నెలరోజుల్లో 20 లక్షల కరోనా పరీక్షలు: గౌతంరెడ్డి

16 Apr, 2020 15:00 IST|Sakshi

సీఎం జగన్‌ ముందుచూపుతో కరోనా కట్టడి

పరిశ్రమలను ఆదుకుంటాం : మంత్రి గౌతమ్‌రెడ్డి

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న చర్యలను కేంద్ర మంత్రులు స్వయంగా అభినందిస్తున్నారని మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి అన్నారు. ప్రజలెవ్వరూ వైరస్‌ బారినపడకుండా సీఎం ఆదేశాల మేరకు అధికారులను కట్టుదిట్టమైన చర్యలను అమలు చేస్తున్నారని తెలిపారు. దీనిలో భాగంగానే రాష్ట్రంలో కరోనా పరీక్షల కిట్లను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్నామన్నారు. ఇప్పటికే 50 వేల కోవిడ్ కిట్లను ఉత్పత్తి చేశామని, అన్ని జిల్లాలు, మండలాలకు సరఫరా చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.

మంత్రి గౌతమ్‌ రెడ్డి గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ముందస్తు జాగ్రత్తగా మరో 50 వేల టెస్టింగ్ కిట్లను ఉత్పత్తి చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారని తెలిపారు. మొత్తం లక్ష కరోనా వైరస్‌ కిట్లతో రాష్ట్ర వ్యాప్తంగా నెలరోజుల్లో 20లక్షల పరీక్షలు చేస్తామని వెల్లడించారు. రెండు రోజుల్లో ఇండియన్ టెక్నాలజీతో వెంటిలేటర్లు తయారు చేస్తున్నామని, దేశంలో ఇలా తయారు చేసిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని పేర్కొన్నారు.

‘ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ ముందు చూపుతోనే ఇది సాధ్యమైంది. భవిష్యత్‌ను ముందే ఊహించి టెస్టింగ్ కిట్లను ఉత్పత్తి చేయాలని ఆదేశించారు. 35 రోజుల్లోనే టెస్టింగ్ కిట్ల ఉత్పత్తి చేయగలిగాం. పరిశ్రమల్లో ఉత్పత్తి పెంచేందుకు చర్యలు చేపట్టాం. కార్మికులకు, ఉద్యోగులకు రక్షణ కిట్లను అందిస్తాం. ఇందుకోసం ప్రభుత్వమే చర్యలు తీసుకుంటోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎంఎస్ఎంఈలను ఆదుకుంటాం. లాక్ డౌన్ నేపథ్యంలో ఎంఎస్ఎంఇ లకు రాయితీలివ్వాలని సీఎం భావిస్తున్నారు. కోవిడ్‌తో నష్టపోయిన పరిశ్రమలను ఆదుకోవాలని సీఎం చర్యలు చేపడుతున్నారు’ అని తెలిపారు.

>
మరిన్ని వార్తలు