బిజినెస్ బాబూ.. 'బిజీ'నెస్

23 Sep, 2014 12:53 IST|Sakshi
బిజినెస్ బాబూ.. 'బిజీ'నెస్

ప్రజలే దేవుళ్లు.. వాళ్లకోసమే జీవిస్తానంటూ చెప్పే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వాస్తవానికి ఏం చేస్తున్నారు? ప్రస్తుతం ఆయన తన పార్టీలో వ్యాపారవేత్తలకు అత్యంత గౌరవం ఇస్తున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల అధినేత నారాయణను ముందుగానే మంత్రిని చేసి.. ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. రాజధాని నిర్ణయంలో గానీ, మరే విషయంలోనైనా ఆయనకు అగ్రపీఠం వేస్తున్నారు.

ఇక బడా వ్యాపారవేత్త సుజనా చౌదరికి చంద్రబాబు ఇచ్చే ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పార్టీలో ముఖ్యమైన నిర్ణయాలన్నింటి వెనకా ఆయన ఉంటారన్నది ఒక టాక్. పార్టీకి ఫండ్ ఇవ్వడంలో పెద్ద చెయ్యి అనిపించుకునే చౌదరి.. చంద్రబాబు నాయుడు కోటరీలో అత్యంత కీలకమైన వ్యక్తిగా అతి తక్కువ కాలంలోనే ఎదిగిపోయారు. ఇక కొత్త రాజధాని నగరాన్ని నిర్ణయించడానికి చంద్రబాబు తొమ్మిది మంది సభ్యులతో ఓ కమిటీ నియమించగా.. అందులో ఆరుగురు వ్యాపారవేత్తలే. ఈ నిర్ణయం ఎన్ని విమర్శలకు దారితీసినా ఆయన మాత్రం వెనకడుగు వేయలేదు.

ఇక ఛత్తీస్గఢ్ పర్యటనలో చంద్రబాబు వెంట అంతమంది వ్యాపారవేత్తలు, అధికారులు ఎందుకు ఉన్నారన్న విషయం కూడా చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. చంద్రబాబు వెంట ఈ పర్యటనలో ఏకంగా 15 మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారట! పోలవరం ప్రాజెక్టు విషయమై ఛత్తీస్గఢ్ లేవనెత్తిన అభ్యంతరాల గురించి చర్చించడానికి వెళ్తుంటే ఇంతమంది ఏం చేస్తారని అందరూ నోళ్లు వెళ్లబెట్టారు. సాధారణంగా ఎవరైనా ముఖ్యమంత్రి ఏదైనా వేరే రాష్ట్రానికి వెళ్తే.. ఆయన వెంట మంత్రులు, కొద్ది సంఖ్యలో అధికారులు ఉంటారు గానీ ఇంతమంది వ్యాపారవేత్తలు ఏంటని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు