చైతన్య స్ఫూర్తి

5 Jan, 2014 01:41 IST|Sakshi

=మానవత్వంతో మనసు గెలిచిన అ‘సామాన్యులు’
 =‘గీతం’లో స్ఫూర్తి రగిలించిన వారి ప్రసంగాలు

 
 సాక్షి, విశాఖపట్నం: డ్యూటీ అయిపోయినా నాకెందుకులే అనుకోకుండా దేశం కోసం ముందుకు కదిలి కరుడుగట్టిన ఉగ్రవాదుల తూటాలను సైతం లెక్కచేయకుండా కసబ్‌ను పట్టుకున్న ఓ సాహసోపేత పోలీస్ అధికారి... మణిపూర్ రాష్ట్రంలో ఇంటికొకరు చేత్తో తుపాకీ పట్టుకుని జీవితాలనే కాలరాసుకుంటుంటే దానికి వ్యతిరేకంగా పోరాడి ప్రపంచంలోని 100మంది ప్రభావశీల మహిళల్లో ఒకరిగా నిలిచిన ఓ సాహసనారి.. 14 ఏళ్ల జైలుశిక్ష అనుభవించి బందిపోట్ల సావాసంతో గ్యాంగ్‌స్టర్‌గా మారాలనుకుని చివరకు అందరికీ పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడిగా మారిన ఓ మారిన మనిషి...  కేవలం ఆటో తోలుతూ తన తెలివితేటలతో యావద్దేశానికి ఐకాన్‌లా మారిన పదో తరగతి చదువుకున్న ఆటోవాలా.. ఇలా వీరంతా ఒకేచోట చేరి వారి విజయ గాథలు వినిపిస్తే.. ?  గీతం యూనివర్సిటీలో శనివారం అదే జరిగింది. టెడ్‌ఎక్స్ కార్యక్రమంలో వారు యువతలో స్ఫూర్తి నింపారు.
 
 ప్రాణం పోయినా ఫర్వాలేదనిపించింది

 తీవ్రవాది కసబ్‌తోపాటు మరికొందరు ముంబైపై దాడులకు తెగబడ్డ సమయానికి గంట ముందు డీబీ మార్ స్టేషన్‌లో డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లిపోయాను. కాని విషయం తెలిసిన వెంటనే మనసు ఊరుకోక వెంటనే సంఘటన స్థలానికి వెళ్లా. కసబ్‌ను పట్టుకున్నప్పుడు పాకిస్థాన్ బుకాయించింది. కాని మేం కసబ్ పాకిస్థానీ అని రుజువు చేయడంలో విజయం సాధించాము. దేశ భద్రతను కాపాడే బాధ్యత పోలీసులకే కాదు ప్రతి ఒక్క పౌరుడిపైనా ఉంది. దేశం బాగుంటేనే మనం బాగుంటాం. జనవరి 26న, ఆగస్టు 15న జాతీయ జెండా ఎగరేస్తాం. ఆ తర్వాత అది రోడ్డుపక్కన పడి వున్నా పట్టించుకోం. ఆ ఒక్కరోజేనా మన దేశభక్తి. పోలీసులు రోజూ ఎన్నో మంచి పనులు చేస్తుంటారు. కాని చెడు సంఘటనల గురించే ఎక్కువగా ఫోకస్ అవుతుంది. కసబ్‌ను ఉరి తీసే విషయంలో తీవ్ర జాప్యం జరిగిందని మనమంతా అనుకుంటున్నాం. కాని ప్రపంచంలో ఎక్కడా లేని అద్భుతమైన న్యాయవ్యవస్థ మన దేశంలో ఉంది. ఎందుకంటే ఒక నిందితుడు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు మన న్యాయవ్యవస్థలో ఉన్నన్ని అవకాశాలు మరెక్కడా లేవు. కసబ్‌ను పట్టుకున్న తర్వాత మేం గర్వపడ్డాం. అతడిని ఉరి వేశాక మన దేశ బలం గురించి ప్రపంచానికి తెలిసినప్పుడు పోలీసుగా జీవితంలో ఎప్పుడూ లేని ఆనందాన్ని పొందాను. ఆ సమయంలో విద్రోహ శక్తులు ప్రతీకారేచ్ఛతో మమ్మల్ని ఏంచేసినా ఫర్వాలేదనిపించింది. కులం అనే పదం మనుషుల్లో ఐకమత్యాన్ని దెబ్బతీస్తోంది. మా అబ్బాయి చదువుకునే కాలేజీలోగాని, ఇతరత్రా సర్టిఫికేట్‌లో గానీ కులం కాలమ్‌లో ఇండియన్ అనే నమోదు చేయించాను.
 -సంజయ్ గోవిల్కర్
 
