మాకు ఏమైనా జరిగితే చంద్రబాబుదే బాధ్యత: అఖిలప్రియ

6 Nov, 2014 16:24 IST|Sakshi
మాకు ఏమైనా జరిగితే చంద్రబాబుదే బాధ్యత: అఖిలప్రియ

తమ కుటుంబానికి ఏమైనా జరిగితే దానికి టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ మండిపడ్డారు. అనుక్షణం ప్రజాసంక్షేమం కోసమే పనిచేసే తమ తండ్రి భూమా నాగిరెడ్డి మీద పోలీసులు తప్పుడు కేసులు పెట్టి, అనవసరంగా రౌడీషీట్ ఓపెన్ చేశారని అన్నారు. భూమా నాగిరెడ్డి అరెస్టు నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఆమె చెప్పిన విషయాల్లో ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి..

* నంద్యాల అభివృద్ధికి నాన్నగారు సొంత డబ్బు చాలా ఖర్చు చేశారు. ప్రతి ప్రాంతంలో సీసీ టీవీ కెమెరాలు పెట్టించి, దాని పర్యవేక్షణను పోలీసులకు అప్పగించారు.
* మున్సిపల్ ఛైర్మన్ సులోచన అసలు ఛైర్మన్లా కాకుండా రాష్ట్రానికి ముఖ్యమంత్రిలా ప్రవర్తిస్తున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఆపకూడదన్న విషయం కూడా ఆమెకు తెలియదు. ప్రోటోకాల్ను పట్టించుకోలేదు.
* వేరే ఫ్లోర్లీడర్ ముందు కూర్చున్నారన్న చిన్న విషయానికి ఆమె బెల్లుకొట్టి వెళ్లపోతుంటే, నాన్న లేచి.. తాను మాట్లాడాలని చెప్పారు. అయినా ఆమె పట్టించుకోలేదు.
* డోర్లు వేయండిరా అన్న ఒక్క మాటకు ఇన్ని కేసులు పెట్టారు. మున్సిపల్ చట్టం ప్రకారం ఎమ్మెల్యేకు మాట్లాడే హక్కుంది. సులోచన ఎవరి మద్దతుతో ఇవన్నీ చేస్తున్నారో అందరూ గమనిస్తారు. ప్రజలు తప్పకుండా వాళ్లకు బుద్ధి చెబుతారు
* నిజంగా హత్యాయత్నం చేయాలంటే మీడియా ముందు, పోలీసుల ముందు ఎందుకు చేస్తారు?
* రెండు పార్టీలు కొట్టుకున్నప్పుడు భూమా నాగిరెడ్డి మీద కేసులు పెట్టినవాళ్లు.. అటు సులోచన మీద మేం కేసులిస్తే ఎందుకు తీసుకోవట్లేదు?
* రెండు రోజుల్లోనే మూడు కేసులు పెట్టి, రౌడీషీట్ కూడా తెరిచారు. ఇంతే వేగంతో ఇతర కేసులు కూడా డీల్ చేస్తే, ఈపాటికి కర్నూలు జిల్లాలో సగం కేసులు పరిష్కారం అయిపోయేవి.
* కేసులు ఎందుకు పెట్టారంటే.. పైనుంచి ఒత్తిళ్లు వస్తున్నాయన్నారు. టీడీపీ వాళ్లకు విజ్ఞప్తి చేస్తున్నా.. పోలీసులను వాళ్ల పని వాళ్లను చేసుకోనివ్వండి.
* అసెంబ్లీలో రెండు పార్టీల వాళ్లు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. చాలాసార్లు ఇలా జరిగాయి. ఇప్పటివరకు ఎక్కడైనా ఎవరిమీదైనా కేసులు పెట్టారా?
* రెండు గ్రూపుల మధ్య జరిగిన కొట్లాటకు హత్యాయత్నం కేసు పెట్టారు. అసలు నేరచరిత్ర లేని కౌన్సిలర్లమీద కూడా హత్యాయత్నం కేసు పెట్టారు. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి మీద నిజానిజాలు చూడకుండా, ఇలా వరుసపెట్టి మూడు కేసులు, రౌడీషీట్ తెరవడం తగునా?
