ఇష్టారాజ్యంగా సిజేరియన్లు

4 Nov, 2019 04:09 IST|Sakshi

ప్రైవేటు ఆస్పత్రుల్లో 61.04 శాతం కాన్పులు అలాగే..

ప్రభుత్వాస్పత్రుల్లో సిజేరియన్ల శాతం 30.27 మాత్రమే 

15 శాతం మందికే సిజేరియన్లు అవసరమవుతాయంటున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ 

సిజేరియన్‌.. తల్లీబిడ్డ ఇద్దరికీ మంచిది కాదని వెల్లడి

కంకిపాడుకు చెందిన విజయలక్ష్మి అక్టోబర్‌ 29న ప్రసవం కోసం విజయవాడలోని ఓ ప్రైవేటు నర్సింగ్‌ హోమ్‌లో చేరింది. బిడ్డ అడ్డం తిరిగిందని, ఆపరేషన్‌ చేసి బిడ్డను తీయాలని వైద్యులు చెప్పడంతో ఆమె కుటుంబ సభ్యులు చేసేది లేక ఓకే అన్నారు. అర గంటలోనే సిజేరియన్‌ ప్రసవం పూర్తయింది. మూడు రోజులపాటు ఆస్పత్రిలోనే ఉంచి రూ.48 వేల బిల్లు వేసి ఇంటికి పంపారు.

సాక్షి, అమరావతి: ప్రైవేటు ఆస్పత్రుల్లో సుఖప్రసవం గగనమైంది. సుఖప్రసవానికి అవకాశం ఉన్నా ప్రైవేటు నర్సింగ్‌హోమ్‌లు డబ్బు కోసం సిజేరియన్‌ వైపే మొగ్గు చూపుతున్నాయి. ఓ వైపు ప్రభుత్వాస్పత్రుల్లో సిజేరియన్‌ ప్రసవాలు తగ్గిపోతుండగా, ప్రైవేటులో మాత్రం ఏటా పెరుగుతుండటం ఆందోళన పెంచుతోంది. సిజేరియన్‌ ప్రసవం వల్ల తల్లీబిడ్డకు ఇబ్బందులుంటాయని తెలిసినా కొంతమంది వైద్యులు సిజేరియన్‌ వైపే మొగ్గుచూపుతున్నారు. వాస్తవానికి.. తీవ్ర ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నవారికి, అధిక రక్తపోటు ఉన్నవారికి, హెచ్‌ఐవీ సోకిన గర్భిణులకు ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే సిజేరియన్‌ ప్రసవం చేయాల్సి ఉంది. కానీ ఆరోగ్యంగా ఉన్న గర్భిణులు ప్రసవానికి వెళ్లినా సిజేరియన్లు చేస్తున్నారు. విజయవాడలాంటి నగరాల్లో ఇదొక పెద్ద వ్యాపారంగా మారిపోయింది. రాష్ట్రంలో అత్యధికంగా కృష్ణా జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి అక్టోబర్‌ 31 వరకు 62.16 శాతం సిజేరియన్‌ ప్రసవాలే జరిగాయంటే పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయొచ్చు.

ప్రభుత్వాస్పత్రుల్లో తగ్గిన సిజేరియన్‌లు
రాష్ట్రంలో సిజేరియన్‌ ప్రసవాల సంఖ్య సగటున 44.91 శాతంగా ఉంది. ఒకప్పుడు ప్రభుత్వాస్పత్రుల్లో కూడా సిజేరియన్‌ ప్రసవాలు ఎక్కువగా జరగ్గా ఈ సంఖ్య ఇప్పుడు గణనీయంగా తగ్గింది. 40 శాతానికి తగ్గకుండా ఉండే సిజేరియన్‌ ప్రసవాల సంఖ్య ఇప్పుడు 30.27 శాతానికి దిగొచ్చింది. కానీ ప్రైవేటు ఆస్పత్రుల్లో మాత్రం ఏటా పెరుగుతూ ఇప్పుడా సంఖ్య 61.04 శాతానికి చేరి కలవరపెడుతోంది. అంటే.. ప్రసవానికి వచ్చిన ప్రతి వంద మందిలో 61 మందికి సిజేరియన్‌ ఆపరేషన్లు చేస్తున్నారు. ఒక్కో సిజేరియన్‌కు కనిష్టంగా రూ.30 వేలు, గరిష్టంగా రూ.60 వేల వరకు ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. 

సిజేరియన్లతో వచ్చే సమస్యలివే.. 
మొత్తం ప్రసవాల్లో గర్భిణులకు ఉన్న వివిధ రకాల అనారోగ్య సమస్యల వల్ల 15 శాతం సిజేరియన్‌ ప్రసవాలు అవసరమవుతాయని, అంతకుమించి జరిగితే తల్లీబిడ్డ ఇద్దరికీ ప్రమాదమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెబుతోంది. దక్షిణాది దేశాల్లో ఈ సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశమని తాజాగా వెల్లడించింది.  
- సిజేరియన్‌ వల్ల తల్లికి ఇన్‌ఫెక్షన్‌లు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. 
అనస్థీషియా (మత్తు మందు) రియాక్షన్‌ ఇచ్చే ప్రమాదం ఉంటుంది. భవిష్యత్‌లోనూ అనేక రకాలు ఇబ్బందులు తలెత్తుతాయి. 
రెండో ప్రెగ్నెన్సీ సమయంలో తల్లీబిడ్డకు ఇబ్బందులు తలెత్తుతాయి. 
గాయం మానడానికి ఎక్కువ రోజులు సమయం పడుతుంది. 
ఎక్కువగా రక్తస్రావం జరిగి కోలుకోవడానికి కూడా చాలా సమయం పడుతుంది. 

20 శాతం లోపే ఉండాలి
వాస్తవానికి 20 శాతం లోపే సిజేరియన్లు ఉండాలి. తల్లికీ, బిడ్డకూ రిస్క్‌ జరిగితే పేషెంట్‌లు, వారి బంధువుల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో చాలామంది ప్రసూతి వైద్యులు సిజేరియన్‌కు మొగ్గు చూపుతున్నారు. ప్రైవేటుతో పోలిస్తే ప్రభుత్వాస్పత్రుల్లో సిజేరియన్‌లు తక్కువ. వైద్యులతో పాటు పేషెంట్‌ కుటుంబీకులు కూడా వాస్తవ పరిస్థితి అర్థం చేసుకుంటే సిజేరియన్లు తగ్గించవచ్చు. 
– డా.దుర్గాప్రసాద్, కమిషనర్, వైద్యవిధాన పరిషత్‌

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చిత్తూరును రెడ్‌ జిల్లాగా ప్రకటించిన కేంద్రం

వృత్తి ధర్మం మరచిన ప్రైవేటు

నేటి ముఖ్యాంశాలు..

ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా 

పేద కుటుంబానికి ఉచిత రేషన్‌

సినిమా

కరోనా విరాళం

కూతురి కోసం...

తమ్మారెడ్డి భరద్వాజకు మాతృ వియోగం

శ్రీలక్ష్మి కనకాల ఇకలేరు

నీలి నీలి ఆకాశం @ 10 కోట్లు!

ఒక్కరికైనా సాయపడండి