రాష్ట్ర ఎన్నికలపై కేంద్రం ప్రత్యేక దృష్టి

31 Mar, 2019 04:41 IST|Sakshi

ప్రత్యేక పోలీసు అబ్జర్వర్‌ కేకేశర్మ రాక

శాంతి భద్రతల పరిస్థితిపై ప్రత్యేక నివేదిక అందజేత

రెండు రోజుల్లో ప్రత్యేక ఎన్నికల వ్యయ పరిశీలకుడు కూడా..

రాజకీయ పార్టీలకు అందజేసిన తుది ఓటర్ల జాబితా

వీవీప్యాట్‌లపై ఓటర్లలో అవగాహన కల్పిస్తున్నాం

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి దివ్వేది

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందని, అందుకనే తొలిసారిగా రాష్ట్రస్థాయిలో పోలీసు, వ్యయ పరిశీలకులను ఏర్పాటు చేసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ దివ్వేది తెలిపారు. రాష్ట్రస్థాయి పోలీసు పరిశీలకులుగా నియమించిన కేకే శర్మ శనివారం విజయవాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొని ఉన్న శాంతి భద్రతల పరిస్థితి, కావాల్సిన పోలీసు బలగాల వివరాలతో కూడిన ప్రత్యేక నివేదికను కేకే శర్శకు దివ్వేది అందజేశారు. శనివారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఒకటి రెండు రోజుల్లో ఎన్నికల వ్యయ పరిశీలకుల నియామకం జరగనుందని తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గాలకు వారిగా సాధారణ, వ్యయ, పోలీసు పరిశీలకులను పంపించిన సంగతి తెలిసిందే. 

అసెంబ్లీకి 2,395, పార్లమెంటుకు 344 మంది పోటీ 
రాష్ట్రంలో 175 మంది అసెంబ్లీ స్థానాలకు 2,395 మంది, 25 పార్లమెంటుకు 344 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు దివ్వేది తెలిపారు. రాజకీయ పార్టీలతో సమావేశమైన దివ్వేది తుది ఓటర్ల జాబితాను రాజకీయల పార్టీలకు అందజేశారు. అదే విధంగా ప్రతి జిల్లా కలెక్టర్లు రాజకీయ పార్టీలకు ఓటర్ల జాబితాను అందజేస్తారని తెలిపారు. రాష్ట్రానికి కేటాయించిన పరిశీలకులు పేర్లు, ఫోను నంబర్లను రాజకీయ పార్టీలకు అందజేస్తామని, ఏదైనా సమస్య ఉంటే వారిని సంప్రదించవచ్చని తెలిపారు.  

వేసిన ఓటు చూసుకోవచ్చు 
రాష్ట్రంలో తొలిసారిగా వీవీప్యాట్లను వినియోగిస్తున్నామని, వీటి ద్వారా ఓటరు వేసిన ఓటును ఒకసారి చూసుకునే వెసులుబాటు కలుగుతుందన్నారు. ఓటర్‌ వెరిఫయబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయిల్‌ (వీవీప్యాట్‌)లో వేసిన ఓటు ఏడు సెకన్లు కనిపించి బాక్స్‌లో పడుతుందన్నారు. ఒక గుర్తుకు  ఓటు వేస్తే వేరే గుర్తుకు ఓటు పడుతోందన్న అపోహలను తొలగించడానికి 2017జూన్‌ నుంచి జరుగుతున్న ఎన్నికల్లో వీవీప్యాట్‌లను వినియోగిస్తున్నామని, రాష్ట్రంలో తొలిసారిగా వీటిని ఉపయోగిస్తున్నామని తెలిపారు. అసెంబ్లీ నియోకవర్గంలో లాటరీ విధానంలో ఒక వీవీప్యాట్‌ను ఎంపిక చేసి, ఇందులో స్లిప్‌లను లెక్కించి ఈవీంఎలో పోలైన ఓట్లతో సరిపోల్చి చూడటం జరుగుతుందన్నారు.

వీవీప్యాట్‌ స్లిప్‌ ఎండలో ఎండినా, వానలో  తడిసినా పాడవదని, ఐదేళ్ల పాటు ఈ స్లిప్‌ చెరిగిపోకుండా ఉంటుందన్నారు. 1400 ఓటర్లకు ఒక వీవీప్యాట్‌ను వినియోగిస్తామని, ఓటర్లు 1400 మించి ఉంటే మరో పోలింగ్‌ బూత్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ద్వివేది తెలిపారు. ఆరు నెలల నుంచి వీవీప్యాట్‌లు, ఎలక్ట్రానికి ఓటింగ్‌ యంత్రాలపై అధికారులకు శిక్షణ ఇస్తున్నట్లు జాయింట్‌ సీఈవో మార్కేండేయులు తెలిపారు. ఈ విధానంలో ఈవీఎంల మిషన్లను ట్యాపరింగ్‌ చేసే అవకాశమే లేదని, స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద పటిష్టమైన రెండంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.  

>
మరిన్ని వార్తలు