కేపీ ఉల్లి ఎగుమతికి అనుమతించిన కేంద్రం

6 Feb, 2020 12:21 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణాపురం ఉల్లి ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం గురువారం నిషేధాన్ని ఎత్తివేసింది. కేపీ ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని తొలగించాలని ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రాన్ని కోరుతూ  లేఖ రాసిన సంగతి తెలిసిందే. అదే విధంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి కూడా ఉల్లి ఎగుమతికి తక్షణమే అనుమతినిచ్చి.. కేపీ ఉల్లి రైతులకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.  ఈ క్రమంలో కేపీ ఉల్లిని ఎగుమతి  చేసేందుకు అనుమతినిస్తూ కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అదేవిధంగా 10 వేల మెట్రిక్‌ టన్నుల ఉల్లిని చెన్నై నుంచి వెంటనే ఎగుమతి చేసుకునేందుకు అనుమతిని కూడా ఇచ్చింది.

‘కేపీ ఉల్లి ఎగుమతికి తక్షణమే అనుమతించాలి’

ఇక ఉల్లి పరిమాణంపై కడప హార్టికల్చర్‌ అధికారి సర్టిఫికెట్‌ జారీ చేసి మార్చి 31లోగా ఎగుమతులు పూర్తి చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు, ఎంపీ విజయసాయిరెడ్డికి, మిథున్‌రెడ్డికి కేపీ ఉల్లి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. కాగా అదేవిధంగా వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి, ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి... రైతులను వెంట తీసుకుళ్లి  కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ను కలిసి  కేపీ రైతుల సమస్యను ఆయనకు వివరించగా.. రెండు రోజులల్లో నిర్ణయం ప్రకటిస్తామని.. ఆయన హామీ ఇచ్చినట్లు మిథున్‌రెడ్డి ఇదివరకే తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇచ్చిన హామీ మేరకు కేపీ ఉల్లి ఎగుమతికి అనుమతిని ఇస్తూ కేంద్రం నిషేధాన్ని తొలగించినట్లు ప్రకటించింది.

మరిన్ని వార్తలు