సోనియాను విమర్శిస్తే...చంద్రబాబుకు గుణపాఠం తప్పదు

31 Dec, 2013 04:13 IST|Sakshi

జడ్చర్ల, న్యూస్‌లైన్: తెలంగాణ ప్రజలు దేవతలా భావిస్తున్న తమ అధినేత్రి సోనియాగాంధీపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిందలు మోపుతూ విమర్శలు దిగడం సరికాదని, ప్రజలే ఆయనకు తగురీతిలో గుణపాఠం చెబుతారని పీసీసీ అధికార ప్రతినిధి మల్లురవి హెచ్చరించారు. సోమవారం కావేరమ్మపేటలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ తిరుపతిలో జరిగిన బహిరంగసభలో చంద్రబాబు తెలంగాణ ఇచ్చిన సోనియాను మొదటి ముద్దాయిగా పేర్కొనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
  తెలంగాణ కు అనుకూలంగా ఉత్తరం ఇవ్వడం, అఖిలపక్షం సమావేశంలో అభ్యంతరం లేదని చెప్పిన ఆయన ఇప్పుడు మాట మార్చి నాలుగు నాలుకల ధోరణితో అవలంబిస్తున్నారని మండిపడ్డారు. సమన్యాయం పేరుతో బాబు ఆడుతున్న సరికొత్త నాటకాన్ని ప్రజలంతా అర్థం చేసుకుంటున్నారని చెప్పారు. ఆయన సమైక్య కుట్రలను గమనించి, టీడీపీ నేతలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నారని చెప్పారు. బీజేపీ ఓట్ల కోసం రాజకీయ క్రీడలను నిర్వహిస్తోందని ఆరోపించారు. సర్దార్‌పటేన్‌ను తమ నాయకుడని బీజేపీ ప్రచారం చేసుకుంటూ ప్రజల్లో మానసిక ఉద్వేగాన్ని రగిలిస్తోందని చెప్పారు. సర్దార్ జీ ముమ్మాటికీ కాంగ్రెస్ నాయకుడేనని పేర్కొన్నారు.
 
  బీజేపీ ఎంత గారడీ చేసినా భవిష్యత్తులో కాంగ్రెస్ విజయాన్ని అడ్డుకోలేరన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ పొత్తు పెట్టుకోవడం ఖాయమని తేలిపోయిందని, ఆ రెండు పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో తాను జడ్చర్ల అసెంబ్లీ నుంచే పోటీ చేస్తానని మల్లు ప్రకటించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, వక్ఫ్ బోర్డు జిల్లా చైర్మన్ రబ్బానీ, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధినిత్యానందం, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు రేణుక, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్‌యాదవ్, సుదర్శన్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
 
 
 
 

>
మరిన్ని వార్తలు