'వరంగల్ పర్యటనకు బాబు విదేశీయుడిలా వస్తున్నారా...?'

11 Feb, 2015 21:02 IST|Sakshi
'వరంగల్ పర్యటనకు బాబు విదేశీయుడిలా వస్తున్నారా...?'

హైదరాబాద్: హైదరాబాద్‌ను విదేశంతో పోల్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరంగల్ పర్యటనకు ఓ విదేశీయుడిలా వస్తున్నారా..? ఆర్ధిక లావాదేవీల కోసం వస్తున్నారా..? అని టీఆర్‌ఎస్ నాయకుడు, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ప్రశ్నించారు. వరంగల్ జిల్లాలోని ఖనిజ సంపదను దోచుకునేందుకు బాబు పర్యటన పెట్టుకున్నారని కర్నె ప్రభాకర్ ఆరోపించారు.

టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో కర్నె ప్రభాకర్ విలేకరులతో బుధవారం మాట్లాడుతూ... రాజ్యాంగ బద్దంగా సీఎంగా ఎన్నికైన బాబు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను 9ఏళ్లు పాలించాడని, ఆయన తెలంగాణకు రావొచ్చు, పోవొచ్చు, కానీ, విదేశీయుడిలానే వస్తున్నారా అని సందేహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వరంగల్‌లో దేనిపై సమీక్ష పెడుతున్నారని, ఏం దోచుకోవాలని ప్రణాళిక వేస్తున్నారని నిలదీశారు. రాష్ట్రం విడిపోయాక చంద్రబాబు తెలంగాణ హక్కులను కాల రాస్తున్నాడని, పోలవరంతో ఉన్న ముంపు విషయంలో ఏమాత్రం ఆలోచించకుండా ఎత్తు తగ్గించేందుకు ససేమిరా అంటున్నాడని ప్రభాకర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సర్కారుకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న తెలంగాణ టీడీపీ నేతలు ఒక విషయంలో ఆలోచించుకోవాలని, గతంలో ఎన్ని ఆటలు ఆడినా చెల్లుబాటు అయ్యాయని.. కానీ, ఇప్పుడు అలాంటివి కుదరదని, ఫణికర మల్లయ్య మాదిరిగా ప్రశ్నిస్తారని ఎమ్మెల్సీ కర్నె తెలిపారు. వరంగల్ ప్రజలు ఆత్మగౌరవం చాటుకుంటారు తస్మాత్ జాగ్రత్త అని బాబును హెచ్చరించారు. తెలంగాణ పర్యటనకు వచ్చే ఎవరినీ అడ్డుకోమని, గతంలోనూ తెలంగాణ వ్యతిరేకులను కూడా అడ్డుకోలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ సందర్భంగా కర్నె ప్రభాకర్ చెప్పారు.
 

>
మరిన్ని వార్తలు