నేడు లేదా సోమవారం ఎన్నికల షెడ్యూల్‌

9 Mar, 2019 05:18 IST|Sakshi

ఏప్రిల్‌ 15న తొలి దశలోనే ఏపీ, తెలంగాణలో పోలింగ్‌!

సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికలకు శనివారం లేదా సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉందని ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం యూనివర్సిటీల్లో పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌ జారీ చేయాల్సి ఉందని, ఆ ఆర్డినెన్స్‌ శనివారం ఉదయం జారీ అయిన పక్షంలో అదే రోజు సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉందని, ఆర్డినెన్స్‌ జారీ కాని పక్షంలో సోమవారం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించ వచ్చని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.  బహుశా ఏప్రిల్‌ 15న రెండు రాష్ట్రాల్లో ఒకేసారి పోలింగ్‌ ఉంటుందనే అభిప్రాయాన్ని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇందుకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేదీ ఏర్పాట్లను పూర్తి చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి 5వ తేదీనే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే తెలంగాణలో ఏప్రిల్‌ 30వ తేదీన పోలింగ్‌ జరగ్గా ఆంధ్రప్రదేశ్‌లో మే 7వ తేదీన పోలింగ్‌ జరిగింది. అయితే ఈ సారి తొలి దశలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌ ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఎన్నికల షెడ్యూలు వీలైనంత త్వరగా రావాలని అధికార యంత్రాంగమంతా ఎదురు చూస్తోంది. ఇందుకు ప్రధాన కారణం చంద్రబాబు అధికారులపై ఒత్తిడి తెచ్చి నిబంధనలకు విరుద్ధమైన పనులను చేయించడమేనని పేర్కొంటున్నారు.   

మరిన్ని వార్తలు