సాధారణ భక్తులకే పెద్ద పీట

25 Apr, 2019 12:00 IST|Sakshi
ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తున్న ఈవో కె.రామచంద్రమోహన్‌

చందనోత్సవానికి పక్కా ఏర్పాట్లు

రెండు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా...

ఉదయం 4 గంటల నుంచి దర్శనాలు

వీఐపీలకు వారికి కేటాయించిన సమయాల్లోనే అనుమతి

3 లేదా 4వ తేదీ నుంచి టిక్కెట్ల విక్రయాలు

సింహాచల దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్‌

సింహాచలం(పెందుర్తి): వచ్చే నెల 7న వైశాఖ శుద్ద తదియని పురస్కరించుకుని సింహగిరిపై జరిగే శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవానికి రెండు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసి ఏర్పాట్లు చేస్తున్నట్టు ఈవో కె.రామచంద్రమోహన్‌ తెలిపారు. చందోత్సవ ఏర్పాట్లపై బుధవారం దేవస్థానం వైదికులు, సెక్షన్‌ హెడ్‌లు, ఇంజనీరింగ్‌ అధికారులు, సిబ్బందితో సమీక్ష ఏర్పాటు చేశారు. సాధారణ భక్తులకే పెద్ద పీట వేస్తూ చందనోత్సవ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఒకేసారి 17,300 పట్టేలా ఉచిత, 200, 500, వీఐపీ, ప్రోటోకాల్‌ వీఐపీ దర్శన క్యూలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. వీఐపీలు, దాతలు కోసం పరిమిత సంఖ్యలోనే రూ.1000 టిక్కెట్లు జారీ చేయడం జరుగుతుందన్నారు. అలాగే ప్రోటోకాల్‌ పరిధిలోకి వచ్చే న్యాయమూర్తులు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఇతర ఉన్నతాధికారులు, దేవస్థానానికి బూరి విరాళం అందించిన ముఖ్య దాతలకు, వారి కుటుంబ సభ్యులకు రూ.1200 టిక్కెట్లు పరిమితంగా ఇస్తామన్నారు. దేవస్థానం సంప్రదాయం ప్రకారం చందనోత్సవం రోజు ఉదయం 3 గంటలకు వంశపార ధర్మకర్తకు తొలిదర్శనాన్ని అందించడం జరుగుతుందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తరపున వస్త్రాలు తీసుకొచ్చే దేవాదాయశాఖ కమిషనర్, ప్రిన్సిపాల్‌ సెక్రటరీ, టీటీడీ తరపున స్వామికి పట్టువస్త్రాలు అందించే వారికి ఉదయం 4 గంటలలోపు దర్శనాలు అందిస్తామన్నారు. అనంతరం ఉచిత, రూ.200, రూ.500 దర్శన క్యూల్లో ఉన్న సాధారణ భక్తులందరికీ స్వామివారి దర్శనాన్ని నిరంతరంగా అందిస్తామన్నారు. రాత్రి 7 గంటల తర్వాత క్యూల్లోకి అనుమతించమని, అప్పటివరకు క్యూల్లో ఉన్న వారందరికీ దర్శనాలు అందించడం జరుగుతుందన్నారు.
రూ. 1200 టిక్కెట్లపై వచ్చే ప్రోటోకాల్‌ వీఐపీలకు ఉదయం 5 నుంచి 6 గంటల వరకు, తిరిగి ఉదయం 8.30  నుంచి 9.30 గంటల వరకు మాత్రమే దర్శనాలు అందిస్తామన్నారు.
రూ. 1000 టిక్కెట్లపై వచ్చే వీఐపీలకు ఉదయం 6.30 నుంచి 8 గంటల వరకు, తిరిగి ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుంచి 3గంటల వరకు మాత్రమే దర్శనాలు ఉంటాయన్నారు.
ఏ స్లాట్‌కి ఆస్లాట్‌కి దర్శన సమయాలు పొందుపరుస్తూ వేర్వేరు రంగుల్లో టిక్కెట్లు జారీ చేయడం జరుగుతుందన్నారు.
దివ్యాంగులకు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు దర్శన సమయాన్ని కేటాయించామన్నారు. వారితో పాటు ఒక్కరిని మాత్రమే సహాయకులుగా అనుమతిస్తామన్నారు.
కొండదిగువన అడవివరం కూడలి, పాత గోశాల జంక్షన్‌ల నుంచి ఆర్టీసీ బస్సులను ఉచితంగా దేవస్థానం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. భక్తులంతా వారివారి వాహనాలను పాత గోశాల జంక్షన్, అడవివరం జంక్షన్లలో పార్కింగ్‌ ప్రదేశాల్లో నిలుపుచేసి బస్సుల్లో కొండకి వెళ్లేలా ఏర్పాటు చేశామన్నారు.
రూ.1000 టిక్కెట్లుపై వచ్చే వీఐపీలు కూడా వారి వాహనాలు కొండదిగువనే పార్కింగ్‌ చేసి, దేవస్థానం ఏర్పాటు చేసే మిని బస్సుల్లో సింహగిరికి చేరుకోవాల్సి ఉంటుందన్నారు.
నగరంలోని 25 బ్యాంకుల్లో ఈనెల 3 లేదా 4వ తేదీ నుంచి రూ.200, రూ.500 దర్శన టిక్కెట్లు విక్రయాలు జరుపుతామన్నారు.
జీవీఎంసీ పారిశుధ్య ఏర్పాట్లు, పోలీస్‌శాఖ 1000 మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తోందన్నారు. అలాగే ఫైర్, దేవాదాయాశాఖ, విద్యుత్, ఆర్టీసీ, మెడికల్‌ అండ్‌ హెల్త్, రెవెన్యూ, ఎక్సైజ్‌ తదితర ప్రభుత్వశాఖలు ఏర్పాట్లలో పాలు పంచుకుంటున్నాయని తెలిపారు.
మొత్తం 2500 మంది వరకు పలు ప్రభుత్వ శాఖల సిబ్బంది చందనోత్సవ ఏర్పాట్లలో విధులు నిర్వర్తిస్తున్నట్టు తెలిపారు.
2వేల మందికిపైగా వలంటీర్లు క్యూల్లో భక్తులకు సేవలందించేందుకు పాల్గొంటున్నారని తెలిపారు. అలాగే 60 స్వచ్ఛంద సంస్థలు క్యూల్లో భక్తులకు మజ్జిగ, మంచినీరు, బిస్కట్లు, ఫలహారాలు అందిస్తాయన్నారు.

సమీక్షలో దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు, గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఉప ప్రధానార్చకులు కరి సీతారామాచార్యులు, ఇంజనీరింగ్‌ అధికారులు మల్లేశ్వరరావు, కోటేశ్వరరావు, రమణ, రాంబాబు, తాతాజి, అప్పారావు, ఏఈవొలు ఆర్‌.వి.ఎస్‌.ప్రసాద్, రామారావు, కె.కె.రాఘవకుమార్, మోర్తా వెంకట కృష్ణమాచార్యులు, నక్కాన ఆనందకుమార్, సూపరింటిండెంట్‌లు తిరుమలేశ్వరరావు, రమణమూర్తి, బంగారునాయుడు, జగన్నాథం, పద్మజ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు