ఎన్నికలకు సర్వసన్నద్ధంగా ఉండండి

10 Mar, 2019 04:05 IST|Sakshi

ఏ క్షణమైనా షెడ్యూల్‌ వచ్చే అవకాశం

న్యూ సువిధా యాప్‌ ద్వారానే అనుమతులు 

జిల్లాల యంత్రాంగానికి సీఈవో ఆదేశం  

సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం సర్వసన్నద్ధం కావాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ జిల్లాల యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌లు తదితర యంత్ర పరికరాలను సన్నద్ధం చేసుకోవాలని, సాంకేతిక అంశాలపై కూడా ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలన్నారు. శనివారం సచివాలయం నుంచి 13 జిల్లాల అధికారులతో ఈవీఎం, వీవీప్యాట్, న్యూ సువిధా, 1950 కాల్‌ సెంటర్‌ అంశాలపై అదనపు సీఈవోలు సుజాతా శర్మ, వివేక్‌ యాదవ్‌లతో కలిసి ద్వివేదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతికపరమైన అంశాలపై జిల్లా యంత్రాంగం స్పందించి ఈ రోజే నివేదికను సమర్పించాలన్నారు. ఎఫ్‌ఎల్‌సిపై నివేదికను సత్వరమే అందజేయాలన్నారు. డిఫెక్టివ్‌ పరికరాలను ఫ్యాక్టరీకి తిప్పి పంపేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. వాటి స్థానంలో ప్రత్యామ్నాయ పరికరాలు కేటాయిస్తారని తెలిపారు.

1950 కి సంబంధించి జిల్లా స్థాయిలో నిర్వహించే డిస్ట్రిక్‌ కాల్‌ సెంటర్లకు ఇక నుంచి జిల్లా రెవెన్యూ అధికారులు నోడల్‌ అధికారిగా వ్యవహరించాలని ఆదేశించారు.1950 జిల్లా కాల్‌ సెంటర్లు శనివారం, ఆదివారం కూడా పనిచేయాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఒక్కో షిఫ్టులో ఇద్దరు పనిచేస్తున్నారని, మరో ముగ్గురిని తీసుకుని ఐదుగురితో పనిచేసేలా ఏర్పాటు చేయాలని ద్వివేదీ ఆదేశించారు. 1950 కి వచ్చే ప్రతి కాల్‌కి స్పందన ఉండాలని, ప్రజలు అడిగిన ప్రశ్నలపై నిర్ణీత కాలవ్యవధిలో జిల్లా యంత్రాంగం పరిష్కరించాలని ఆయన సూచించారు. అదనపు సీఈవో వివేక్‌ యాదవ్‌ మాట్లాడుతూ ఎన్నికల నిరంతర పర్యవేక్షణలో భాగంగా న్యూ సువిధ అప్లికేషన్‌ను రూపొందించినట్లు చెప్పారు.  

నామినేషన్‌ వివరాలతో పాటు మీడియా మానిటరింగ్‌ సర్టిఫికెట్, రెవెన్యూ, పోలీసు, ఫైర్‌ తదితర శాఖలకు చెందిన ప్రతి ఒక్క అనుమతులను ఆన్‌లైన్‌లో ఇచ్చే వెసులుబాటు కల్పించి మరింత సులభతరం చేసినట్లు తెలిపారు. ఎన్నికల్లో భాగంగా ప్రతి అనుమతిని న్యూ సువిధా ద్వారా ఇవ్వాలని ఆయన సూచించారు. ఆయా అనుమతుల కోసం 48 గంటలు ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. న్యూ సువిధా యాప్‌ నిర్వహణ కోసం  జిల్లా స్థాయిలో గ్రూప్‌–1 అధికారిని నియమించాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్ధులు న్యూ సువిధా మొబైల్‌ యాప్‌ ద్వారా అనుమతులకు దరఖాస్తులు చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు. దరఖాస్తు స్టేటస్‌ను మొబైల్‌లో తెలుసుకోవచ్చునని ఆయన చెప్పారు. 

మరిన్ని వార్తలు