* మేం టీడీపీ వాళ్లమీద కేసులు పెడితే ఒక్కటీ తీసుకోలేదు. వాళ్ల మీద విచారణ లేదు, అరెస్టులు లేవు. కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్లమీదే కేసులు పెడుతున్నారు
* ఫ్యాక్షనిజం ఒకప్పుడు ఉండేదేమోగానీ, ఇప్పుడు కర్నూలు జిల్లాలో లేదు. ఆ పేరుచెప్పి భయపెట్టడానికి ప్రయత్నించకండి. ఫ్యాక్షనిజం, రౌడీయిజం లాంటివాటిని మేం ప్రోత్సహించేది లేదు.
* నాన్నగారు ఎన్ని త్యాగాలు చేశారో ఆళ్లగడ్డ, నంద్యాల ప్రజలకు తెలుసు. ఆయన నిజంగానే రౌడీయిజం చేసి ఉంటే ఆయన ఎస్పీ కార్యాలయానికి వెళ్లినప్పుడు ఆయన వెంట అంతమంది వచ్చేవారు కారు.
* అమ్మను కోల్పోయిన షాక్ లోంచి మా కుటుంబం ఇంకా బయటకు రాలేదు. నాన్న ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండకుండా ప్రజల కోసమే తిరుగుతున్నారు. అంత బిజీలో ఉండి.. ఇలా ఎందుకు చేస్తారు?
* మీరు భయపెడితే భయపడటానికి మేమేం తప్పులు చేయడంలేదు. దాన్ని గుర్తుంచుకోండి.
* ఈ కేసులు ఏవీ లేకముందే.. నంద్యాలకు ఉప ఎన్నికలు వస్తాయని, భూమా నాగిరెడ్డి మీద కేసులు ఎలా పెట్టాలో మాకు తెలుసని టీడీపీ జిల్లా ఇన్ఛార్జి సోమిశెట్టి వెంకటేశ్వర్లు చెబుతున్నారు. ఆయన ఎవరి అండతో ఇలా చెబుతున్నారో అందరికీ తెలుసు.
* మా కుటుంబానికి ఎవరికైనా ఏ ఇబ్బంది కలిగినా దానికి బాధ్యత చంద్రబాబుదే. ఆయన మద్దతు లేకుండా ఇలా.. అది కూడా రౌడీషీట్ పెట్టకముందే చెప్పడం సాధ్యం కాదు.
* టీడీపీ అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను చాలామందిని చంపేశారు. తప్పుడు కేసుల్లో బుక్ చేస్తున్నారు. ఒక్క కేసు మీద కూడా స్పష్టత లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేల మీద పడుతున్నారు. ప్రజలంతా చూస్తున్నారు.. మీరు జాగ్రత్తగా ఉండాలి.
* పోలీసులకు నేను చెప్పదలచుకున్నది ఒకటే. ఒత్తిడి ఉందని ఒకవైపు మాత్రమే పనిచేయడం తగదు. ఇలా అన్యాయం చేయొద్దు.
* నాన్నగారి మీద మూడు కేసులు పెడితే.. వాటిలో ఒక కేసు మీదే రిమాండుకు పంపారు. అంటే మిగిలినవి తప్పని వాళ్లకు కూడా తెలుసు. ఈ గొడవ జరిగినప్పుడు నలుగురికి గాయాలయ్యాయి. ఆ నలుగురిలో ఎవరూ ఫిర్యాదు చేయలేదు. కేవలం ఛైర్పర్సన్ సులోచన మాత్రమే ఫిర్యాదు చేశారు.
* న్యాయవ్యవవస్థ మీద మాకు నమ్మకం ఉంది. క్లీన్ చిట్తో నాన్న బయటకు వస్తారన్న విశ్వాసం మాకుంది. ఆయన వచ్చాక ఛైర్మన్ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఆ తర్వాత సరైన విచారణ చేయకుండా కేసు పెట్టిన పోలీసుల మీద కూడా న్యాయపోరాటం చేస్తాం.

మరిన్ని వార్తలు