ఒంగోలు డెయిరీ నిలువు దోపిడీ

7 Feb, 2020 08:50 IST|Sakshi
చైర్మన్‌ చల్లా, ఎండీ శివరామయ్యపై చేతులు వేసి ఫొటోకు ఫోజిచ్చిన చంద్రబాబు (ఫైల్‌)

అడ్డంగా దోచుకున్న మాజీ చైర్మన్‌ చల్లా 

యిరీ అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం తిలోదకాలు 

హారతి కర్పూరంలా  కరిగిన అక్షరాలా రూ.35 కోట్లు 

సాక్షి, ఒంగోలు: అనుకున్నదే జరిగింది.. ఒంగోలు డెయిరీ నిండా మునిగింది.. టీడీపీకి చెందిన పాలకమండలి నిండా ముంచితే నూతనంగా ఏర్పడిన అధికారులతో కూడిన కమిటీ కూడా తానేమీ తక్కువ కాదన్నట్లు డెయిరీని కోలుకోలేని స్థితిలోకి నెట్టింది. పాడి రైతుల ఆందోళనలతో దిగొచ్చిన అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పాలక మండలిని రద్దు చేసి అధికారులతో కూడిన నూతన కమిటీని ఏర్పాటు చేసింది. నూతన కమిటీ ఉన్న ఉద్యోగులను కాదని అదనంగా మరో ముగ్గురు ఉన్నతాధికారులను తీసుకొని జీతాల రూపంలో డెయిరీపై నెలకు అదనంగా రూ.3 లక్షల భారం మోపింది.

అలా 18 నెలల పాటు కాలంగడిపి అదనపు భారం డెయిరీ నెత్తిన మోపి ఇంకా ముంచేశారు. చివరకు డెయిరీకి ఏదో వెలగబెడతారకున్న సీఈవో జగదీశ్వరరావు వారం  రోజుల క్రితం రాజీనామా చేసి జారుకున్నారు. అదనపు ఉద్యోగులు కేటాయింపుతో డెయిరీకి అదనంగా రూ.62 లక్షల భారం తప్ప ఒరిగిందేమీ లేదు. అంతకు ముందే సొసైటీ యాక్టులో ఉన్న డెయిరీని కంపెనీ యాక్టులోకి మార్చి అప్పటి చైర్మన్‌ చల్లా శ్రీనివాసరావు డెయిరీని కోలుకునే అవకాశాలు కూడా లేకుండా చేశాడు. పాత పాలకమండలి చైర్మన్‌ చల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డెయిరీని అప్పట్లో నిండా ముంచారు. పాల‘మాల్యా’గా పేరొందిన ఆయన డెయిరీని దాదాపు రూ.80 కోట్ల అప్పుల్లోకి నెట్టి ఒట్టిపోయిన గేదెను వదిలించుకున్న తీరులా చేశాడు. 

చంద్రబాబు కనుసన్నల్లోనే  డెయిరీ నాశనం  
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కనుసన్నల్లోనే ఒంగోలు డెయిరీ సర్వనాశనమైందని జిల్లాలోని ప్రతి పాడి రైతుకు తెలుసు. తన హెరిటేజ్‌ డెయిరీని లాభాల్లోకి వచ్చేలా చేసి ఒంగోలు డెయిరీని కోలుకోలేని స్థితిలోకి తెచ్చిందే చంద్రబాబు.. అన్న ప్రచారం జిల్లా రైతుల్లో ఉంది. డెయిరీని తిరిగి యథావిధిగా నిర్వహించుకునేందుకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఏపీడీడీసీఎఫ్‌ నుంచి రూ.35 కోట్ల రుణం ఇప్పించింది. డెయిరీని పూర్తిగా కోలుకోలేని స్థితిలోకి నెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఉన్న ఆస్తులను తాకట్టు పెట్టించి మరీ రుణం ఇప్పించింది.

రుణానికి తాకట్టుగా డెయిరీకి చెందిన రూ.58.98 కోట్ల విలువైన 8.75 ఎకరాలను తనఖా పెట్టారు. దీనికి రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఆయా సందర్భాల్లో ప్రకటించిన రెపోరేటు మీద 2 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంది. ఈ లెక్క ప్రకారం ప్రస్తుతం ఈ రుణానికి 8.25 శాతం వడ్డీ రేటు పడుతుంది. అందుకుగాను రుణాన్ని 2020 నవంబర్‌ నుంచి నెల నెలా కంతుల వారీగా వాయిదాలు చెల్లించేలా మారిటోరియం ఉంటుంది. అప్పటి నుంచి నెలకు రూ.18,01,062 వాయిదాలుగా చెల్లించాలి. ఆ నిధులను డెయిరీ నిర్వహణతో పాటు అంటే ఉద్యోగుల జీతాలు, కరెంటు బిల్లులు, డెయిరీ అభివృద్ధికి వినియోగించాల్సిందిపోయి అప్పనంగా కాజేశారు. ఈ ఏడాది నవంబర్‌ నుంచి 120 సమాన వాయిదాల్లో రుణాన్ని చెల్లించాల్సి ఉంది.  

