ఒంటరిగా వెళుతున్న మహిళలే లక్ష్యంగా..

17 Jul, 2019 09:33 IST|Sakshi
చైన్‌ స్నాచింగ్‌ ముఠా వివరాలు వెల్లడిస్తున్న అడిషనల్‌ ఎస్పీ వై.వి.రమణ కుమార్‌   

చెడు వ్యసనాలకు బానిసై.. చోరీల బాట 

పోలీసులకు చిక్కిన నలుగురు యువకులు 

189 గ్రాముల బంగారు నగలు స్వాధీనం   

ఆ యువకులు చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. డబ్బు సులభంగా సంపాదించేందుకు చోరీలకు అలవాటు పడ్డారు. చైన్‌ స్నాచింగ్‌లు మొదలుపెట్టారు. ఒంటరిగా వెళుతున్న వృద్ధ మహిళలనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు తెగబడ్డారు. చివరికి పోలీసులకు చిక్కారు. ఆ చోరుల వివరాలను మంగళవారం రాజమహేంద్రవరం తూర్పు మండలం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా అడిషనల్‌ ఎస్పీ వై.వి.రమణకుమార్, తూర్పు మండలం డీఎస్పీ వి.వి.రమణ కుమార్‌ వెల్లడించారు. రెండున్నర నెలలుగా రాజా నగరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రాజమహేంద్రవరం రూరల్‌ కొంతమూరు గ్రామంలో  చైన్‌ స్నాచింగ్స్‌ చేస్తున్న నిందితులను అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు.

సాక్షి, రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం రూరల్‌ మండలం కాతేరు గ్రామానికి చెందిన కాకరబాల సుబ్రహ్మణ్యం(అలియాస్‌ బాబి) రావి వెంకటేష్‌ (వెంకీ), జక్కంపూడి వెంకటేష్‌ , ధవళేశ్వరం గ్రామానికి చెందిన సాంబారి క్రాంతి కుమార్‌లు స్నేహితులు. వీరు ఆటో డ్రైవర్‌గా, లారీ డ్రైవర్‌గా, కూలిపనులు చేసుకుని జీవిస్తుంటారు. వ్యసనాలకు బానిసలైన ఈ యువకులు జల్సాలకు అలవాటు పడ్డారు. డబ్బుల కోసం చైన్‌ స్నాచింగ్‌లకు దిగారు. ఒంటరిగా నడిచి వెళుతున్న మహిళలే లక్ష్యంగా వీరు చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడేవారు. కాకరాల బాల సుబ్రమ్మణ్యం, మరో యువకుడు మోటారు సైకిల్‌పై మహిళలను వెంబడించి, నిర్జీవ ప్రదేశంలో వారి మెడలోని బంగారు గొలుసులను తెంచుకుని పారిపోయేవారు. వాటిని మల్లయ్య పేటకు చెందిన(రాజమహేంద్రవరం మెయిన్‌ రోడ్డులో బంగారు నగలు తయారీ చేసే వ్యక్తి) పాలతీర్ధపు మహేష్‌ అనే వ్యక్తికి విక్రయించి వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తుండేవారని పోలీసులు తెలిపారు. 

పది నుంచి పదిహేను రోజుల వ్యవధిలో చోరీలు
నిందితులు ప్రతి చోరీ పది నుంచి పదిహేను రోజుల వ్యవధిలో చేస్తుండేవారని అడిషనల్‌ ఎస్పీ వివరించారు. నిందితులు తొలిసారిగా ఈ ఏడాది మే 3న కొంతమూరులో చైన్‌ స్నాచింగ్‌ చేశారని తెలిపారు. అనంతరం మే 29న కొంతమూరు గ్రామంలో, జూన్‌ 6న మరో చైన్‌ స్నానింగ్‌ చేశారని తెలిపారు. జూన్‌ 24వ తేదీన మరో చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. ఒకే ప్రాంతంలో చోరీలు చేస్తుండడంతో పోలీసుల నిఘా పెంచారు. దీంతో వారు చోరీ చేసే ప్రాంతాన్ని మార్చుకున్నారని తెలిపారు. ఐదో సారి జూలై నాలుగో  తేదీన బొమ్మూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గణేష్‌ నగర్‌లో చైన్‌ స్నాచింగ్‌ చేసి పరారయ్యారని తెలిపారు ఈనెల 15వ తేదీ సాయంత్రం నాలుగు గంటల సమయంలో రాజానగరం పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ కొంతమూరు అవుట్‌ పోస్ట్‌ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక మోటారు సైకిల్‌పై కాకర బాలసుబ్రహ్మణ్యం, రావి వెంకటేష్‌ పోలీసుల ను చూసి పారిపోతుండగా పోలీసులు వారిని వెంబడించి అరెస్ట్‌ చేశారు. వీరిని విచారించగా చైన్‌ స్నాచింగ్‌ చేస్తున్న మిగిలిన వారి పేర్లు జక్కంపూడి వెంకటేష్, సాంబారీ క్రాంతి కుమార్‌ పేర్లు వెల్లడించారని తెలిపారు. వీరితో పాటు చోరీ చేసిన నగలు కొనుగోలు చేసిన పాలతీర్ధపు మహేష్‌ను కూడా అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు.

189 గ్రాముల బంగారు నగలు స్వాధీనం
నిందితులను అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి 189 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నామని అడిషనల్‌ ఎస్పీ తెలిపారు. వీటి విలువ రూ.5.50 లక్షలు ఉంటుందని అన్నారు. అలాగే చోరీలు చేయడానికి ఉపయోగించే రెండు మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులను అరెస్ట్‌ చేయడంలో క్రైం పార్టీ పోలీస్‌ కానిస్టేబుళ్లు కె.సురేష్, డి.విజయ కుమార్, స్టేషన్‌ క్రైం పోలీసు కానిస్టేబుళ్లు బీఎన్‌ఎస్‌ ప్రసాద్, కె. కళ్యాణరావు, ఎం.ప్రసాద్‌ సహకరించారని తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్సైలు ఎం.వి.సుభాష్, నాగబాబు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు