ప్రైవేటు ‘పవర్‌’

24 Feb, 2020 03:46 IST|Sakshi

ప్రజలకు చౌకగా అందించేలా పోటీ 

రాష్ట్రాల ముందుకు కేంద్రం ప్రతిపాదనలు

నేడు ఢిల్లీలో రాష్ట్రాల అధికారులతో భేటీ

సాక్షి, అమరావతి: ప్రజలకు చౌకగా విద్యుత్తు అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం విద్యుత్తు సరఫరా రంగంలోకి ప్రైవేటు పంపిణీదారులను తీసుకురానుంది. ఇందుకోసం విద్యుత్‌ చట్టానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని సవరణలు ప్రతిపాదించింది. పోటీ ప్రపంచంలో విద్యుత్‌ సంస్థలనూ పరుగులు పెట్టించేందుకే ఈ మార్పులని కేంద్రం పేర్కొంది. ముఖ్యంగా విద్యుత్‌ వ్యవస్థలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం అవసరమని అభిప్రాయపడింది. దీనిపై రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది. ఈ నేపథ్యంలో సోమవారం న్యూఢిల్లీలో ఇంధన మంత్రిత్వశాఖ కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీకి రాష్ట్రం తరపున ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులపల్లి హాజరవుతున్నారు. ప్రతిపాదిత డ్రాఫ్ట్‌లోని సవరణలు ఈ విధంగా ఉన్నాయి.

పోటీతత్వమే శరణ్యం
ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలైన పంపిణీ సంస్థలే విద్యుత్‌ సరఫరా చేసేవి. వీటి స్థానంలో ప్రైవేటు విద్యుత్‌ పంపిణీ సంస్థలను ప్రోత్సహించాలి. ఏ సంస్థ తక్కువకు విద్యుత్‌ ఇస్తే దాన్నే వినియోగదారుడు తీసుకోవచ్చు. అంతే ప్రస్తుతం మొబైల్‌ నెట్‌వర్క్‌ల తరహాలోనే విద్యుత్‌ పంపిణీలోనూ ప్రైవేటు సంస్థల మధ్య పోటీ వాతావరణం ఉండాలి. ఈ పోటీ వాతావరణాన్ని ఎలా ప్రోత్సహించాలి? ప్రభుత్వ ప్రైవేటు పార్టనర్‌షిప్‌ (పీపీపీ) పద్ధతిలోనా? పంపిణీని ఫ్రాంచైజ్‌ ఇవ్వడమా? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. 

తక్కువ ధరకే విద్యుత్‌
వినియోగదారుడికి అతి తక్కువ ధరకే విద్యుత్‌ చేరాలి. దీనికోసం ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉండేలా డిస్కమ్‌లు చర్యలు చేపట్టాలి. సరఫరా పంపిణీ నష్టాలను గణనీయంగా తగ్గించాలి. ఏ రకమైన విద్యుత్‌ సబ్సిడీ అయినా నేరుగా ప్రజలకే చేరేలా డిస్కమ్‌లుండాలి. నేరుగా ప్రయోజనం (డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌–డిబిటీ) విధానాన్ని వచ్చే రెండేళ్లలో అమలులోకి తేవాలి. ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లను అందుబాటులోకి తేవాలి. ఈ విధానాన్ని రెండేళ్లలో అమలులోకి తెచ్చే ఏర్పాటు చేయాలి. 

డిస్కమ్‌లకు జరిమానా
2003 విద్యుత్తు యాక్ట్‌కు 2016లో చట్ట సవరణ ద్వారా తొలిసారి సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. తాజాగా మరోసారి ఇదే దారిలో కొన్ని ప్రతిపాదనలు రాష్ట్రాల ముందుకు తెచ్చింది. నాణ్యమైన, నిరంతర విద్యుత్‌ అందించేందుకు పంపిణీ, ఉత్పత్తిదారుల పనివిధానాన్ని విద్యుత్‌ నియంత్రణ మండళ్లు బేరీజు వేయాలి. సరైన విద్యుత్‌ సేవలు అందించడంలో డిస్కమ్‌లు విఫలమైతే వినియోగదారులకు నష్టపరిహారం చెల్లించాలి. నిర్థారిత సమయంలో విద్యుత్‌ అంతరాయాల పరిష్కరించకపోయినా, వినియోగదారులకు ముందుగా సమాచారం ఇవ్వకుండా విద్యుత్‌ కోతలు విధించినా డిస్కమ్‌లకు జరిమానా విధించాలి. 

నష్టాలులేని వ్యాపారం
విద్యుత్‌ సంస్థలు నష్టాలు లేకుండా ఉండాలంటే వాణిజ్య విధానాన్ని మార్చుకోవాలని, వ్యాపారణ ధోరణిలోనే వెళ్లాలని కేంద్రం భావిస్తోంది. ప్రైవేటు భాగస్వామ్యం వల్ల ఉత్పత్తిదారులకు జెన్‌కో వంటి సంస్థలు బకాయిలు పడే వీలుండదని పేర్కొంది. ఈ తరహా విధానాలను కొత్త డ్రాఫ్ట్‌ పాలసీలో పేర్కొంది. విద్యుత్‌ వాహనాల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటును ప్రస్తావిస్తోంది. సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని పెంచేలా చర్యలకు కేంద్ర సవరణ చట్టం వీలుకల్పిస్తోంది. 

మరిన్ని వార్తలు