నేనే సీనియర్‌ని.. ఆ సీటు నాది!

7 May, 2019 16:42 IST|Sakshi

సాక్షి, అమరావతి: విజయవాడలోని కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐ)లో గతంలో ఇన్‌చార్జి డైరెక్టర్‌గా పనిచేసిన డాక్టర్‌ కె.రమేష్‌కుమార్‌ సోమవారం హల్‌చల్‌ చేశారు. తానే సీనియర్‌నని, తనకు కోర్టు ఆర్డర్‌ ఉందంటూ డైరెక్టర్‌ కుర్చీ లాక్కుని కూర్చున్నారు. అంతేగాకుండా కొంతమంది ప్రైవేటు వ్యక్తులను కార్యాలయంలో ఉంచడంతో అక్కడి సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. ప్రస్తుత డైరెక్టర్‌ డా.విజయకుమార్‌ తన సీటులోకి వెళ్లేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. రెండేళ్ల కిందట డా.రమేష్‌కుమార్‌ ఇక్కడ ఇన్‌చార్జి డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో మందుల కొనుగోళ్లకు సంబంధించి ఆయనపై పలు అవినీతి ఆరోపణలు రావడంతో కేసులు నమోదై ఉన్నాయని, విజిలెన్స్‌ విచారణ కూడా జరుగుతోందని అధికారవర్గాలు తెలిపాయి. అనంతరం ఆయనను అక్కడి నుంచి తొలగించి తిరుపతి ఈఎస్‌ఐ ఆస్పత్రికి పంపారు. తాజాగా సోమవారం తనకు కోర్టు ఆర్డర్‌ ఉందంటూ డైరెక్టర్‌ సీటులో కూర్చోవడంతో ఉదయం నుంచి సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు.

ఉన్నతాధికారులను సంప్రదించకుండానే..
వాస్తవానికి ఎవరైనా కోర్టు ఆర్డరు తీసుకొచ్చినా దానిని ప్రభుత్వానికి పంపాలి. అక్కడ ఆ కోర్టు ఆర్డరును ఆమోదించి, సదరు వ్యక్తికి ప్రత్యేక ఆర్డర్‌ ఇస్తారు. ఈ ఆర్డరు తీసుకున్నాక ఆ సీటులో కూర్చోవాలి. కానీ డా.రమేష్‌కుమార్‌ ప్రభుత్వాన్నిగానీ, ఉన్నతాధికారులనుగానీ సంప్రదించకుండా నేరుగా వచ్చి కార్యాలయంలోని సీటును ఆక్రమించుకోవడంతో ఈ గందరగోళం నెలకొంది. దీనిపై అటు ప్రభుత్వ ఉన్నతాధికారులుగానీ, కార్మిక ముఖ్య కార్యదర్శిగానీ స్పందించకపోవడంతో వివాదం సోమవారం సాయంత్రం వరకూ కొనసాగుతూనే ఉంది.

సంతకాల కోసం నా దగ్గరికే రావాలి
తన విధులకు ఎవరూ అడ్డు రాకూడదని, సంతకాల కోసం తన వద్దకే రావాలని డా.రమేష్‌కుమార్‌ హుకుం జారీచేయడంతో సిబ్బంది అయోమయానికి గురవుతున్నారు. ప్రస్తుత డైరెక్టర్‌గా ఉన్న డా.విజయకుమార్‌ను చాంబర్‌లోకి కూడా రానివ్వలేదు. ఉన్నతాధికారులు తక్షణమే దీనిపై స్పందించాలని సిబ్బంది కోరుతున్నారు.

మరిన్ని వార్తలు