ఏపీ ప్రభుత్వానికి కేంద్రం మరో షాక్‌

11 Apr, 2017 12:23 IST|Sakshi
ఏపీ ప్రభుత్వానికి కేంద్రం మరో షాక్‌

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కేంద్రం మరో షాక్‌ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్ట్‌ అంచనా వ్యయం పెరిగితే రాష్ట్రమే భరించాలని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. 2014 ఏప్రిల్‌ నాటి అంచనా వ్యయాన్నే కేంద్రం భరిస్తుందని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి స్పష్టం చేశారు. సోమవారం రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అడిగిన లిఖిత పూర్వక ప్రశ్నకు...  ఉమాభారతి ఈ మేరకు సమాధానం ఇచ్చారు.

2016 సెప్టెంబర్‌ 30న కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన ఆదేశాల ప్రకారం... 2014 ఏప్రిల్ 1 నుంచి పోలవరం సాగునీటి విభాగానికి అయ్యే ఖర్చును 100 శాతం కేంద్రమే భరిస్తుంది. ఆ రోజుకు సాగునీటి విభాగానికి అయ్యే ఖర్చు వరకే ఇది పరిమితం. ఏప్రిల్ 2014 నాటి ధరల ప్రకారం సాగునీటి ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం పెరిగితే.... ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని ఉమా భారతి స్పష్టం చేశారు.

కాగా రాష్ట్రానికి వర ప్రదాయిని అయిన పోలవరం ప్రాజెక్టుకు 2017–18 బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.9 కోట్లను మాత్రమే కేటాయించింది. పోలవరం ప్రాజెక్ట్‌ వ్యయంపై రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసిన స్థాయిలో కేంద్రం రుణం మంజూరు చేసే అవకాశం లేదని కరాఖండిగా చెప్పడం ఏపీ సర్కార్‌కు నిరాశే మిగిల్చింది.

రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పోలవరం నిర్మాణ బాధ్యతలను కేంద్రానికే అప్పగించి ఉంటే.. ఆ ప్రాజెక్టు ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చి ఉండేది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవడంతో ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కేంద్రం రాష్ట్రానికి అప్పగించేందుకు కేంద్రం అంగీకరించింది. అయితే ఏప్రిల్‌ 1, 2014 నుంచి చేసిన ఖర్చును మాత్రమే రీయింబర్స్‌మెంట్‌ చేస్తామని స్పష్టం చేసింది. ఆ నిధులను కూడా నాబార్డు ద్వారా రుణం ఇప్పిస్తామని తేల్చిచెప్పింది.

ఇదే అదునుగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కమీషన్ల కోసం పోలవరం అంచనా వ్యయాన్ని రూ.40,351.65 కోట్లకు పెంచేస్తూ ప్రతిపాదనలు పంపింది. ఏటా ధరల సర్దుబాటు కింద పది శాతం అంచనా వ్యయం పెరుగుతుందని.. 2019 నాటికి అంచనా వ్యయం రూ.42 వేల కోట్లకు చేరుకుంటుందని నివేదించింది. ఏప్రిల్‌ 1, 2014 నుంచి గత ఫిబ్రవరి ఆఖరు నాటికి రూ.3,762.52 కోట్లు ఖర్చు చేశామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.

ఇలా అరకొరగానే కేటాయింపులు చేస్తూ.. 2019 నాటి పోలవరంను పూర్తి చేస్తామని  చెబుతున్నారు. అలా పూర్తి కావాలంటే రాష్ట్ర ప్రభు త్వ అంచనాల ప్రకారమే  మరో రూ.33 వేల కోట్లు కావాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం 2017–18 బడ్జెట్‌లో కేటాయించింది కేవలం రూ.9 కోట్లు. మరోవైపు నాబార్డు రుణం మంజూరు అనుమానాస్పదమే.

మరిన్ని వార్తలు