జోరువానలో కేంద్ర మంత్రి సుడిగాలి పర్యటన

26 Oct, 2013 04:12 IST|Sakshi

గుండాల, న్యూస్‌లైన్: జోరువానలో మారుమూల ఏజెన్సీ మండలమైన గుండాలలో కేంద్ర సహాయ మంత్రి పోరిక బలరాంనాయక్ శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు. పినపాక మండలం నుంచి ద్విచక్ర వాహనంపై గుండాల మండలంలో గ్రామాలను సందర్శించారు. దామరతోగు, చినవెంకటాపురం, సాయనపల్లి, ఘనాపురం, ఎలగలగడ్డ, లింగగూడెం, చీమలగూడెం, నర్సాపురం తండా గ్రామాల్లో వర్షాన్ని సైతం లెక్కచేయక పర్యటించారు. ప్రజలతో మాట్లాడారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. రోడ్లు సరిగా లేని చోట్ల కాలినడకన వెళ్లారు. అంతేకాకుండా సాయనపల్లి-గుండాల మధ్య మల్లన్న వాగు, వెంకటాపురం కిన్నెరసాని వాగులను కాలినడక దాటి వెళ్లారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో ఆయన పర్యటన పోలీసులకు సవాల్‌గా మారింది. ఇల్లెందు, మణుగూరు డీఎస్పీలు క్రిష్ణ, రవీందర్, గుండాల, టేకులపల్లి సీఐ రాజిరెడ్డి, గుండాల, బోడు, కరకగూడెం ఎస్సైలు కరుణాకర్, ఆరీఫ్, అరుణ్ కుమార్‌ల ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ బలగాలతో భారీ బందోబస్తు నిర్వహించారు.
 
 కార్యకర్తల చురుగ్గా పనిచేయాలి
 మండలంలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు చురుగ్గా పని చేయాలని బలరామ్‌నాయక్ పిలుపునిచ్చారు. మండల పర్యటనలో భాగంగా స్థానిక తండాలో పార్టీ జెండాను ఆయన ఎగుర వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధి ఎప్పుడూ జరగలేదని అన్నారు. మండలంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ త్వరలోనే అన్ని పరిష్కారం అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, పార్టీ నాయకులు నర్సింహరావు, వెంకన్న, పాపారావు, దుర్గ, లక్ష్మయ్య, బుచ్చిరాములు, వీరస్వామి,రావుల సోమయ్య పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు