చంద్రబాబు మారలేదు

6 Dec, 2014 02:11 IST|Sakshi

 నెల్లూరు (అర్బన్): సీఎం చంద్రబాబు ఏం మారలేదని, ఆయన పాత బాబేనని వైఎస్సార్‌సీపీ మహాధర్నా జిల్లా సమన్వయకర్త, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గత తొమ్మిదేళ్ల రాక్షస పాలనను ఈ ఆరు నెలల్లోనే మళ్లీ గుర్తుకు తెచ్చారన్నారు. టీడీపీ ప్రభుత్వం మోసపూరిత విధానాలకు వ్యతిరేకంగా శుక్రవారం కలెక్టరేట్ వద్ద జరిగిన మహాధర్నాలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్ ప్రారంభించిన జలయజ్ఞాన్ని ధనయజ్ఞనంగా అభివర్ణించిన బాబు ఇప్పుడు హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టుల ప్రగతిని పట్టించుకోలేదన్నారు. రూ. 50 వేల లోపు రుణం తీసుకున్న వారికి మాఫీ చేయాలన్నా.. రూ. 30 వేల కోట్లు అవసరమని, అయితే బాబు రూ.5 వేల కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు.
 
  దీన్నీ ఒక వర్గం మీడియా ఎంతో గొప్పగా చూపడం ఆశ్చర్యంగా ఉందన్నా రు. ఈ ఆరు నెలల్లో 86 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని అడిగిన మీడియాపై చూపిస్తావా అంటూ దబాయించడం బాబుకే చెల్లిందన్నారు. వైఎస్సార్ విద్యుత్ బకాయిలు మాఫీ చేస్తే అందులో ఎక్కువగా లబ్ధి పొందింది టీడీపీ కార్యకర్తలేనని, పార్టీలకతీతంగా వైఎస్సార్ ప్రజలందరికీ మేలు చేశారన్నారు. బాబు ఆరు నెలల పాలన ప్రజలకు ఏవగింపుగా మారిందన్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుందన్నారు.
 
 బాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు :
 ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి
 ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలకు నిలబెట్టుకోకపోతే చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రం విడిపోయిన సమయంలో చంద్రబాబు సీఎంగా ఉంటే రాజధాని కడతాడు, అనుభవం ఉందని అని కొంత మంది భావించారన్నారు. ఆరు నెలల బాబు పాలన చూసి ప్రజలకు మోసపోయామన్న భావన కలుగుతోందన్నారు. రుణమాఫీపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రకటన చేయాల్సిందిగా పార్టీ నేతలు కోరితే అబద్ధపు హామీలు ఇవ్వలేమని చెప్పారన్నారు. ఆర్థిక వేత్తలతో మాట్లాడిన తర్వాతే ఆయన ఆ మాట చెప్పారని, డ్వాక్రా రుణాలు రద్దు చేయొచ్చు అంటే ఆ హామీని ఇచ్చారన్నారు.
 
 తాను పార్లమెంట్‌లో ఎన్నికల సంస్కరణలపై ప్రశ్న వేశానన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక ప్రభుత్వాలు నిలబెట్టుకోవడం లేదని, తప్పించుకునేందుకు రకరకాల కారణాలు చెబుతున్నారని, దీన్ని ఎలా నియంత్రిస్తారు అని లేవనెత్తితే కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ దీనిపై చర్చిస్తున్నట్లు చెప్పారన్నారు. చిన్న పిల్లలకు బయోస్కోప్‌లో చూపినట్లు ప్రజలకు రాజధానిని చూపిస్తున్నారన్నారు. మంచి రాజధానిని నిర్మిస్తే సంతోషమేనని, అదే సమయంలో ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాల్సిన బాధ్యత బాబుపై ఉందన్నారు. బాబు నీచరాజకీయాలకు పాల్పడుతున్నారని, కర్నూలు, ప్రకాశం జెడ్పీ చైర్మన్ కుర్చీల కోసం ఏం చేశారో, నెల్లూరు జెడ్పీ చైర్మన్ కుర్చీ కోసం ఎంతగా దిగజారారో ప్రజలందరికీ తెలుసన్నారు.
 
