దక్షిణ కొరియా బయల్దేరిన చంద్రబాబు

4 Dec, 2017 01:52 IST|Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు మూడురోజుల పర్యటన నిమిత్తం ఆదివారం దక్షిణ కొరియా బయలుదేరి వెళ్లారు. బుధవారం వరకూ ఆయన అక్కడ పర్యటిస్తారు. హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వెళ్లిన ఆయన కేంద్ర మంత్రులు గడ్కారీ, అరుణ్‌జైట్లీలను కలవాలని భావించినా సాధ్యం కాకపోవటంతో దక్షిణకొరియా పయనమైనట్లు సమాచారం. ముందు నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం చంద్రబాబు కేంద్ర మంత్రులను కలవాల్సి ఉన్నా వారి అపాయింట్‌మెంట్‌ దొరకలేదని తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు టెండర్ల రద్దుతో వివాదం నెలకొన్న నేపథ్యంలో రెండు మూడు రోజుల్లో ప్రధానమంత్రిని కలుస్తానని చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు.

అయితే ప్రధానిని కలవకుండా దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లటంతో అపాయింట్‌మెంట్‌ దొరకలేదని స్పష్టమవుతోంది. బూసన్‌ సిటీలో చంద్రబాబు పర్యటిస్తారు. ఆయన వెంట మంత్రులు యనమల రామకృష్ణుడు, అమర్‌నాథరెడ్డి, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, సీఎంవో ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్, పరిశ్రమలశాఖ కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్, ఈడీబీ సీఈవో జాస్తి కృష్ణకిశోర్, ఏపీఐఐసీ ఎండీ అహ్మద్‌ బాబు ఉన్నారు. 

మరిన్ని వార్తలు