చెత్త వేశారో... రైల్వే వాతే!

10 Feb, 2020 13:21 IST|Sakshi
రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ప్రచార పోస్టర్‌

రైల్వే స్టేషన్, రైళ్లలో పారిశుధ్యం మెరుగుకు కఠిన నిబంధనలు  

కేటగిరీ వారీగా నేటి నుంచి జరిమానా విధించనున్న రైల్వే యంత్రాంగం

తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): స్వచ్ఛ భారత్‌ మిషన్‌ అమలుకు ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే సిద్ధమైంది. ఇందులో భాగంగా రైల్వేస్టేషన్‌ పరిసరాల్లో నిబంధనలు అతిక్రమించిన వారిపై విధించే జరిమానాలను అధికం చేసింది. ఈ నూతన జరిమానాలు ఫిబ్రవరి 10వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. రైల్వే స్టేషన్‌ పరిసరాలలో చెత్త వేయడం, ఉమ్మి వేయడం, మూత్ర విసర్జన, గోడలను పాడుచేయడం వంటి నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకుని  2016లో జరిమానాలు అమలులోకి తీసుకొచ్చారు. వీటికి అదనంగా మరికొన్ని నిబంధనలు కూడా ఇక నుంచి అమలు చేయనున్నారు. వీటిని అతిక్రమించినా జరిమానాలు చెల్లించుకోవాల్సిందే. జాతీయ హరిత ట్రిబ్యునల్‌ ఆదేశాల అమలుకు ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే ముందుకు సాగుతోందని, ప్రయాణికులు పూర్తిస్థాయిలో సహకరించి స్వచ్ఛ భారత్‌ మిషన్‌లో భాగస్వాములు కావాలని రైల్వే అధికారులు కోరుతున్నారు. 

మరింత మందికి అధికారం
ఇప్పటి వరకు ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌లో గల మూడు డివిజన్లలో వేర్వేరు జరిమానాలు అమలయ్యేవి. ఇప్పటి నుంచి మూడు డివిజన్‌ల పరిధిలో గల అన్ని స్టేషన్‌లలో ఒకే రకమైన జరిమానాలు అమలు చేయనున్నారు. చెత్త వేస్తే రూ.200, వంట చేస్తే రూ.500, ఉమ్మి వేస్తే రూ.300, మూత్ర విసర్జన చేస్తే రూ.400, గోడలను పాడుచేస్తే రూ.500, జంతువులు, పక్షులకు మేత వేస్తే రూ.500, వాహనాలు కడిగినా, రిపేర్‌ చేసినా రూ.500, దుస్తులు ఉతికినా, పాత్రలు కడిగినా రూ.500, అనుమతి లేకుండా పత్రికలు అతికిస్తే రూ.2వేలు, అనుమతి పొందిన వెండర్స్, హాకర్స్‌ తడి, పొడి చెత్తకు సంబంధించిన ప్రత్యేక డస్ట్‌ బిన్స్‌  ఏర్పాటు చేయకపోతే రూ.2వేలు, 50 మైక్రాన్‌ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్‌ వినియోగిస్తే రూ.500ల జరిమానా విధించనున్నారు. మరోవైపు నిబంధనలు అతిక్రమించే వారిపై జరిమానా విధించేందుకు మరింత మంది అధికారులకు అధికారం కల్పించారు. ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే పరిధిలో గల ఖుర్దా రోడ్, సంబల్‌పూర్, వాల్తేర్‌ డివిజన్‌లలో గల స్టేషన్‌ మేనేజర్స్, స్టేషన్‌ సూపరింటెండెంట్స్, స్టేషన్‌ మాస్టర్స్, టికెట్‌ కలెక్టర్స్, స్పెషల్‌ స్వా్కడ్, కమర్షియల్‌ / ఆపరేటింగ్‌ విభాగంలో గల గెజిటెడ్‌ ఆఫీసర్‌ ర్యాంక్‌ కలిగిన అధికారులు, ఆర్పీఎఫ్‌లో అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్సెక్టర్‌ ర్యాంకు కన్నా తక్కువ కాని అధికారులకు అధికారం కల్పించారు. 

మరిన్ని వార్తలు