దొంగల చేతికి నగరం

5 Mar, 2019 12:59 IST|Sakshi

వరుస చోరీలతో బెంబేలు

అంతంత మాత్రంగానే గస్తీ

అనంతపురం సెంట్రల్‌: నగరంలో పోలీసుస్టేషన్లు గాడి తప్పుతున్నాయి. నేరాలకు అడ్డుకట్ట వేయడంలో పోలీసులు చతికిలపడుతున్నారు. ఇక్కడే తిష్ట వేశామన్న చందంగా దొంగలు ఒకే కాలనీలో వరుసగా చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. అయినా కూడా పోలీసులు పట్టుకోలేకపోతున్నారు. నేరాల తీవ్రత తక్కువగా ఉన్నా సంఖ్య మాత్రం రెట్టింపు అవుతోంది. దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లకు నిత్యకృత్యమవుతున్నాయి. నగరంలో రాత్రి వేళల్లో గస్తీ విషయంలో అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాత్రి సమయాల్లో గస్తీ సన్నగిల్లుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీని వలన నేరస్తులు అవకాశం దొరికినపుడల్లా నేరాలకు పాల్పడుతున్నారు. 

అసాంఘిక కార్యకలాపాలకు     నిలయం
నేరాలతో పాటు అసాంఘిక కార్యకలాపాలు కూడా అధికమవుతున్నాయి. లక్ష్మీనగర్‌లో ఇటీవల నలుగురు విటులు, ఇద్దరు నిర్వాహకులను నాల్గవ పట్టణ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అంతకు ముందు ఇదే కాలనీలో పట్టుబడ్డారు. దీంతో పాటు లాడ్జిల్లో వ్యభిచారం సర్వసాధారణంగా జరిగిపోతోంది. ఆర్టీసీ బస్టాండ్‌ ప్రాంతంతో పాటు పలు హైక్లాస్‌ వాటిల్లో కూడా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుండడం గమనార్హం. లాడ్జి మానిటరింగ్‌ సిస్టం యాప్‌ ద్వారా లాడ్జిలపై నిఘా ఉంచినట్లు పోలీసులు అధికారులు ప్రకటిస్తున్నా ఆచరణలో కనిపించడం లేదు. ఇందుకు లాడ్జి నిర్వాహకుల్లో చిత్తశుద్ధి లేకపోవడం వలనే అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల నగరంలో ప్రధాన లాడ్జిలు పెరిగిపోతుండడం వలన చిన్నా చితక లాడ్జిలు మూత పడుతున్నాయి. ఇలాంటి వాటిల్లో వ్యభిచారం, పేకాట లాంటి అసాంఘిక కార్యకలపాలు సాగిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వాటిపై నిఘా ఉంచడంతో పాటు రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం చేస్తే నేరాలకు అడ్డుకట్ట పడే అవకాశముంది. ఆ దిశగా పోలీసులులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.  

వరుస చైన్‌స్నాచింగ్‌లతో నగరంలోని లక్ష్మీనగర్‌ వాసులు బెంబేలెత్తిపోతున్నారు. నాలుగురోజుల క్రితం లక్ష్మీ నరసమ్మ అనే వృద్ధురాలి మెడలో నుంచి 4 తులాల బంగారు గొలుసును దుండగులు అపహరించుకెళ్లారు. అంతకుముంద వారంలో ఓ మహిళ మెడలో 3 తులాల చైన్‌ లాక్కెళ్లారు.  

ఆర్టీసీ బస్టాండ్‌లో పోలీసుల నిఘా కరువైంది. ప్రయాణికుల విలువైన వస్తువులు దొంగల వశమవుతున్నాయి. తాజాగా ఆదివారం బెంగుళూరు మహిళకు చెందిన బ్యాగు ఆర్టీసీ బస్టాండ్‌లో మిస్‌ అయింది. అందులో 4 తులాల బంగారు నగలు ఉన్నట్లు బాధితురాలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నెలలో రెండు, మూడు ఇలాంటి కేసులు నమోదవుతున్నాయి. బస్టాండ్‌లో పోలీసుల నిఘా కరువవడంతోనే దొంగలు వారి పని వారు కానిచ్చేస్తున్నారు.

మరిన్ని వార్తలు