సెస్సు.. లెస్సు!

17 Oct, 2014 02:56 IST|Sakshi
సెస్సు.. లెస్సు!

బి.కొత్తకోట: జిల్లాలో సెస్సు సొమ్ము గ్రంథాలయ సంస్థకు చేరడం లేదు. స్థానిక సంస్థలు రూ.3.50 కోట్ల వరకు బకాయిపడ్డాయి. ఇందులో చిత్తూరు మున్సిపాలిటీ అత్యధికంగా రూ.1.19 కోట్లు చెల్లించాలి. వసూలు కాకపోవడంతో అధికారులు ఆయా సంస్థలు, మున్సిపాలిటీలకు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమయ్యారు.
 
జిల్లాలో 1,363 మైనర్, మేజర్ పంచాయతీలు, ఆరు మున్సి పాలిటీలు, రెండు కార్పొరేషన్లున్నాయి. ఇందులో మొత్తం 71 గ్రంథాలయాలు నడుస్తున్నాయి. వీటిలో 12 గ్రంథాలయాలు మున్సిపాలిటీల్లో ఉండగా, మిగిలినవి మండల కేంద్రాల్లో ఉన్నాయి. 7 మండలాల్లో గ్రంథాయాలులేవు.

పంచాయతీలు 2007-08 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటివరకు సెస్సు రూపంలో కోట్ల సొమ్ము బకాయిపడ్డాయి. స్థానిక సంస్థలు ఇంటి పన్ను, కొళాయి పన్నులతో వసూలయ్యే సొమ్ములో 8 శాతం నిధులు గ్రంథాలయ సంస్థకు  చెల్లించాలి. ఇది ఏ ఏడాదికి ఆ ఏడాది చెల్లింపులు చేయడంలేదు. దీంతో బకాయిలు పేరుకుపోయాయి. గ్రంథాలయ సంస్థ అధికారుల సమాచారం మేరకు పంచాయతీల నుంచి రూ.1.22 కోట్ల సెస్సు అందాల్సి ఉంది. ఇది గతంలోనిది.  

ఈ ఆర్థిక సంవత్సరంలో పంచాయతీల పన్నుల డిమాండ్ రూ.17,07,80, 000. ఇందులో 8 శాతం సెస్సుగా రూ.1.36 కోట్లు చెల్లించాలి. పన్నులు ప్రస్తుతానికి రూ.8,94,23,000 వసూలు చేశారు. ఇందులో సెస్సుగా రూ.72 లక్షలు చెల్లించాలి. గత ఆర్థిక సంవత్సరాల్లో వసూలుచేసిన పన్నుల్లో 8 శాతం చెల్లింపు విషయంలో పంచాయతీ కార్యదర్శుల నుంచి స్పందన లేకపోవడంతో నోటీసులు జారీ చేస్తున్నారు.

వసూలైన సొమ్ములో సెస్సును చెల్లించాలని కోరుతున్నారు. పంచాయతీల పరిస్థితి ఇలావుంటే మున్సిపాలిటీలు దీనికి మరింత భిన్నంగా ఉన్నాయి. చిత్తూరు, పుత్తూరు, నగిరి, మదనపల్లె మున్సిపాలిటీలు రూ.2.04 కోట్లు చెల్లించాలి. ఇందులో చి త్తూరు మున్సిపాలిటీ రూ.1.19 కోట్లు చెల్లించాలి. ఈ మొత్తం సొమ్ము వసూలుగాక గ్రంథాలయ సంస్థ అధికారులు తంటాలు పడుతున్నారు.
 
 సెస్సుతో ఏం చేస్తారంటే
 సెస్సు సొమ్ముతో గ్రంథాలయాలకు వసతులు సమకూర్చాలి. పాఠకులకు పుస్తకాలు, దినపత్రికలు ఇలా అవసరమైన వాటిని ఏర్పాటు చేయాలి. భవనాలకు అద్దె, కొత్త భవనాల నిర్మాణం చేపట్టాలి. అయితే నిధుల కొరత కారణంగా ఉద్యోగులకు వేతనాలు మాత్రమే చెల్లిస్తున్నారు.
 
నోటీసులిస్తున్నాం
సంస్థకు రావాల్సిన సెస్సు కోసం పంచాయతీలకు నోటీసులిస్తున్నాం. ఇప్పటికే పలుమార్లు అధికారులను కలిసి విన్నవించాం. కొత్తగా బాధ్యతలు చేపట్టిన కార్యదర్శులు తమకు సంబంధంలేదని అంటున్నారు. కోట్లలో పేరుకుపోయిన బకాయిలు అందితే గ్రంథాలయాలు అభివృద్ధి చెందుతాయి.
 -పీ.రమ, జిల్లా గ్రంథాలయసంస్థ కార్యదర్శి, చిత్తూరు
 
 సగం ఇచ్చాం
 ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా రూ.8.94 కోట్ల పన్నులు వసూలయ్యాయి. ఇందులో 8 శాతం గా చెల్లించాల్సిన రూ.72 లక్షల్లో రూ.35 లక్షలు చెల్లించాం. పాత బకాయిలు రూ.90 లక్షల వరకు ఇవ్వాల్సి ఉంది. దీనిపైనా చర్యలు తీసుకొంటాం.
 -ప్రభాకర్‌రావు, జిల్లా పంచాయతీ అధికారి
 

మరిన్ని వార్తలు