'చంద్రబాబుకు.. దావోస్‌కు ప్రత్యేక అనుబంధం'

23 Jan, 2017 16:14 IST|Sakshi
'చంద్రబాబుకు.. దావోస్‌కు ప్రత్యేక అనుబంధం'
తాను చేస్తున్న విదేశీ పర్యటనలు, పెట్టుబడులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఆయన ఇంతవరకు 13 సార్లు దావోస్ వెళ్లారని, కానీ ఎందుకు వెళ్లారో, ఎందుకు వస్తున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు. చంద్రబాబుకు.. దావోస్‌కు ప్రత్యేక అనుబంధం ఉందని ఎద్దేవా చేశారు. స్విస్ బ్యాంకు లెక్కలు సరిచూసుకోడానికే ఆయన దావోస్ వెళ్తున్నారా అని ప్రశ్నించారు. ఏ దేశానికి వెళ్తే ఆ దేశం తరహాలో అమరావతి ఉంటుందని ఆయన చెబుతున్నారని విమర్శించారు. 
 
చంద్రబాబు, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అబద్ధాలు చెబుతున్నారని, విదేశాల్లో ఇలాంటి అబద్ధాలు చెబితే 420 కేసు పెట్టి జైల్లోకి తోస్తారని ఆయన హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆకాంక్షను చంద్రబాబు నీరుగార్చుతున్నారని, హోదా కోసం ప్రజలంతా ఉద్యమించాల్సిన సమయం వచ్చిందని అంబటి రాంబాబు చెప్పారు. అందరం కలిసి ప్రత్యేక హోదా సాధిద్దామని పిలుపునిచ్చారు.