థర్మల్‌.. డేంజర్‌ బెల్‌!

13 May, 2019 03:17 IST|Sakshi

‘రాజధాని’లో జనంపైకి విషవాయువులు

10 కి.మీ. మేర ప్రాణాంతకమే

థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలపై కేంద్ర పర్యావరణ శాఖ

తక్షణ కాలుష్య నియంత్రణ చర్యలకు సిఫార్సు

సాక్షి, అమరావతి: థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు వెదజల్లే విషవాయువులు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతు న్నాయని కేంద్ర పర్యావరణ శాఖ మరోసారి రాష్ట్రాలను హెచ్చరించింది. కాలుష్య నియంత్రణ దిశగా ఆంధ్రప్రదేశ్‌లో ఏమాత్రం చర్యలు చేపట్టకపోవడాన్ని ప్రశ్నించింది. పర్యావరణ శాఖ తాజాగా పంపిన నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది. రాజధాని నగరం అమరావతికి అతి సమీపంలోని నార్లతాతారావు థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం (ఎన్‌టీటీపీ)లో దశాబ్దాల క్రితం థర్మల్‌ యూనిట్లు ఏర్పాటు చేశారు. అప్పట్లో ఇవి జనావాసాలకు దూరంగా ఉన్నాయి. ఇప్పుడు అతి సమీపంలోనే రాజధానితో పాటు పెద్ద ఎత్తున కాలనీలు వెలిశాయి. దీంతో ప్రజలు అతి భయంకరమైన విషవాయువుల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అదీగాక నైట్రోజన్, సల్ఫ్యూరిక్‌ యాసిడ్స్‌ వల్ల భయంకరమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తేల్చి చెప్పింది. కడపలోని ఆర్టీపీపీ, నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంతో పాటు పలు ప్రైవేటు విద్యుత్‌ కేంద్రాలకు సమీపంలోనూ ఇలాంటి ప్రమాదకర పరిస్థితి ఉన్నట్టు తెలిపింది. 

10 కిమీ వరకూ డేంజరే
థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు 10 కిలోమీటర్ల పరిధిలో భయంకరమైన పరిస్థితులున్నాయని పర్యావరణ శాఖ అధ్యయనంలో వెల్లడైంది. థర్మల్‌ కేంద్రాల్లో కాల్చే బొగ్గు నుంచి వెలువడే కాలుష్యం గుండె జబ్బులు, దీర్ఘకాలిక  శ్వాసకోస వ్యాధులు, ఆస్తమా తదితర రుగ్మతలకు కారణమవుతుందని తెలిపింది. గడచిన ఐదేళ్లుగా రాష్ట్రంలోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల వద్ద దాదాపు 90 వేల మంది ఆస్తమాకు గురైనట్టు తేలింది. ప్రాణాంతక వ్యాధుల వల్ల మృత్యువాత పడే ఐదేళ్లలోపు పిల్లల సంఖ్య గడచిన నాలుగేళ్లుగా ఎక్కువగా ఉందని పేర్కొంది. కాలుష్యం బారిన పడి ఆనారోగ్యానికి గురవుతున్న వారిలో పేదలు, మైనార్టీలు, వృద్ధులు, చిన్నారులు ఎక్కవగా ఉన్నారు. వీరు ఆరోగ్యం కోసం చేసే వ్యయం కోట్లలో ఉంటోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ బొగ్గు వినియోగం వల్ల పార్టిక్యులేట్‌ మ్యాటర్‌ – 2.5 (పిఎం 51,500 టన్నులు), పిఎం 10 (1,07,500 టన్నులు), సల్ఫర్‌డై ఆక్సైడ్‌ 1,99,500 టన్నులు), నైట్రిక్‌ ఆక్సైడ్‌ (1,87,500 టన్నులు), కార్బన్‌మోనాక్సైడ్‌(1,04,000 టన్నులు) వెలువడినట్టు నివేదిక వెల్లడించింది. గాలిలో కలిసిన ధూళికణాలు 2.5 మైక్రాన్స్‌ (మనిషి వెంట్రుక మందంలో 30వ వంతు కన్నా చిన్నవి), పరిమాణంలో ఉంటే, నేరుగా ఊపిరితిత్తులోకి వెళ్ళి ఆ తర్వాత రక్తంలో కలుస్తాయి. అనారోగ్యానికి కారణమవుతాయి. 

సముద్ర జీవులకూ ముప్పే
రాష్ట్రంలో సముద్ర తీర ప్రాంతాల్లో ఏర్పాటైన థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నుంచి వెలువడే విష రసాయనాలను సముద్రంలోకే విడుస్తున్నారు. దీని వల్ల మత్స్య తదితర జీవులకూ తీవ్ర నష్టం వాటిల్లుతోంది. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల పరిధిలో అసాధారణంగా 40–50 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకూ ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. దీని వల్ల ఆ పరిసరాల్లోని వరి, మామిడి, జీడిమామిడి, కొబ్బరి తోటలు అంతరించిపోతున్నాయి. చిమ్నీ పొగ ద్వారా వెలువడిన వాయువులతో ఆమ్ల వర్షాలు వస్తున్నాయి. ఇవి పంటలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పర్యావరణ శాఖ పేర్కొంది. ప్లాంట్‌ నుంచి వచ్చే బూడిదను 30 ఏళ్ల వరకూ నిల్వ చేయడం వల్ల మత్స్య సంపద, సహజ నీటి వనరులకు నష్టం వస్తోంది. ఈ నేపథ్యంలో అత్యధికంగా కాలుష్యం వెదజల్లే థర్మల్‌ ప్లాంట్లలో ఉత్పత్తి ఆపివేయాలని సూచించింది. వీలుకాని పక్షంలో సల్ఫ్యూరిక్‌ యాసిడ్, నైట్రిక్‌ యాసిడ్‌ తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. దీనికి వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని, ఇంత మొత్తం ఏపీ జెన్‌కో సమకూర్చుకునే స్థితిలో లేదని అధికారులు అంటున్నారు. ఏదేమైనప్పటికీ కాలుష్య నియంత్రణ దిశగా తీసుకునే చర్యలపై నివేదిక ఇవ్వాలని కేంద్ర పర్యావరణ శాఖ రాష్ట్ర విద్యుత్‌ సంస్థలను కోరింది. 

మరిన్ని వార్తలు