ధర్నా: విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలకు వ్యతిరేకంగా మంగళవారం హైదరాబాద్‌లోని సెంట్రల్ డిస్కం వద్ద ధర్నా చేయాలని రాఘవులు ప్రజలకు పిలుపునిచ్చారు.  6 నుంచి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మూడు రోజులకే కుదించకుండా ప్రజాసమస్యలపై చర్చించేందుకు వీలుగా పొడిగించాలని డిమాండ్ చేశారు. 8 నుంచి జరిగే మున్సిపల్ సిబ్బంది సమ్మెకు మద్దతు ప్రకటించారు.
 
 సీపీఎం రాష్ట్ర కమిటీ తీర్మానాలు: హోంగార్డుల వేతనాలు పెంచాలి; కాంట్రాక్ట్, క్యాజువల్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని పర్మినెంట్ చేయాలి; విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలి; అంగన్‌వాడీల వేతనాలు పెంచాలి.
 

మరిన్ని వార్తలు