 టీడీపీ కార్యకర్తల కోసమే ప్రభుత్వం ఉంది :
 తిరుపతి ఎంపీ వరప్రసాదరావు
 ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి చూస్తోంటే టీడీపీ కార్యకర్తల కోసమే చంద్రబాబు ప్రభుత్వం అన్నట్లుగా ఉందని తిరుపతి ఎంపీ వరప్రసాద్‌రావు అన్నారు. తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసిన బాబు రాష్ట్ర బడ్జెట్ రూ.60 వేల కోట్లు మాత్రమే అని తెలిసినా లక్ష కోట్ల రుణాలను మాఫీ చేస్తామని చెప్పడం విడ్డూరమన్నారు. ప్రజలను మోసం చేయకూడదని జగన్‌మోహన్‌రెడ్డి మాటపై నిలబడ్డారు.. కాబట్టే బాబు సీఎం అయ్యారన్నారు. సింగపూర్ ఎంతో చిన్న నగరమని, అక్కడికి వెళ్లి అలా మన రాష్ట్రాన్ని తయారు చేస్తామని చెప్పేందుకు సిగ్గుపడాలన్నారు. సమస్యల్ని పట్టించుకోకుండా రాజధానిని కడతానని చెప్పడం సమంజసం కాదన్నారు. కనీసం వృద్ధాప్య పింఛన్లు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని, వాళ్ల పార్టీ నేతలు చెప్పిన వాళ్లకే పింఛన్లు ఇస్తున్నారని విమర్శించారు.
 
 మోసగాళ్లకు మోసగాడు చంద్రబాబు : నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
 ఎన్నికలకు ముందు మీఇంటి బిడ్డగా రైతు, డ్వాక్రా, చేనేత రుణాలను మాఫీ చేస్తామని చెప్పిన బాబు ఎన్నికలయ్యాక మాట మార్చి మోసగాళ్లకు మోసగాడుగా మారాడని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు  ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో బాబుకు నిద్ర పట్టలేదని, అందుకే రుణమాఫీపై విధాన ప్రకటన చేసేందుకు నిర్వహిం చిన ప్రెస్‌మీట్‌లో ఏదేదో మాట్లాడారన్నారు. ప్రజల సొమ్ముతో ఆయన కోటరీలోని రియల్టర్లను, వ్యాపారవేత్తలను సింగపూర్, జపాన్ తీసుకెళ్తూ అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదన్నారు. ఆయన పదేపదే విదేశాలకు వెళ్లడం చూస్తోంటే హెల్త్ చెకప్ కోసం వెళుతున్నట్లు అనిపిస్తోందన్నారు. పసిబిడ్డల వద్ద డొనేషన్లు వసూలు చేసిన వాళ్లు మేధావులంటూ మంత్రి పదవులు ఇచ్చారని, పనికిమాలిన వాళ్లంతా మేధావులు కారన్నారు.
 
 మొదటి సంతకానికి విలువ లేకుండా చేశారు: జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి
 వైఎస్సార్ మొదటి సంతకానికి ఎంతో విలువ ఇస్తే చంద్రబాబు మాత్రం విలువ లేకుండా చేశారని జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అన్నారు. జిల్లాలో రుణమాఫీ కోసం 2013 డిసెంబర్ నాటికి రూ.4 వేల కోట్లు అవసరమని, 10 శాతం వడ్డీ వేసుకుంటే మరో రూ.500 కోట్లు కావాలన్నారు.
 
  వడ్డీ గురించి బాబు ఏం చెప్పలేదని, రూ.50 వేలపైన రుణం తీసుకున్న వారికి 20 శాతం కడతామని చెబుతున్నారన్నారు. బ్యాంకులు మాత్రం లోన్ కట్టకపోతే కొత్త రుణాలు ఇవ్వలేమని చెబుతున్నాయని, దీనిపై స్పష్టత లేదన్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ద్వారా నీళ్లు ఇస్తామని చెప్పారని అయితే ఆ పథకాన్ని గాలికొదిలేశారన్నారు. పథకానికి ఎన్‌టీఆర్ పేరు పెట్టి ఇలా చేయడం సిగ్గు చేటన్నారు. జిల్లాలో 2, 3 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటి భర్తీకి ప్రభుత్వం ప్రయత్నించడం లేదన్నారు. జిల్లాలో లక్షన్నర రేషన్ కార్డులను తొలగించారన్నారు.
 

మరిన్ని వార్తలు