పోలవరంలో గడ్కరీ.. బయటపడ్డ డొల్లతనం

12 Jul, 2018 10:33 IST|Sakshi

సాక్షి పోలవరం : కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ పోలవరం పర్యటన సందర్భంగా ఏపీ జలవనరుల శాఖ డొల్లతనం  బయటపడింది. పోలవరం ప్రాజెక్ట్ జలాశయ నిర్మాణానికి సంబంధించిన కీలకమైన 45 డిజైన్లలో కేవలం 14 డిజైన్లనే ఆమోదించుకోవడంపై ఏపీ జలవనరుల శాఖ నిర్లక్ష్యాన్ని చాటుతోంది. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి గడ్కరీ అధికారులను ప్రశ్నించారు. సీడబ్ల్యూసీకి కనీసం డిజైన్లు కూడా పంపలేకపోయారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిజైన్లు లేకుండా ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారంటూ గడ్కరీ విస్మయం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు డిజైన్లు ఇంకా కొలిక్కి రాకపోవడానికి ఏపీ ప్రభుత్వం తీరే కారణమని ఆయన అసంతృప్తి  వ్యక్తం చేశారు. ఈ డిజైన్లు తయారుచేసి ఎప్పటిలోగా సీడబ్ల్యూసీకి పంపుతారంటూ ఆయన అధికారులను ప్రశ్నించారు. మొత్తానికి డిజైన్ల ఆమోదించుకోవడలో ఏపీ ప్రభుత్వ అలసత్వాన్ని గడ్కరీ ఎండగట్టారు.

పోలవరం ప్రాజెక్ట్ భూసేకరణ, పునరావాసం వ్యయాన్ని రూ. 30 వేల కోట్లకు పెంచడంపైనా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ ముంపు భూమి విస్తీర్ణం 2013 నాటితో పోలిస్తే ఎందుకు రెట్టింపు అయిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ప్రాజెక్టులోని సివిల్ పనులను పూర్తి చేయాలని ఆయన రాష్ట్ర అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి మొదటివారంలో మళ్లీ పోలవరం వచ్చి పనులు పరిశీలిస్తానని గడ్కరీ ఈ సందర్భంగా తెలిపారు. ప్రాజెక్టు వ్యయం అంచనాల పెంపుపై అనుమానాలు నివృత్తి చేస్తే నిధులిస్తామని ఆయన వెల్లడించారు.

మరిన్ని వార్తలు