 మానవత్వమే నా మతం

 దేవుడు మనకేం ఇవ్వకపోయినా మనం ఎదుటివారికి తోచిన సాయం చేస్తే.. అందులో ఉన్న ఆనందం మరెందులోనూ దొరకదు. నేనుండేది ముంబైలో. నడిపేది ఆటో. 14 ఏళ్లుగా అదే వృత్తి. ఆటో నడిపితే వచ్చేది కొంత మొత్తమే అయినా ఉన్న దాంట్లోనే క్యాన్సర్ పేషెంట్లు, వీధి బాలలకు సాయం చేస్తున్నా. రోగులకు మందులు కొనుక్కునే స్థోమత లేకుంటే ఆదుకోవడానికి వెనుకాడను. ఆటో ఎక్కే ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బండిలో టీవీ, దినపత్రికలు, ఫోన్, ఇంటర్నెట్, టీ, సెన్సెక్స్ వివరాలు అందిస్తాను. విదేశీ పర్యాటకులు రోజంతా నా ఆటో బుక్ చేసుకుని తిరుగుతుండడం అప్పుడప్పుడు గర్వకారణంగా అనిపిస్తుంది. రోజుకు నాకు 200 రూపాయలు మిగులుతుంది. అప్పుడప్పుడు టిప్‌లు వస్తుంటాయి. ఇవన్నీ నేను సాయం చేయడానికి ఉపయోగపడతుంటాయి. ఉన్నదానిలోనే సాయం చేస్తుంటాను. ఫోన్‌లో నా ఆటో బుక్ చేసుకోవడానికి చాలామంది పోటీపడుతుంటారు. ఇదే నా గురించి దేశం మొత్తం తెలిసేలా చేసింది. వృద్ధులు, వికలాంగులు, దంపతులకు నా ఆటోలో 20 నుంచి 50 శాతం రాయితీ ఇస్తుంటాను. ఇవన్నీ చూసి నన్ను టైటాన్, ఐబీఎం, మేనేజ్‌మెంట్ క్యాంపస్‌లు ప్రసంగాలివ్వడానికి పిలుస్తున్నాయి. ఎందుకు ఇదంతా చేస్తున్నానంటే.. మానవత్వంతో మెలగడం నాకిష్టం. అదే జీవితానికి పెద్ద తృప్తి.                
-సందీప్ బచ్చే
 
 రోగికి మానసిక సాంత్వన చేకూర్చాలి


 వైద్యం అంటే రోగులను పరిశీలించి, చికిత్స చేసి పంపించేయడం కాదు. వారి కి మానసికంగా శారీరకంగా సాంత్వన చేకూర్చాలి. అప్పుడే వైద్యవృత్తికి గౌర వం లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ వాసిగా నేను ఎంతో గర్వపడతాను. కీళ్ల శస్త్ర చికిత్సలో ఒక్క ఏడాదిలో 4 వేల ఆపరేషన్లు చేసి ఆసియా రికార్డు నెలకొల్పినప్పుడు కొంత ఆనందం కలిగించింది. డాక్టర్ ఎంత పని ఒత్తిడిలో ఉన్నా రోగితో ఎంత సంభాషిస్తే అంతగా వారి నుంచి విషయాలు తెలుసుకుని చికిత్స చేయవచ్చు. అప్పుడే నిజమైన డాక్టర్ అనిపించుకుంటారు.        
 -డాక్టర్ ఎ.వి.గురవారెడ్డి
 
