రేపు జిల్లాకు సీఎం రాక

26 Feb, 2015 02:38 IST|Sakshi

కడప రూరల్: ఈనెల 27న (శుక్రవారం) రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాకు రానున్నారు. పర్యటన వివరాలను జిల్లా రెవెన్యూ అధికారి సులోచన బుధవారం వెల్లడించారు. ఆరోజు మధ్యాహ్నం 1.10 గంటలకు కర్నూలు నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి ఏరియల్ సర్వే ద్వారా గండికోట ప్రాజెక్టుకు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటారన్నారు. 2.05 నుంచి 3.00 గంటల వరకు గండికోట ప్రాజెక్టు దగ్గర రైతులతో ముఖాముఖి చర్చ, సమావేశంలో పాల్గొంటారన్నారు. 3.15 గంటలకు గండికోట ప్రాజెక్టు హెలిప్యాడ్ నుంచి బయలుదేరి తిరుపతికి వెళతారన్నారు.
 
 నేడు మంత్రి ఉమామహేశ్వరరావు రాక
 రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గురువారం జిల్లా పర్యటనకు వస్తున్నారని ఆమె తెలిపారు. ఉదయం 9 నుంచి 9.30 గంటల వరకు కడపలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని 10 గంటలకు గుర్రపు ట్యాంకు, సర్వరాయసాగర్, వామికొండ, గండికోట, జమ్మలమడుగును సందర్శిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు మైలవరం డ్యాం టర్నల్ ఎగ్జిట్,ఆదినిమ్మాయపల్లె ఆయకట్టును పరిశీలించి ప్రొద్దుటూరుకు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం గండికోట రిజర్వాయర్, పైడిపాలెం, సింహాద్రిపురం, ఎర్రబల్లె సందర్శించి పులివెందులకు చేరుకుంటారన్నారు. రాత్రి 8 గంటలకు పులివెందుల నుంచి ముద్దనూరుకు చేరుకుని రాత్రి 10 గంటలకు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ వెళతారన్నారు.
 
 సీఎం పర్యటన విజయవంతం చేయండి
 ఎర్రగుంట్ల: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం గండికోట ప్రాజెక్ట్‌కు రానున్నారని సీఎం పర్యటను విజయవంతం చేయాలని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి తెలిపారు.
 
 బుధవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు వామికొండ, గండికోట ప్రాజెక్ట్‌లు సందర్శిస్తారని కార్యకర్తలంతా పాల్గొనాలని కోరారు. తరువాత టీడీపీ జిల్లా నాయకుడు సురేష్‌నాయుడు మాట్లాడుతూ  సీఎం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ వెంకటశివారెడ్డి, తుపాకుల పవన్‌కుమార్‌రెడ్డి, ఎకెఎం శ్రీనివాసరెడ్డి, లాడ్జి అంకిరెడ్డి, సుంకరం నాగే శ్వరరావుతో పాటు తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు