మాకే సాయమూ అందలేదు

27 Nov, 2014 03:20 IST|Sakshi

రాకాసి గాలులకు పడిపోయిన చెట్లకు చిన్న చిన్న చిగుళ్లు వచ్చాయి. కూలిపోయిన ఇళ్ల స్థానంలో కొత్తవి రూపుదిద్దుకుంటున్నాయి. చిందరవందరగా మారిన తీరం ఇప్పుడు సర్దుకుంటోంది. ఇదిగో ఇప్పుడు వచ్చారు అధికారులు ‘మీ నష్టమెంత’ అని అడగడానికి. తుపాను వెళ్లిన నలభై రోజుల తర్వాత కేంద్ర బృందం జిల్లాలోని పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో జరిగిన నష్టాన్ని పరిశీలించింది. ఈ సందర్భం గా స్థానికులతో అధికారులు మాట్లాడారు. అయితే అధికారుల ప్రశ్నలకు మెజారిటీ ప్రజలు ఇచ్చిన జవాబు మాత్రం ‘మాకే సాయమూ అందలేదు’ అనే...
 
 భోగాపురం: తుపాను వెలిసిన నలభై రోజుల త ర్వాత వచ్చిన కేంద్ర బృందం వద్ద బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. మండలంలోని హుద్‌హుద్ ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం బుధవారం ఆయా ప్రాంతాల్లో పర్యటించింది. ముందుగా కవులవాడలో పడిపోయిన ఇళ్లను, కొబ్బరి తోటలను పరిశీలించింది. అనంతరం తూడెం గ్రామంలో కూలిన కొబ్బరి తోటలను అధికారులు పరిశీలించారు. దీనిపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు.  అక్కడ స్థానికులతో అధికారులు నష్టంపై మాట్లాడారు. అనంతరం దిబ్బలపాలెం గ్రామానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి తమకు బియ్యం తప్పించి ఎలాంటి సాయం అందలేదని బాధితులు తెలిపారు. ఇల్లు కూలిపోయినా నమోదు చేయలేదన్నారు. అనంతరం అధికారులు బమ్మిడి పేట వద్ద తుపానుకు కొట్టుకుపోయిన ఆర్‌అండ్‌బీ రోడ్డును పరిశీలించారు. భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో 20వంతెనలు పాడయ్యాయని దానికి రూ.65లక్షలు అవసరం అవుతుందని సంబంధిత శాఖ అధికారులు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో తారు రోడ్లకు కిలోమీటరుకి రూ.10లక్షల చొప్పున మెయింటనెన్స్‌కి నిధులు అవసరమని తెలిపారు. అనంతరం ముక్కాం  గ్రామంలో పర్యటించారు. ఇక్కడ మత్స్యశాఖ ఏర్పాటుచేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు.
 
 ఈ సందర్భంగా మత్స్యకారులకు అందాల్సిన సాయంపై మ త్స్యశాఖ ఏడి ఫణిప్రకాష్ వివరించారు. ఇక్కడి మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారని ఆయన కేంద్ర బృందం దృష్టికి తీసుకు వెళ్లారు. అనంతరం భోగాపురం గ్రామానికి చేరుకుని పశుసంవర్ధక శాఖ అధికారులతో మాట్లాడారు. తుపాను కారణంగా చనిపోయిన పశువులు, కోళ్ల పారాల్లో కోళ్లు, గొర్రెలు తదితర ఫొటోలను పరిశీలించారు. కార్యక్రమంలో బృంద సభ్యులు కృష్ణ, గోదావరి బేసిన్ ఆర్గనైజేషన్ ఎస్‌ఈ ఎం. రమేష్‌బాబు, ఫైనాన్స్ కమిషన్ సీనియర్ డెరైక్టరు రాజీబ్ కుమార్, కేంద్ర పశుసంవర్ధక శాఖ విభాగం డిప్యూటీ సెక్రటరీ పి.ఎస్. చక్రబర్తీ, గ్రామీణాభివృద్ది మంత్రిత్వశాఖ అండర్ సెక్రటరీ రామవర్మ తోపాటు జెడ్పీ చైర్మన్ శోభా స్వాతి రాణి, ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామినాయుడు, ఎంపీపీ కర్రోతు బంగార్రాజు, మాజీ ఏఎంసి వైస్ చైర్మన్ దంతులూరి సూర్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు.
 
 ‘తీరని శోకమిది’
 పూసపాటిరేగ: మండలంలోని తిప్పలవలస గ్రామంలో హుద్‌హుద్ కారణంగా మత్స్యకారులకు జరిగిన నష్టాన్ని కేంద్రబృందం సభ్యులు బుధవారం పరిశీలించారు. తీర ప్రాంతంలో జరిగిన నష్టాన్ని మత్స్యశాఖ ఏడీ ఫణిప్రకాష్ కేంద్ర బృంద సభ్యులకు వివరించారు. తుపాను ప్రభావంతో 22 మత్స్యకార గ్రామాల్లో రూ.కోట్లలో నష్టం జరిగిందని, వలలు, పడవలతో పాటు ఇళ్లకు కూడా నష్టం జరిగిందని బృంద సభ్యులకు వివరించారు. స్థానిక సర్పంచ్ భర్త వాసుపల్లి అప్పన్న గ్రామంలో జరిగిన నష్టాన్ని కేంద్ర బృందానికి తెలియజేశారు.  అలాగే కలెక్టర్ ఎం.ఎం నాయక్ తీరప్రాంతంలో జరిగిన నష్టం,తుపాను సమయంలో అప్రమత్తమైన విధానాన్ని తెలిపారు. బృంద సభ్యులతో పాటు జేసీ రామారావు, నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు, ప్రత్యేక అధికారి వి.ఆదినారాయణ, తహశీల్దార్ జి.జయదేవి, ఎంపీడీఓ డి.లక్ష్మి, ఎంపీపీ మహం తి చిన్నంనాయుడు, జెడ్పీటీసీ ఆకిరి ప్రసాదరావు, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.
 
 పంటనష్టంపై ఫొటో ఎగ్జిబిషన్
 మండలంలోని కుమిలి గ్రామం పరిధిలో దెబ్బతిన్న పంటలపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కేంద్ర బృందం సభ్యులు బుధవారం రాత్రి తిలకించారు. తుపాను కారణంగా నష్టపోయిన పంటలు విషయమై కుమిలి సర్పంచ్ దల్లి ముత్యాలురెడ్డి కేంద్రబృందం సభ్యులకు వివరించారు. రామతీర్థసాగర్ రిజర్వాయర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తరఫున నిదులు మంజూరు చేయాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడు కోరారు. దీంతో బృందం సభ్యులు రామతీర్థసాగర్ రిజర్వాయర్ ట్యాంకును పరిశీలించారు. దీనిపై ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు.
 

మరిన్ని వార్తలు