రాణిగారు తలచుకుంటే..!

5 Mar, 2014 02:32 IST|Sakshi

అధికారంలో ఉన్న నాయకులు తమకు కేటాయించిన ప్రభుత్వ నిధులతో ప్రజ లకు ఉపయోగపడే పనులు చేస్తే ఓకే. అలా కాకుండా తమ ఆస్తులకు, బంధువుల ఇళ్లకు వెళ్లే  రోడ్ల కు ఖర్చు చేస్తే అది స్వప్రయోజనమే అవుతుంది. డివిజన్ కేంద్రమైన టెక్కలిలో కేంద్రమంత్రి కృపారాణి కేటాయించిన నిధులతో చేపడుతున్న పలు పనుల తీరును గమనిస్తే మాత్రం స్వప్రయోజనాల కోసమే అన్నట్టు ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి.
 
 
 టెక్కలి, న్యూస్‌లైన్: కేంద్రమంత్రి కిల్లి కృపారాణి స్వగ్రామమైన టెక్కలిలో అనేక చోట్ల సరైన రోడ్లు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వాటిపై దృష్టి సారించాల్సిన ఆమె కనీసం అటువైపు చూడకుండా కేవలం తమకు చెందిన వారి ఇళ్లకు, తమ ఆస్తులు కలిగిన రోడ్లకు సుమారు రూ. 13.80 లక్షలు వెచ్చించి సీసీరోడ్లు వేయిస్తున్నారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి.
 
  టెక్కలి నుంచి తెంబూరు రోడ్డుకు వెళ్లే దారిలో మంత్రి బంధువులకు చెందిన ఇళ్లు ఉండగా, వాటికి అనుకూలంగా ఉండేందుకుగాను ఎంపీ నిధుల నుంచి సుమారు నాలుగు లక్షల రూపాయలు కేటాయించడంతోపాటు ఆగమేఘాలపై సీసీ రోడ్లను వేసేశారు. అడిగిందే తడవుగా ఇంత త్వరగా రోడ్లు వేయడానికి ఆ మార్గంలో ఉన్న  మరికొన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అధిక ధరలు పలుకుతాయనే ఉద్దేమేనని స్థానికులంటున్నారు. ఇదిలా ఉండగా వైఎస్‌ఆర్ జంక్షన్ నుంచి శ్మశాన వాటికను ఆనుకుని మదర్‌థెరిసా కళాశాలకు ఎదురుగా ఉన్న కేంద్రమంత్రి స్థలంలో ఇటీవల ఓ బ్యాంకు కోసం త్వరితగతిన భారీ కట్టడాలు జరుగుతున్నాయి.
 
  జంక్షన్ నుంచి బ్యాంకు వరకు సీసీ రోడ్లు, మురుగు కాలువల కోసం ఎంపీ నిధుల నుంచి 9 లక్షల 80 వేల రూపాయల నిధులను మంజూరు చేయడంతో, ఆ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే ఈ ప్రాంతంలో కొన్ని నివాస గృహాలు ఉన్నప్పటికీ, హఠాత్తుగా ఈ రోడ్లు నిర్మాణానికి అధికార యంత్రాంగం చర్యలు చేపట్టడంపై మొదట్లో ఆ ప్రాంత వాసులకు అర్థం కాలేదు. ఆ తరువాత అసలు విషయం తెలుసుకుని ముక్కున వేలేసుకున్నారు. టెక్కలిలో అనేక వీధుల్లో సరైన రోడ్లు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. సమస్యలను పరిష్కరించాలని ప్రజలంతా పలుమార్లు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ స్పందించని అధికారులు మంత్రి ఆదేశాలతో లక్షలాది రూపాయల నిధులతో సీసీ రోడ్లు వేసుకుంటున్నారనే విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ రాణి గారు త లుచుకుంటే జరగని పని ఉంటుందా అని మరికొందరు గుసగుసలాడుతున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు