మండల, జిల్లా పరిషత్‌లకు కేంద్ర నిధులు

23 Feb, 2020 04:36 IST|Sakshi

15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలపై విధివిధానాలు ఖరారు 

రాష్ట్రాలకు సమాచారం ఇచ్చిన కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ

కేంద్ర నిధుల్లో గ్రామ పంచాయతీలతోపాటు మండల, జిల్లా పరిషత్‌లకూ వాటా 

70–85 శాతం.. 10–25 శాతం.. 5–15 శాతం చొప్పున కేటాయించాలని రాష్ట్రాలకు స్పష్టీకరణ  

సాక్షి, అమరావతి:  గత ఐదేళ్లుగా నిధుల లేమితో కొట్టుమిట్టాడిన జిల్లా, మండల పరిషత్‌లకు ఊరట దక్కనుంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల్లోని పంచాయతీరాజ్‌ సంస్థలకు ఇచ్చే నిధులను గ్రామ పంచాయతీలతో పాటు మండల, జిల్లా పరిషత్‌లకు సైతం కేటాయించాలని నిర్ణయించారు. ఈ మేరకు పంచాయతీరాజ్‌ సంస్థలకు 15 ఆర్థిక సంఘం నిధుల విడుదలకు సంబంధించిన విధివిధానాలు కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ ఖరారు చేసింది. శుక్రవారం రాష్ట్రాలకు సమాచారమిచ్చింది.  

మొండిచేయి చూపిన 14వ ఆర్థిక సంఘం  
కేంద్ర ప్రభుత్వం తనకు వచ్చే పన్ను వాటాలో కొంత మొత్తాన్ని ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్రాలతో పాటు స్థానిక సంస్థలకు నేరుగా అందజేస్తుంది. 2015 ఏప్రిల్‌ నుంచి 2020 మార్చి మధ్య ఐదేళ్ల కాలానికి అమల్లో ఉన్న 14వ ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా పంచాయతీరాజ్‌ సంస్థలకు కేంద్రం విడుదల చేసే నిధుల్లో 100 శాతం నిధులను గ్రామ పంచాయతీలకే కేటాయిస్తూ అప్పట్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతకు ముందు 13వ ఆర్థిక సంఘం అమల్లో ఉన్నప్పుడు కేంద్రం ఇచ్చే నిధుల్లో 70 శాతం గ్రామ పంచాయతీలకు, 20 శాతం జిల్లా పరిషత్‌లకు, 10 శాతం మండల పరిషత్‌లకు కేటాయించేవారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల కారణంగా మండల, జిల్లా పరిషత్‌లు నిధులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా నిధులివ్వకపోవడంతో మండల, జిల్లా పరిషత్‌ల్లో అభివృద్ధి నిలిచిపోయింది.  

రాష్ట్రాలకు కొంత స్వేచ్ఛ  
కేంద్రం విడుదల చేసే 15వ ఆర్థిక సంఘం నిధుల్లో 70–85 శాతం నిధులను గ్రామ పంచాయతీలకు.. 10–25 శాతం నిధులను మండల పరిషత్‌లకు.. 5–15 శాతం నిధులను జిల్లా పరిషత్‌లకు కేటాయించాలని కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ రాష్ట్రాలను ఆదేశించింది. నిర్ణీత పరిమితికి లోబడి ఎంతెంత కేటాయింపులు చేయాలన్న దానిపై రాష్ట్రాలకు కొంత స్వేచ్ఛ ఇస్తున్నట్టు పేర్కొంది. రెండంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థ ఉన్నచోట(ఆంధ్రప్రదేశ్‌ కాదు) గ్రామ పంచాయతీలకు 70–85 శాతం.. జిల్లా పరిషత్‌లకు 15–30 శాతం నిధులు కేటాయించాలని కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ స్పష్టం చేసింది. 

ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,625 కోట్లు   
15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏపీలోని గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌లకు కలిపి రూ.2,625 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ పేర్కొంది. తెలంగాణ రాష్ట్రానికి రూ.1,847 కోట్లు కేటాయించింది. పరిమితికి లోబడి ఏ పంచాయతీరాజ్‌ సంస్థకు ఎన్ని నిధులను కేటాయిస్తారన్న వివరాలను ఏప్రిల్‌లోగా కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖకు తెలియజేస్తే జూన్‌లో మొదటి విడత నిధులు విడుదల చేస్తామని కేంద్రం వెల్లడించింది.   

మరిన్ని వార్తలు