ఆ ఘనుడు చంద్రబాబే!:షర్మిల

30 Jul, 2013 03:43 IST|Sakshi
ఆ ఘనుడు చంద్రబాబే!:షర్మిల

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘స్థానిక ఎన్నికలు వచ్చేసరికి పంచాయతీలకు అధికారాలు ఇచ్చింది తానేనని చంద్రబాబు నాయుడు చె ప్తున్నారు. నిజానికి పంచాయతీలను సర్వనాశనం చేసి, నోడల్ అధికారులను పెట్టి ఏళ్ల తరబడి పంచాయతీ ఎన్నికలు జరపకుండా చేసిన చరిత్ర ఆయనది.
 
 గామ పంచాయతీలను నిర్వీర్యం చేసిన ఘనుడు చంద్రబాబే. వినేవాళ్లు ఉంటే హైదరాబాద్‌లో చార్మినార్ తానే కట్టానని, విశాఖపట్టణంలో సముద్రం తానే తవ్వించానని నిస్సిగ్గుగా చెప్పగలరు ఈ చంద్రబాబు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ‘‘చంద్రబాబు ఇప్పడు ‘నాకు గనుక పగ్గాలిస్తే రాష్ట్రాన్నే కాదు, దేశాన్నే గాడిలో పెడతానని’ చెప్తున్నారు. చంద్రబాబుకి కనుక పెత్తనం ఇస్తే మన గొయ్యి మనం తవ్వుకున్నట్లే’’ అని విమర్శించారు. ప్రజాసమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని, దానితో అంటకాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైఖరిని ఎండగడుతూ షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర సోమవారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో సాగింది. సోమవారం యాత్ర మొదలైన తర్వాత 4 కిలోమీటర్లు నడవటంతో షర్మిల 3,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన మహిళగా చరిత్ర సృష్టించారు. ఈ చరిత్రాత్మక ఘట్టానికి పాతపట్నం నియోజకవర్గంలోని ధనుపురం గ్రామం వేదికైంది. ఈ సందర్భంగా షర్మిలకు శుభాకాంక్షలు తెలిపేందుకు ధనుపురం గ్రామానికి చెందిన ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. వారిని ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ఈ ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..
 
 కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేయాలి?
 
 ‘‘ప్రజలపై పగబట్టినట్టుగా.. ఈ కాంగ్రెస్ పాలకులు ప్రజా సంక్షేమ పథకాలకు సమాధి కట్టారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి కుంభకర్ణుల్లా నిద్రపోతున్నారు. పైగా ఈ కాంగ్రెస్ నాయకులు.. మళ్లీ ఎన్నికలంటూ మీ ఇళ్లకు వస్తారు. అసలు ఈ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? ఏడు గంటల ఉచిత విద్యుత్తును 3 గంటలకు కుదించినందుకా? ఎరువుల ధరను 300 శాతం నుంచి 800 శాతానికి పెంచినందుకా? రైతులకు పెట్టుబడి ధరలు పెంచి, మద్దతు ధర తగ్గించి వాళ్ల కడుపు మీద తన్నినందుకా? ఆరోగ్యశ్రీ నుంచి 133 వ్యాధులను తొలగించి, 97 ఆసుపత్రులను తొలగించి, పేదవాడిని మళ్లీ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లమని చెప్తున్నందుకు మీకు ఓటేయాలా? ఒక కొత్త పక్కా ఇల్లు కట్టివ్వనందుకు ఓటేయాలా? 104, 108 కనుమరుగైనందుకు ఓటేయాలా? 9 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తామని, 30 కిలోల బియ్యం ఇస్తామని మేనిఫెస్టోలో వాగ్దానాలు చేసి నాలుగేళ్లు గడిచిపోయినా ఏ ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదు. మీకు ఏం విశ్వసనీయత ఉందని కాంగ్రెస్ వాళ్లను అడుగుతున్నాం.
 
 అన్నింటా సర్కారు విఫలం..
 
 ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతివిషయంలోనూ విఫలం అయింది. ప్రజల విశ్వాసం కోల్పోయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద రైతులకు, కార్మికులకు, చేనేతలకు, గీతన్నకు, విద్యార్థులకు, వృద్ధులకు, వితంతువులకు ఏ ఒక్కరికీ కూడా భరోసా లేదు. కానీ ఒక్క చంద్రబాబుకు మాత్రమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద భరోసా ఉంది. అందుకనే అన్ని ప్రతిపక్షాలూ కలిసి ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వం మీద అవిశ్వాసం పెడితే ఈ చంద్రబాబు నాయుడు రెండు చేతులూ అడ్డంపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడారు.
 
