రండి.. నిరూపించండి  

14 Apr, 2019 02:20 IST|Sakshi

ఈవీఎంల పనితీరుపై రేపే ఢిల్లీలో చర్చిద్దాం

క్రిమినల్‌ కేసు నమోదైన వేమూరి హరిప్రసాద్‌తో మేం చర్చించం

మీకిష్టం వచ్చిన వేరే నిపుణుడిని పంపండి

సీఎం చంద్రబాబుకు కేంద్ర ఎన్నికల సంఘం ఘాటు లేఖ   

సాక్షి, న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఈవీఎం) పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో దీనిపై నిజానిజాలు నిరూపించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. చంద్రబాబు సూచించిన ఏ నిపుణుడితోనైనా ఈవీఎంల పనితీరుపై సోమవారం చర్చించేందుకు తాము సిద్ధమని ఈసీ ప్రకటించింది. అయితే ఈవీఎంలను దొంగతనం చేసిన వ్యవహారంలో క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న వేమూరి హరిప్రసాద్‌తో తాము వీటిపై చర్చించబోమని స్పష్టం చేసింది. సీఎం చంద్రబాబు బృందం వేమూరి హరిప్రసాద్‌తో కలసి శనివారం తమతో సమావేశం కావడం పట్ల ఈసీ విస్మయం వ్యక్తం చేసింది. అసలు ఇలాంటి నేర చరిత్ర కలిగిన వ్యక్తి మీ బృందంతో కలసి ఎలా వచ్చారో మాకు అంతుబట్టకుండా ఉందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో మీరు సూచించే మరో ఇతర నిపుణుడితోనైనా వీటి పనితీరుపై చర్చించేందుకు తాము సిద్ధమని తెలిపింది. ఈమేరకు సీఎం చంద్రబాబుకు ఈసీ ఓ ఘాటు లేఖ రాసింది. కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి స్టాన్‌డోప్‌ యులంగ్‌ ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ద్వారా టీడీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు కనకమేడల రవీంద్రకుమార్‌ పేరుతో లేఖ రాశారు. అందులోని అంశాలను తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియచేయాలని సూచిస్తూ మరో లేఖను జత చేశారు.  

ఈసీ లేఖలో సారాంశం ఇదీ.. 
‘చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రతినిధి బృందం శనివారం మధ్యాహ్నం మాతో సమావేశమైనప్పుడు ఈవీఎంలు, వాటి పనితీరు అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా బృందంలోని సభ్యుడొకరు పదే పదే ఈవీఎంల పనితీరుకు సంబంధించిన సాంకేతిక అంశాలను ప్రస్తావించారు. సంబంధిత అంశంలో తనకు చాలా నైపుణ్యం ఉందని చెప్పారు. ఈ క్రమంలో అతడితోపాటు అలాంటి నేపథ్యమే ఉన్న మరొకరు కలిసి ఈవీఎం విభాగం ఇన్‌చార్జి అయిన డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ సుదీప్‌జైన్, ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్, టెక్నికల్‌ ఎక్స్‌పర్ట్‌ కమిటీ ఛైర్మన్‌ డి.టి.సహానీతో చర్చించి వారి స్పందనను తెలుసుకోవచ్చని సూచించాం. ఈమేరకు ప్రొఫెసర్‌ డి.టి.సహానిని అభ్యర్థించి సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం కూడా ఏర్పాటు చేశాం. అయితే మీ బృందంలోని సదరు సభ్యుడి పేరు హరిప్రసాద్‌ అని, అతడి మీద 2010లో ఈవీఎంను దొంగతనం చేశాడన్న అభియోగంతో 2010 మే 13వతేదీన సీఆర్‌ నెంబరు 159 ఆఫ్‌ 2010 నెంబరుతో ముంబైలో క్రిమినల్‌ కేసు నమోదైందని గుర్తించాం. సంబంధిత కేసులో దర్యాప్తు ఏ విధంగా ఉన్నప్పటికీ.. గత చరిత్ర అతడిపై విశ్వాసాన్ని కలిగించజాలదు. సంబంధిత కేసు వివరాలు, అతడి ఫోటోతో కూడిన అంశాలు కూడా జత చేస్తున్నాం..’ 

ఎలా వచ్చారో మిస్టరీగా ఉంది.. 
‘ఇలాంటి నేర చరిత్ర ఉన్న సదరు నిపుణుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబునాయుడి నేతృత్వంలోని ప్రతినిధి బృందంలో ఎలా వచ్చారన్నది మిస్టరీగా మారిందని మీ దృష్టికి తెస్తున్నాం. సదరు హరిప్రసాద్‌తో ఎలాంటి చర్చలు తగినవి కాదని భావిస్తున్నాం. ఇలాంటి చరిత్ర లేని సాంకేతిక నిపుణుడిని సోమవారం ఉదయం 11 గంటలకు సుదీప్‌జైన్, ప్రొఫెసర్‌ సహానీతో చర్చించేందుకు పంపగలరు..’  

మరిన్ని వార్తలు