నిర్దోషి అయితే రాజీనామా చేయాల్సిందే: చాడ

11 Jun, 2015 20:08 IST|Sakshi

హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ సీఎం చంద్రబాబు తక్షణమే పదవికి రాజీనామా చేసి తన నైతికతను, నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్‌ చేశారు. రాజనీతిజ్ఞుడిగా, నైతిక విలువలను కాపాడే వ్యక్తిగా చంద్రబాబు తన నిజాయితీని నిరూపించుకోవడానికి ఇదొక్కటే మార్గమని ఆయన అన్నారు. ఎమ్మెల్యేకు ముడుపుల వ్యవహారంలో రేవంత్‌రెడ్డి ప్రత్యక్ష ప్రమేయం రుజువైందని, చంద్రబాబు ప్రమేయం ఉన్నట్లు రికార్డు చేసిన సంభాషణలు చర్చనీయాంశమయ్యాయని చెప్పారు. చంద్రబాబు పాత్రపై కారుమబ్బులు కమ్ముకున్నాయన్నారు. గురువారం మఖ్దూంభవన్‌లో పార్టీనాయకులు పల్లా వెంకటరెడ్డి, పశ్యపద్మలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఓటుకు నోటు వ్యవహారం, నీతి-అవినీతి, చట్టం-చట్టవ్యతిరేకం.. అనే అంశాల కంటే రెండు తెలుగురాష్ట్రాల మధ్య తగాదాగా సృష్టించడానికి ప్రయత్నాలు జరగడం విచారకరమన్నారు. ఇద్దరు సీఎంల పరస్పర విమర్శలు, ఉపయోగిస్తున్న భాష అనాగరికమైనదే కాకుండా వారి హోదాలను దిగజార్చుకునేదిగా ఉందన్నారు. పార్టీ ఫిరాయింపులపై చట్టసభల స్పీకర్లు వ్యవహరిస్తున్న తీరు నీతిబాహ్యంగా ఉందని, వారికున్న విశేషాధికారాలను దుర్వినియోగపరుస్తూ అప్రజాస్వామికంగా, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని సీపీఐ భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ ఫిరాయింపులపై స్పీకర్లు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.

మరిన్ని వార్తలు