అధికారులపై చంద్రబాబు ఆగ్రహం

29 Jul, 2015 16:36 IST|Sakshi

హైదరాబాద్: రాయలసీమలో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణ పనుల పురోగతిపై కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు కల్లెక్టర్లతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు .

జీడిపల్లి వద్ద జూలై 23 న ప్రాజెక్టుల నిర్మాణ పనులపై సమీక్ష జరిపామంటూ, ఇప్పటివరకు ఎంత పని జరిగింది ? ఎప్పటికి పూర్తి చేస్తారు ? అని ప్రశ్నించారు . 23 రోజుల్లో జరిగిన పనితీరుపై చంద్రబాబు అసంతృప్తిని వ్యక్తం చేశారు. భూ సేకరణ, పూడికతీత , కాంక్రీట్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ పనుల పూర్తికి సహకరించని కాంట్రాక్టర్లకు నోటీసులు ఇవ్వాలని , కొంతకాలం వారిని బ్లాకు లిస్టులో పెట్టాలని ఆదేశించారు.

పోలవరం కుడి ప్రధాన కాలువ పనులకు రూ.700 కోట్లు ఖర్చుచేశామంటూ, రాష్ట్రంలో ఇప్పటి వరకు భూసేకరణకు రూ.1028 కోట్లు వ్యయం చేసిన విషయం గుర్తు చేశారు. ఖరీఫ్ పనులు ప్రారంభమైన నేపథ్యంలో ఇన్ పుట్ సబ్సిడీని రైతులకు వెంటనే పంపిణీ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు . అనంతపురం జిల్లాలో ఆగస్టు 5 నుంచి పంపిణీ చేయాలని సూచించారు. అన్ని చెరువులను నీటితో నింపాలని.. దీనివల్ల భూగర్భజలాలు పెరిగి బోర్లు రీఛార్జి అవుతాయన్నారు.

సమావేశంలో జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, జలవనరుల శాఖ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి పీవీ రమేష్ , సీఎంవో ముఖ్యకార్యదర్శి సాయిప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు, ఛీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు