సేవాగుణంతో సమాజానికి మేలు

26 Aug, 2013 00:58 IST|Sakshi
సేవాగుణంతో సమాజానికి మేలు

గుడ్లవల్లేరు, న్యూస్‌లైన్ : విద్యార్థులు తమ చదువుతో పాటు సమాజానికి సేవలందించే గుణాన్ని పెంపొందించుకోవాలని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఉన్నం వెంకయ్య పిలుపునిచ్చారు. సేవతోనే సమాజానికి మేలు జరుగుతుందని చెప్పారు. గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో ఆదివారం 2012-13 విద్యాసంవత్సరంలో పట్టభద్రులైన విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రదానం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన వెంకయ్య చేతులమీదుగా వాటిని పంపిణీ చేశారు.

12వ స్నాతకోత్సవం సందర్భంగా జరిగిన ఈ సభలో వెంకయ్య మాట్లాడుతూ విద్యార్థులు చదువులో ప్రతిభ  పెంచుకుంటూ పరులకు అదే ప్రతిభను పెంపొందించేలా సామర్థ్యం పెంచుకోవాలని సూచించారు. ప్రతిభతో పాటు జీవనోపాధికి అవసరమైన వనరులను సమకూర్చుకోవాలని చెప్పారు. మానవాళిని నాశనం చేసే విలువైన సాంకేతిక పరిజ్ఞానం కంటే వారికి దోహదపడే తక్కువ విలువైన పరిజ్ఞానాన్ని సాధించటం మేలని తెలిపారు. ముందుగా వీసీ వెంకయ్యకు విద్యార్థులు బ్యాండ్ వాయిద్యంతో స్వాగతం పలికారు.

కార్యక్రమంలో భాగంగా ఆయన్ని కాలేజీ యాజమాన్యం సన్మానించింది. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ డాక్టర్ వల్లూరుపల్లి నాగేశ్వరరావు, ప్రెసిడెంట్ వి.సుబ్బారావు, కో చైర్మన్ ముసునూరి శ్రీనివాసరావు, సెక్రటరీ వల్లూరుపల్లి సత్యనారాయణరావు, కో సెక్రటరీ వల్లూరుపల్లి రామకృష్ణ, కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి, డెరైక్టర్ డాక్టర్ ఎస్.ఆర్.కె.రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.రవీంద్రబాబు, విభాగాధిపతులు డాక్టర్ కె.కామరాజు, కోదండరామ్ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు