చదువుల వెంటే కొలువులు

23 Nov, 2019 04:36 IST|Sakshi

వర్సిటీ–ఇండస్ట్రీ లింకేజ్‌పై త్వరలో కేంద్రం నూతన విధానం

సాక్షి, అమరావతి: చదువులు పూర్తవ్వగానే విద్యార్థులకు ఉపాధి మార్గాలు మెరుగవ్వాలంటే విద్యాసంస్థలకు, పరిశ్రమలకు మధ్య గట్టి అనుసంధానం ఏర్పాటు చేయాలని కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ భావిస్తోంది. విశ్వవిద్యాలయాలు, పరిశ్రమల (యూ–ఐ) అనుసంధానంపై ఏర్పాటయిన వర్కింగ్‌ గ్రూప్‌ తన నివేదికను ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ)కు అందించింది. దీనిపై అన్ని వర్గాలనుంచి అభిప్రాయాలను స్వీకరిస్తున్న కేంద్రం.. త్వరలోనే కొత్త విధానాన్ని  ప్రకటించనుంది. నిపుణుల కమిటీ సూచనల ప్రకారం.. వివిధ పరిశోధనలపై పేటెంటు హక్కు కలిగిన నిపుణులు, శాస్త్రవేత్తలతో టెక్నాలజీ ఇన్నోవేషన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సెల్‌ (టీఐఈసీ)లను ప్రతి వర్సిటీలో ఏర్పాటు చేస్తారు. బోధన, పరిశోధనలు, ఇంటెలెక్చ్యువల్‌ ప్రాపర్టీ (ఐపీ) టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌ తదితర అంశాల్లో ఈ కేంద్రాలు.. వర్సిటీలు, పరిశ్రమలకు మధ్య అనుసంధానం చేస్తాయి. ఇందుకు యూ–ఐ ఫెసిలిటేషన్‌ ఫండ్, యూ–ఐ ఆర్డీ ఫండ్, ఐపీ ఫండ్‌లను యూజీసీ ద్వారా కేంద్రం సమకూర్చనుంది. ఈ కార్యక్రమాలకోసం కేంద్ర ప్రభుత్వం ఏటా రూ. 225 కోట్లు యూజీసీకి బడ్జెట్లో కేటాయించనుంది.

పాఠ్య ప్రణాళికల్లో మార్పులు
పరిశ్రమలకు అవసరమైన రీతిలో వర్సిటీల కార్యక్రమాలు, పాఠ్య ప్రణాళికల్లో మార్పులు చేయనున్నారు. పరిశ్రమలకు అవసరమైన కోర్సులు ప్రవేశపెడతారు. పాఠ్యాంశాల రూపకల్పనలో పరిశ్రమలను కూడా భాగస్వామ్యం చేస్తారు. విద్యార్థులు, పరిశోధకులకు ‘పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్‌’ తప్పనిసరి చేస్తారు. వర్సిటీలు, పరిశ్రమలు కలిసి ‘జాయింట్లీ ఫండెడ్‌ పీహెచ్‌డీ’ కార్యక్రమాలను ప్రారంభిస్తాయి.

ప్రయోజనాలు ఇవీ..
- వర్సిటీ–పరిశ్రమల అనుసంధానం ద్వారా అతి తక్కువ ఖర్చుతో విద్యార్థులకు నూతన పరిజ్ఞానం అందుతుంది.
సైన్సు తదితర అంశాల్లో నూతన నైపుణ్యాలు కలిగిన సిబ్బంది అందుబాటులో ఉంటారు.
అతి తక్కువ ఖర్చుతో పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) ఫలవంతమవుతుంది. తద్వారా ప్రజాధనం ఆదా అవుతుంది.
ఈ పరిశోధనల ద్వారా వర్సిటీలకు అదనపు ఆదాయం ఉంటుంది. పరిశోధన ప్రక్రియలు విస్తృతం అవుతాయి. 
పరిశ్రమల వాస్తవిక సమస్యలపై లోతైన అధ్యయనం జరగడం ద్వారా సమస్యలను గుర్తించి, వాటికి శాశ్వత పరిష్కారాలు చూడవచ్చు. 
విద్యార్థుల్లో సామర్థ్యాల పెంపు.
ఇంటర్న్‌షిప్‌లు తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.
ఇండస్ట్రీలనుంచి వచ్చే అనుభవాంశాల ఆధారంగా పాఠ్యప్రణాళికల రూపకల్పన
పరిశ్రమల ప్రతినిధుల నుంచి టీచింగ్‌ ఫ్యాకల్టీ ఏర్పాటు.
- పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో రీసెర్చి పార్కుల ఏర్పాటు.
శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవడానికి, పరిశోధనలను చేపట్టే దిశగా ప్రోత్సాహకాలు.
ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లపై నూతన కోర్సులు.
పారిశ్రామిక భాగస్వామ్యంతో ‘అప్లయిడ్‌ రీసెర్చి’కి ప్రాధాన్యత.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా