పుట్టపర్తికి చేరుకున్న చంద్రబాబు

20 Apr, 2015 11:08 IST|Sakshi

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అనంతపురం జిల్లా పర్యటనకు బయలుదేరారు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆయన 11.20 గంటలకు అనంతపురం జిల్లా పుట్టపర్తి చేరుకున్నారు. పుట్టపర్తి విమానాశ్రయం వద్దనే సీపీఐ ఆందోళనకు దిగింది. హంద్రీనీవాకు రూ.200 కోట్లు కేటాయించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

అనంతరం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఐటీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఏర్పాటు చేసిన కేక్ను సీఎం కట్ చేశారు. చంద్రబాబు ఒకరోజు అనంత పర్యటనలో భాగంగా రాప్తాడు, పెనుగొండ నియోజక వర్గాల్లో పర్యటిస్తారు. నియోజక వర్గాల పరిధిలోని గొల్లపల్లి రిజర్వాయ్ పనులను, నాగసముద్రం గేటు వద్ద అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటపొలాలను కూడా చంద్రబాబు పరిశీలిస్తారని సమాచారం.

దాంతో పాటుగా రామగిరి మండలం కుంటిమద్ది చెరువులో 'నీరు - చెట్టు' కార్యక్రమానికి కూడా ఆయన హాజరవుతారు. సీఎం అనంత పర్యటన సందర్భంగా జిల్లా పోలీసు వ్యవస్థ ముందస్తు అరెస్టులు చేపట్టింది. ఇప్పటికే వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ ఇంటిని గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. అదేవిధంగా సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీశ్ తో సహా 20 మందిని ముందస్తు అరెస్టు చేశారు.

>
మరిన్ని వార్తలు