రాష్ట్రపతి పాలన పెట్టండి

10 Dec, 2013 01:49 IST|Sakshi
రాష్ట్రపతి పాలన పెట్టండి

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యను అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో పరిష్కరించలేని పక్షంలో రాష్ట్రంలో రాష్ర్టపతి పాలన విధించాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ఏర్పాటు అంశంపై  ఇష్టం వచ్చినట్లు సిఫారసులు చేసిన మంత్రుల బృందం సభ్యులు సోనియాకు బంట్రోతులు మాదిరిగా వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ‘సోనియాకు రాజ్యాంగం తెలియదు, ఆమె దాన్ని చదవలేదు..’ అని ఎద్దేవా చేశారు. అలాంటి పార్టీ అధ్యక్షురాలు ఏం చెబితే జీవోఎం సభ్యులు అది చేశారని విమర్శించారు.
 
  హైదరాబాద్‌కు ధీటుగా అద్భుత రాజధానిని అడవిలో నిర్మిస్తామని ప్రతిపాదన చేశారని, అక్కడ ఒక పశువుల ఆసుపత్రిని నిర్మించి జంతువులకు చికిత్స చేస్తే బాగుండేదన్నారు. యూపీఏ ప్రభుత్వంపై ప్రతిఒక్క ఎంపీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించి ఇంటికి పంపించాలన్నారు. అప్పుడే దేశాన్ని రక్షించిన వారవుతారన్నారు. రాష్ర్ట ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతారా? అని విలేకరులు ప్రశ్నించగా.. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఎలాగూ మూడు నెలల్లో ఇంటికి పోతుందంటూ వ్యాఖ్యానించారు. ఢిల్లీ ఎన్నికల్లో 28 సీట్లలో విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు ఆ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్‌కు చంద్రబాబు అభినందనలు తెలిపారు.
 
 ఈ విలేకరుల సమావేశానికి సాక్షిని అనుమతించలేదు. వివిధ మార్గాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా వార్త ఇవ్వటం జరిగింది. ఒకవేళ అనుమతించి ఉంటే ఈ క్రింది ప్రశ్నలకు చంద్రబాబును సమాధానాలు కోరేది.
 
 1.    సీడబ్ల్యూసీ తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసిన మరుసటి రోజు.. సీమాంధ్రలో నూతన రాజధాని ఏర్పాటుకు నాలుగైదు లక్షల కోట్లు అవ సరమవుతాయని, ఆ మొత్తాన్ని కేంద్రం భరించాలని డిమాండ్ చేసిన మీరే ఇప్పుడు హైదరాబాద్ గురించి మాట్లాడటమేంటి?
 
 2.    రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మిగిలిన పక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి మీరు మద్దతిచ్చి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదే కాదు కదా?
 
 3.    లోక్‌సభలో మీ పార్టీ ఎంపీలు ఆరుగురు ఉండగా, వారిలో సీమాంధ్రకు చెందిన నలుగురు ఎంపీలు మాత్రమే అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేయడంలోని ఆంతర్యమేమిటి?
 

మరిన్ని వార్తలు