ఇలా వెళ్లి.. అలా వస్తున్నారు..

26 Jul, 2015 00:46 IST|Sakshi
ఇలా వెళ్లి.. అలా వస్తున్నారు..

- చైన్‌స్నాచర్లకు నామమాత్రంగానే శిక్షలు
- వెంటనే బెయిల్
- గత మూడేళ్ల రిపోర్టులే నిదర్శనం
- తొలిసారిగా ఓ మహిళ మృతి
సాక్షి, సిటీబ్యూరో:
నగరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా ద్విచక్రవాహనాలపై సంచరిస్తూ మహిళలను టార్గెట్ చేస్తున్నారు. బంగారానికి డిమాండ్ ఉండటంతో పాటు సులభంగా విక్రయించడం, ఈ చోరీ కేసులో నామమాత్రపు శిక్షలు పడుతుండటం కూడా వీరి ఆగడాలకు అదుపులేకుండా పోతోంది.

కలచివేసిన సుమిత్ర మృతి..
తార్నాక ఎస్‌బీహెచ్‌లో తమ ఖాతా వివరాలు తెలుసుకొని తిరిగి కుమారుడితో ద్విచక్రవాహనంపై ఓయూ క్యాంపస్ మీదుగా వెళుతున్న సుమిత్ర మెడలోని బంగారు గొలుసును తెంచే క్రమంలో ఆమెను  నెట్టేయడంతో మెదడుకు తీవ్రగాయాలై అపస్మారకస్థితిలోకి వెళ్లింది.ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం ఇప్పుడు నగరంలో చర్చనీయాంశమైంది. ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న మహిళ చైన్ స్నాచింగ్ ఘటనలో మృతిచెందడంతో ఆ కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది. బంగారం పోతే మళ్లీ కొనుక్కోవచ్చు.. కానీ పోయిన ప్రాణాన్ని ఎవ్వరూ తెచ్చివ్వగలరూ అంటూ కుటుంబసభ్యులు చేస్తున్న రోదనలు కలచివేస్తున్నాయి.
 
నామమాత్రపు శిక్షలేనా..?
2012లో 667 కేసులు నమోదైతే 304 చార్జిషీట్ దాఖలు వరకు వెళ్లాయి. వీటిలో 53 కేసుల్లో నామమాత్రపు శిక్ష పడింది. 62 వీగిపోగా, రెండు రాజీకి వచ్చాయి. 2013లో 695 కేసులు నమోదైతే 286 చార్జిషీట్‌లు దాఖలయ్యాయి. 47 కేసుల్లో నిందితులకు శిక్ష పడగా, 34 వీగిపోయాయి. నాలుగు రాజీ కుదిరాయి. 2014లో 555 కేసులు నమోదైతే 104 చార్జిషీట్ దాఖలు వరకు వెళ్లాయి. 15 కేసుల్లో శిక్ష పడగా, నాలుగు వీగిపోయాయి. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 150 కిపైగా బంగారు గొలుసు దొంగతనాలు నమోదయ్యాయి. ఈ కేసుల్లోనూ పెద్ద సంఖ్యల్లో శిక్ష పడిన దాఖలాలు లేవు. 

ఐపీసీ 382 సెక్షన్‌ల కింద వీరిపై కేసులు నమోదు చేస్తుండటంతో వీరు జైలుకు అలా వెళ్లి ఇలా బెయిల్ తెచ్చుకుంటున్నారు. శిక్ష కాలం కూడా తక్కువగా ఉండటంతో ఈ నేరాలనే కొనసాగిస్తున్నారు. కొన్ని కేసులు చార్జిషీట్ వరకు కూడా వెళ్లడం లేదు. కొందరు అమ్యామ్యాలు తడిపి కేసుల నుంచి బయటపడుతున్నారు. ఇప్పటివరకు బంగారు గొలుసు దొంగలను పట్టుకొని స్వాధీనం చేసుకున్న సంఘటనలను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు.
 
తెరపైకి ఐపీసీ 302 సెక్షన్..
సీసీటీవీ కెమెరాలతో భద్రత పటిష్టం చేస్తామని చెబుతున్న సిటీ పోలీసులు కనీసం పోలీసు స్టేషన్ ముందున్న సీసీటీవీ ఫుటేజీలను కూడా వాడటం లేదు. అవి పనిచేసి ఉంటే సుమిత్ర మృతికి కారకుడైన దొంగ దొరికి ఉండే వాడేమో. అయితే ఆధునీకరణ పనులు జరుగుతుండటంతో సీసీటీవీ వైర్లు తెగిపోయి అవి పనిచేయడం లేదని స్థానిక పోలీసులు చెబుతున్నారు. తార్నాకతో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు దొంగను  పట్టుకుంటామని చెబుతున్నారు. అయితే ఈ ఘటన జరిగి వారం రోజులు గడిచినా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు. 

దొంగ చేతిలో తీవ్రంగా గాయపడ్డ సుమిత్ర చికిత్స పొందుతూ మృతి చెందింది. సంఘటన జరిగినా రోజునా ఐపీసీ 356 సెక్షన్ కింద కేసు నమోదు చేసినా యూనివర్సిటీ పోలీసులు, సుమిత్ర మృతితో తాజాగా ఐపీసీ 302 సెక్షన్ (హత్య కేసు) కింద కేసు నమోదుచేశారు. తొలి సెక్షన్ కింద కేవలం ఆరునెలలే జైలు శిక్ష పడే అవకాశముండగా, తాజాగా నమోదుచేసిన 302 సెక్షన్ కింద యావజ్జీవ కారాగార పడే అవకాశముంది. బాధితురాలి మరణించడంతో నేర తీవ్రతను పెంచుతూ తొలిసారిగా ఐపీసీ 302 సెక్షన్‌ను చైన్ స్నాచర్‌పై నమోదుచేశారు.  
 
చాలా బాధగా ఉంది...
చైన్ స్నాచింగ్ ఘటనలో మహిళ మృతి చెందడం చాలా బాధగా ఉంది. ఇటువంటి ఘటన చోటుచేసుకోవడం బహుశా ఇదే మొదటిసారి అనుకుంటున్నా. గొలుసు చోరీలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గతంతో పొల్చుకుంటే  కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో జరిగిన ఘటనను మేం తీవ్రంగా తీసుకొని ఐపీసీ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశాం. దొంగను పట్టుకునేందుకు ఇప్పటికే నగరంలోని వివిధ విభాగాల బృందాలు పనిచేస్తున్నాయి.         
-స్వాతిలక్రా,
అదనపు పోలీసు కమిషనర్,
సిట్ అండ్ క్రైమ్స్

మరిన్ని వార్తలు