కేంద్ర ప్రభుత్వ తీరు దారుణం: తులసిరెడ్డి

13 Feb, 2015 19:47 IST|Sakshi
కేంద్ర ప్రభుత్వ తీరు దారుణం: తులసిరెడ్డి

వైఎస్‌ఆర్‌జిల్లా : నాగార్జున సాగర్ జలాలు విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని రెండు తెలుగు రాష్ట్రాల రైతులు కోరుతున్నా కేంద్రం జోక్యం చేసుకోకపోవడం నిర్లక్ష్యానికి పరాకాష్ట అని రాజ్యసభ మాజీ సభ్యులు నర్రెడ్డి తులసిరెడ్డి విమర్శించారు. వైఎస్సార్ జిల్లా వేంపల్లెలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు రైతులకు ఎంతగానో ఉపయోగపడగా నేడు రెండు తెలుగు రాష్ట్రాలలోని రైతుల ఘర్షణలకు కారణం కావడం బాధాకరమన్నారు. రైతులను తీసుకొనివెళ్లి సాగర్ గేట్లను పగులగొడతామని ప్రజాప్రతినిధులు అంటున్నారంటే సమస్య పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నానన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను కృష్ణా నది యాజమాన్య బోర్డు పరిధిలోకి తీసుకొని వచ్చి బచావత్‌కమిటీ తీర్మానం ప్రకారం పంపిణీ చేయాలని ఏపీ పునర్‌ఃవ్యవస్థీకరణ చట్టంలోని 84, 85, 86, 87, 88, 89సెక్షన్ల ప్రకారం చెప్పార న్నారు. ఆ ప్రకారం ఆ రెండు ప్రాజెక్టులను కృష్ణా నది బోర్డు పరిధిలోకి తెస్తూ కేంద్రం నోటిఫై చేయాల్సి ఉందన్నారు. ఇదే విషయాన్ని ఏపీ, తెలంగాణా ప్రభుత్వాలు కృష్ణా నది బోర్డు కేంద్రానికి లేఖలు రాసిన వాటిపై స్పందించకపోవడం మోడి ప్రభుత్వ తీరుకు అద్దం పడుతోందన్నారు. పంటలు ఎండక ముందే సమస్యను పరిష్కరించాలని ఆయన కేంద్రాన్ని కోరారు.

(వేంపల్లె)

మరిన్ని వార్తలు