భారంగా జీత భత్యాలు  
మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు తయారైంది ఒంగోలు డెయిరీ పరిస్థితి. అసలే అప్పుల్లో ఉన్న డెయిరీకి అదనంగా కొత్తగా బి.జగదీశ్వరరావు అనే వ్యక్తిని సీఈఓను నియమించారు. ప్రస్తుతం ఉన్న  ఉద్యోగులకు సంబంధించిన జీతాలు నెలకు రూ.40 లక్షలు. అసలే భారంగా మారితే నూతన కమిటీ కొత్తగా అదనంగా మరో ముగ్గురు ఉద్యోగులను నియమించింది. ఈ ముగ్గురి జీతభత్యాలు వెరసి నెలకు అక్షరాలా రూ.3 లక్షలు. సీఈవోకు నెలకు రూ.లక్ష జీతం, అదనంగా అదనపు సౌకర్యాల పేరుతో హీనపక్షాన నెలకు రూ.50 వేలు వరకు ఖర్చు చేస్తున్నారు. ఆయనతో పాటు మరో ఇద్దరిని కూడా నియమించింన కమిటీ ముగ్గురికీ కలిపి నెలకు రూ.3 లక్షలు చెల్లిస్తూ వచ్చారు. అదనంగా చేరిన వారి జీతభత్యాలు పేరుతో మొత్తం 18 నెలలకు కలిపి రూ.62 లక్షలు అప్పనంగా తీసుకున్నారు. డెయిరీని గాడిలో పెట్టి లాభాల బాట పట్టిస్తారనుకుంటే ఆ విషయాన్ని విదిలేసి పాత కమిటీని కాపాడే పనిలో నిమగ్నమై డెయిరీని పీకల్లోతు అప్పుల్లోకి నెట్టారు. చివరకు కోలుకోలేని స్థితిలోకి డెయిరీని నెట్టి డెయిరీని కాపాడతాడనుకున్న సీఈవో జగదీష్‌ రాజీనామా చేసి గప్‌చప్‌గా వెళ్లిపోయాడు. 

బొక్కింది కక్కించేదెవరు? 
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి చెందిన డెయిరీ చైర్మన్‌ చల్లా శ్రీనివాసరావు బొక్కిన రూ.కోట్లు కక్కించేది ఎవరు. పాత కమిటీ దాదాపు రూ.80 కోట్లకు పైగా బొక్కి డెయిరీని నిలువునా నష్టాల్లోకి నెట్టింది. నూతన కమిటీ ప్రమాణ స్వీకారం రోజు డెయిరీ చైర్మన్‌ జె.మురళీ మాట్లాడుతూ అక్రమాలకు పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరించి కాజేసిన మొత్తాన్ని తిరితి రాబడతామని ప్రతినబూనారు. ఇప్పటికీì ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోగా పాత కమిటీ పాపాలను వెనకేసుకొచ్చే పనిలో నిమగ్నమయ్యారన్న ఆరోపనలు వినవస్తున్నాయి.

ఫొరెన్సిక్‌ ఆడిట్‌లో ఎన్నో అక్రమాలు బయట పడుతుంటే అందుకు ప్రస్తుతం ఉన్న అధికారులు రికార్డులు ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేస్తున్నారు. లాభాలతో సాగిపోతున్న డెయిరీని చల్లా శ్రీనివాసరావు కంపెనీ చట్టంలోకి మార్చటం వెనుకే దోచుకునే దుర్మార్గమైన ఆలోచన ఉన్నట్లు అప్పట్లో విమర్శలు గుప్పుమన్నాయి. దోచుకున్న డబ్బును అప్పులు తిరిగి చెల్లిస్తున్నామంటూ నూతన కమిటీ తిరిగి డెయిరీని పీకల్లోతు అప్పుల్లోకి నెట్టేసిందనడంలో సందేహం లేదు. 15 ఏళ్లకు పైగా చైర్మన్‌గా ఉన్న కందుకూరుకు సమీపంలోని ఓగూరుకు చెందిన టీడీపీ నాయకుడు చల్లా శ్రీనివాసరావు రూ.కోట్ల రూపాయలు వెనకేసుకున్నట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు