టీడీపీ నుంచి వాకాటి సస్పెన్షన్

13 May, 2017 19:10 IST|Sakshi
టీడీపీ నుంచి వాకాటి సస్పెన్షన్

ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా డబ్బులు ఖర్చుపెట్టి గెలిచిన నారాయణరెడ్డి ఇంటి మీద శుక్రవారం నాడు సీబీఐ అధికారులు దాడులు జరపడంతో.. ఆయనతో తమకు సంబంధం లేదని చెప్పుకోడానికి ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. వివిధ బ్యాంకులకు రూ. 450 కోట్ల మేర బకాయిలు ఉన్న వాకాటి నారాయణరెడ్డి విల్‌ఫుల్ డీఫాల్టర్‌గా ఉన్నారా అనే విషయం గురించి దర్యాప్తు చేసేందుకే సీబీఐ ఈ సోదాలు చేసిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు సీబీఐ సోదాలు చేయడం, బ్యాంకులకు భారీగా బకాయిలు ఉన్న విషయం మరోసారి బయటకు రావడంతో... ఆ గుట్టు రట్టు కావడంతో చంద్రబాబు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. విదేశీ పర్యటన నుంచి చంద్రబాబు రాగానే ఈ నిర్ణయం వచ్చింది. ఇంతకుముందు కూడా చాలామంది టీడీపీ నేతలపై ఈ తరహా ఆరోపణలు వచ్చినా వారెవ్వరి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోని చంద్రబాబు.. ఇప్పుడు మాత్రం తొలిసారిగా సస్పెన్షన్ వేటు వేయడం విశేషం. పార్టీలో ఎవరు తప్పుచేసినా కరెక్ట్ కాదని, అందుకే ఆయనను సస్పెండ్ చేస్తున్నామని బాబు ప్రకటించారు.

మరిన్ని వార్తలు