ఏజెన్సీలో బాక్సైట్ తవ్వుతాం

10 Aug, 2014 00:21 IST|Sakshi
ఏజెన్సీలో బాక్సైట్ తవ్వుతాం

ఇందుకు ఐటీడీఏలో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు: చంద్రబాబు
విశాఖ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో గిరిజనులకు సీఎం హామీలు

 
విశాఖపట్నం: రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో ఉన్న అపారమైన బాక్సైట్ నిల్వలను తమ ప్రభుత్వం తవ్వి తీయనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇందుకోసం ఐటీడీఏ (సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ) తరఫున ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. విశాఖ జిల్లాలో రెండో రోజు పర్యటనలో భాగంగా సీఎం ఆదివారం విశాఖపట్నంలోని విమానాశ్రయం ఎదురుగా నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లో తరచుగా వచ్చే డయేరియా, డెంగ్యూ వ్యాధులను ఎన్‌టీఆర్ ఆరోగ్య పథకంలో చేర్చుతామని ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి అన్ని గిరిజన గ్రామాలకు 10 లీటర్లు, 20 లీటర్ల మినరల్ వాటర్ క్యాన్లను సరఫరా చేస్తామన్నారు. పరిశ్రమలు స్థాపించాలనుకునే ఔత్సాహిక గిరిజన పారిశ్రామికవేత్తలకు రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు.

విజయనగరం జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని.. విద్యుత్ కొరతను తీర్చేందుకు మన్యంలో ఎల్‌ఈడీ లైట్లు, సోలార్ విద్యుత్‌ను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా గిరిజన యువతుల వివాహానికి రూ. 50 వేల ఆర్థిక సాయం పథకం అమలుచేస్తామన్నారు. గిరిజన మ్యూజియాన్ని నిర్మిస్తామన్నారు. విశాఖ జిల్లా ఏజెన్సీలోని అరకు, పాడేరు పర్యాటక రంగానికి ప్రసిద్ధని.. ఈ ప్రాం తాలను ఊటీ తరహాలో అభివృద్ధి చేస్తామని సీఎం చెప్పారు. ‘‘విశాఖ నుంచి అరకుకు అద్దాలతో కూడి న బోగీలతో రైలును నడుపుతామన్నారు.

రైతుల రుణ మాఫీ చేసి చూపించాం...

‘‘ఇప్పటికి అధికారం తీసుకుని రెండు మాసాలవుతోంది. అన్నీ ఇబ్బందులే. హైదరాబాద్‌లో ఆఫీస్ కూడా లేదు. లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌లో కొనసాగుతున్నాం. పాలన సెట్ కాలేదు. ఆర్థిక సంక్షోభంలో ఉన్నాం. అయినా రైతు రుణమాఫీ అమల్లో భాగంగా రూ. 1.50 లక్షలు చొప్పున మాఫీ చేసి చూపించాం...’’ అని సీఎం చెప్పుకొచ్చారు. విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా రెం డో రోజు శనివారం అనకాపల్లిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతల బాధ్యతలు గవర్నర్ చేతికిస్తామని కేంద్రం చెప్తే.. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని.. ఆయనకు కావాల్సింది అభివృద్ధి కాదని వివాదాలేనని ధ్వజమెత్తారు. సాయంత్రం నక్కపల్లిలో స్వయం సహాయక సంఘాలతో ముఖాముఖి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.

డ్వాక్రా రుణ మాఫీ హామీలో భాగంగా ఒక్కో సంఘానికి రూ. లక్ష మాఫీ చేస్తామని ప్రకటించారు. సెల్ ఫోన్లు లేని మహిళలకు సెల్ ఫోన్లు, ఒక్కో సంఘానికి టాబ్లెట్ పీసీ, మరుగుదొడ్ల నిర్మాణానికి సహకారం, డ్వాక్రా బజార్లు, వ్యసాయ ఆధునీకరణ, యాంత్రీకరణలో పరికరాల కొనుగోలుకు సాయం చేస్తామంటూ హామీలు గుప్పించారు. ఏ సమస్య వచ్చినా రెండు నిముషాల్లో ఆడబిడ్డల్ని కాపాడే బాధ్యత తీసుకుంటానన్నారు.
 
ఏమైనా అడిగితే.. ఆగ్రహమే..!

చంద్రబాబు విశాఖ జిల్లా పర్యటన రెండు రోజుల్లో పలువురు రైతులు, డ్వాక్రా మహిళలు రుణ మాఫీ హామీ అమలుపై ఆయనను నిలదీసి నిరసనలు వ్యక్తంచేశారు. తొలి రోజు మాదిరే రెండో రోజు కూడా బాబు తన వద్దకు డిమాండ్లతో వచ్చిన వారిపై ఆగ్రహం వెళ్లగక్కారు. తాళ్లపాలెం వద్ద మాట్లాడుతున్నపుడు ఓ బీఈడీ విద్యా ర్థి తాజాగా ప్రకటించే డీఎస్సీ నోటిఫికేషన్లో బీఈడీ అభ్యర్థులకు కూడా ఎస్‌జీటీ పోస్టులకు అర్హత కల్పించాలని డిమాండ్ చేశారు. కాస్త గట్టిగా అరిచి చెప్పడంతో బాబు ఆగ్రహిస్తూ.. అరిస్తే సమాధానం చెప్పనంటూ దాటవేసేందుకు ప్రయత్నించారు. తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ ఆ విద్యార్థి పట్టుపట్టారు. దీంతో సీఎం ‘‘మర్యాదగా చెప్తే వినాలి. నీ ఒక్కడికే కాదు అందరికీ సమస్యలుంటాయి. నువ్వు రెచ్చిపోతే ఇంక నీతో మాట్లాడను. బాగా పనిచేసేటపుడు అరిస్తే ఎవరికైనా కోపమెస్తుం ది’’ అని మండిపడ్డారు. తర్వాత పోలీసుల ద్వారా ఆ విద్యార్థి వివరాలు కనుక్కోవాల్సిందిగా స్థానిక నేతలు అధికారుల్ని పురమాయించడం గమనార్హం.
 
 

మరిన్ని వార్తలు