చుక్కలు చూపుతున్నారు!

24 May, 2016 01:51 IST|Sakshi
చుక్కలు చూపుతున్నారు!

సర్కారు తీరుపై రాజధాని రైతుల మండిపాటు
ప్లాట్లపై ఉన్న అనుమానాలు నివృత్తి చేయాలని డిమాండ్
మరో వైపు ఆప్షన్లు ఇచ్చేందుకు మూడో విడత గడువు పొడిగింపు
ఈ నెల 25 వరకు   అవకాశం..   అయినా సిద్ధంగా లేని రైతులు
కౌలు చెల్లింపులోనూ జాప్యం

 
 
రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. ప్లాట్ల కేటాయింపులో ప్రభుత్వ అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై రైతులోకం మండిపడుతోంది. తమ అనుమానాలపై రైతులు అడుగుతున్న ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పలేక నీళ్లు నములుతున్నారు. అవగాహన సదస్సుల వల్ల ఒరిగేందేమీ లేదని ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
 
 
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణం కోసం మూడు మండలాల్లోని 29 గ్రామాల్లో 33 వేల ఎకరాల సాగు భూమిని ప్రభుత్వం సేకరించింది. అన్నదాతలను మభ్యపెట్టి భూములు తీసుకున్న ప్రభుత్వం ఆ హామీలను నెరవేర్చే విషయంలో మీనమేషాలు లెక్కిస్తోంది. రెండో ఏడాది కౌలు చెల్లించే విషయంలోనూ అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై రైతులు మండిపడుతున్నారు.  ప్లాట్ల కేటాయింపులో ఆప్షన్లు ఇచ్చేందుకు రైతులు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించింది. మూడో విడత ఈ నెల 25 వరకు గడువు ఇచ్చినా రైతులు సంతృప్తికరంగా లేరు. ప్లాట్లను ఎంపిక చేసుకునే విషయంలో నెలకొన్న గందరగోళానికి తెరవేసేందుకు అధికారులు ఏ విధమైన చర్యలు చేపట్టకపోవడంపై రైతులు ధ్వజమెత్తుతున్నారు.  సీఆర్‌డీఏ నిర్దేశించిన ప్లాట్లలో ఎలాంటి వాటిని ఎంపిక చేసుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. రాజధాని ప్రాంత గ్రామాల్లో అధికారులు సదస్సులు నిర్వహించినప్పటికీ రైతుల సందేహాలను తీర్చలేకపోయారు.  రెండు మార్లు గడువు పొడిగించినా రైతులు అప్షన్‌లు ఇచ్చేందుకు ముందుకు  రావడం లేదు. దీంతో చేసేదిలేక మూడో సారీ ఆప్షన్‌లు ఇచ్చేందుకు గడువు పొడిగించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ తీవ్ర జాప్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.


కౌలు మంజూరులోనూ జాప్యం....
సమీకరణ కింద భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం 10 ఏళ్ల పాటు కౌలు పరిహారం చెల్లిస్తామని ప్రకటించింది. మొదటి ఏడాది మాత్రం కౌలు చెల్లించింది. రెండో సంవత్సరం కౌలు ఏప్రిల్ నెలలో  చెల్లించాల్సి ఉన్నప్పటీకి ఇంత వరకు మంజూరు చేయకపోవడంతో రైతులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.  కౌలు బకాయిల కోసం రైతులు సీఆర్‌డీఏ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.  పిల్లల ఫీజులు, ఇతర  అవసరాలకు డబ్బు సకాలంలో అందకపోవడంతో ఎటూ పాలుపోక విచారం వ్యక్తం చేస్తున్నారు. భూములు ఇచ్చి తప్పు చేశామని మదనపడుతున్నారు. భూములు తీసుకొనే ముందు రైతులకు ఇచ్చిన హామీలకు, ఇప్పుడు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి పొంతన కుదరడం లేదన్న చర్చ రైతుల్లో సాగుతోంది.
 
 
ఆప్షన్లు ఇవ్వాల్సిన వారు....
మొత్తం రైతులు :     25,100
9.18ఏ దరఖాస్తులు ఇచ్చినవారు:     3,388
9.18బి దరఖాస్తులు ఇచ్చినవారు:     1,155

 
 చెల్లించాల్సిన కౌలు :
రైతులు....    20,166
జరీబు భూములకు ఎకరాకు :    రూ 55,000
మెట్ట రైతులకు ఎకరాకు   :    రూ 33,000
చెల్లించాల్సిన మొత్తం      :     రూ 142 కోట్లు

 

మరిన్ని వార్తలు