 మహిళ సాధించలేనిది లేదు


 మహిళలు తమను తాము తక్కువ అంచనా వేసుకోవద్దు. వారు ఏ విషయంలోనూ తీసిపోరు. కాని ఆత్మవిశ్వాసం కొరవడడంతో విజయం సాధించడంలో కొందరు వెనుకబడిపోతున్నారు. చిన్నప్పటి నుంచి వ్యాసాలు రాయడం ఇష్టం. మణిపూర్ రాష్ట్రవాసిగా అక్కడ మహిళల కష్టాలు కరిగించాయి. అడుగడుగునా ఆయుధ పేలుళ్ల కారణంగా నరకయాతన పడ్డారు. అటువంటి వారికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఆయుధ హింసకు వ్యతిరేకంగా పోరాడడంతోపాటు దిక్కులేని మహిళలకు దారి చూపాలనే ఆకాంక్షతో పనిచేయడం చాలా సంతృప్తినిస్తోంది. మణిపూర్‌లో ఇప్పటికీ ప్రజాస్వామ్యంలేదు. విశాఖ వస్తుంటే నాకు కలిగిన ఆనందం వేరు. ఇక్కడ విద్యాసంస్థలు, ఐటీ, పర్యాటకం చాలా ఆనందం కలిగిస్తున్నాయి. ఇటువంటి సమాజం మా ప్రాంతంలో తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తున్నాం. మహిళలు తమకు ముందు వెనుకా ఎవరూ లేరని ఎప్పుడూ ఆందోళన చెందకూడదు. ఏదోలా స్వయం ఉపాధిపై నిలబడితేనే జీవితానికి సార్థకత. మణిపూర్‌తోపాటు 8 రాష్ట్రాల్లో నాతో కలిసి వచ్చే మహిళలు.. బట్టలు నేయడం, కుట్లు అల్లడం వంటి కుటీర పరిశ్రమలు స్థాపించుకునేలా మా సొంత డబ్బులతో వారిని ప్రోత్సహిస్తున్నాం.
-బినలక్ష్మి నెప్రామ్
 
 ప్రేమించడంలో ఉన్న ఆనందం అర్థమైంది..


 క్షణికావేశం జీవితాన్ని నాశనం చేస్తుందనడానికి నేనే ఉదాహరణ. హత్యచేసి 14 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాక గ్యాంగ్‌స్టర్ కావాలనుకున్నా. కాని పసిపిల్లలు, పెద్దలు నన్ను చూసిన తీరు నాలో మార్పు తీసుకువచ్చింది. మాది బీహార్‌లోని పాట్నా. మా తల్లిదండ్రులు చేసిన అప్పు తీర్చలేదని మా ఊరి భూస్వామి నా కళ్లముందే అదేపనిగా నిందించాడు. తట్టుకోలేక తుపాకీతో మూడు రౌండ్లు కాల్చి చంపేశాను. న్యాయస్థానం 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. జైల్లో బందిపోట్లతో కలిగిన పరిచయం.. బయటికొచ్చాక గ్యాంగ్‌స్టర్‌గా మారిపోవాలన్న కోరికను కలిగించింది. కాని అప్పుడప్పుడు జైల్లో ఖైదీల పిల్లలకు పాఠాలు చెప్పడంతోపాటు దూరవిద్య ద్వారా న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్నా. శిక్ష ముగించుకుని ఇంటికి వచ్చాక.. ఊరి జనం నన్ను చూడాలంటేనే భయపడిపోయేవారు. దీంతో నా మనసు మారింది. ఏదో మంచి చేయాలనే తలంపుతో మా ఊరిలో పాఠశాల ప్రారంభించాను. ఇప్పుడు 400మంది విద్యార్థులకు ఉచితంగా పాఠాలు నేర్పుతున్నా.  
 -దీపక్ కుమార్
 

మరిన్ని వార్తలు