 విలువలకు నిలబడిన మనిషి జగనన్న..
 
 ఎన్టీఆర్ బతికి ఉండగానే చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారు. వైఎస్సార్ చనిపోయిన తరువాత ఈ కాంగ్రెస్ నాయకులు ఆయనకు వెన్నుపోటు పొడిచారు. ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఇప్పుడు ఈ వెన్నుపోటుదారులంతా ఒక్కటయ్యారు. జగనన్న మీద కుట్రలు చేస్తున్నారు. కానీ జగన్‌మోహన్‌రెడ్డి విలువలకు, విశ్వసనీయతకు కట్టుబడే మనిషి. ఒకమాట ఇచ్చారు అంటే ఊపిరి ఉన్నంత వరకు మాట తప్పకూడదు, మడమ తిప్పకూడదు అని నమ్మి ఆ మాట నిలబెట్టుకోవడం కోసం ఎన్ని కష్టాలు వచ్చినా జగనన్న ముందడుగే వేశారు. కానీ విలువలతో కూడిన రాజకీయాలు చేసే దమ్ము, ధైర్యం ఈ కాంగ్రెస్, టీడీపీ నాయకులకు లేదు. అందుకనే సీబీఐ వెనకాల దాక్కొని దాడి చేస్తున్నారు.’’
 
 మరో ప్రజాప్రస్థానం ఎట్ 3000
 
 
 మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర 224వ రోజు ఆదివారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం దాసుపురం నుంచి షర్మిల నడక ప్రారంభించారు. నవతళ జంక్షన్ మీదుగా ధనుపురం చేరుకున్నారు. ఈ గ్రామం చేరడంతో పాదయాత్ర 3000 కిలో మీటర్ల మైలు రాయిని దాటింది. ఇక్కడ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కొరసవాడ, కాగువాడ, బూరగాం, పాతపట్నం మీదుగా నడిచిన షర్మిల సూర్యనారాయణపురం శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 7.00 గంటలకు చేరుకున్నారు. మొత్తం 16.5 కిలోమీటర్లు నడిచారు. షర్మిల వెంట నడిచిన వారిలో ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు, జిల్లా పార్టీ కన్వీనర్ ధర్మాన పద్మప్రియ, మాజీ ఎంపీ కణితి విశ్వనాథం, పాతపట్నం కో ఆర్డినేటర్ కల్మట వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యేలు కల్మటి మోహన్‌రావు, కుంబా రవిబాబు, వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు పాలవలస విక్రాంత్, వరుదు కళ్యాణి, వైవీ సూర్యనారాయణ, కిల్లి రామ్మోహన్‌రావు, విశ్వాసరాయి కళావతి, బొడ్డేపల్లి మాధురి, గొర్లె కిరణ్, పీఎంజే బాబు, వజ్జ బాబూరావు, స్థానిక నాయకులు కొయ్య ప్రసాదరెడ్డి,హన్మంతు కిరణ్,
 బొడ్డేపల్లి పద్మజ, కూనమంగమ్మ, దుప్పల రవీంద్ర, దవళ వెంకటగిరిబాబు తదితరులు ఉన్నారు.
 
   నాన్న యాత్రకు కొనసాగింపే..
 
 ‘‘ప్రజా సమస్యలు పట్టించుకోని ఈ ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం.. కాంగ్రెస్‌తో కుమ్మక్కై చేస్తున్న నీచమైన రాజకీయాలను ఎండగడుతూ ఈ పాదయాత్ర చేపట్టాను. దేవుని దీవెనతో, నాన్న ఆశీస్సులతో ఇడుపులపాయ నుంచి జగనన్న వదిలిన ఈ బాణం ఇప్పటిదాకా 3 వేల కిలో మీటర్లు ప్రయాణించింది. నాడు వైఎస్సార్ చేసిన ‘ప్రజాప్రస్థానమే’.. నేడు నేను జగనన్న తరఫున చేస్తున్న ఈ ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రకు స్ఫూర్తి. సరిగ్గా పదేళ్ల కిందట వైఎస్సార్ తన పాదయాత్రను ఒక మహాయజ్ఞంలా చేశారు. మండుటెండలో రోజుకు 20 కిలోమీటర్లకు పైగా నడిచి ప్రజలతో మమేకమయ్యారు. ప్రజల కష్టాలను కళ్లారా చూశారు. ప్రజల అవసరాలను గమనించారు. వారి బాధలు అర్థం చేసుకున్నారు. అందుకే వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన మరు నిమిషం నుంచి ప్రతి క్షణం ప్రజల గురించే ఆలోచన చేశారు. కులాలకు, మతాలకు, పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా ఆలోచన చేసి, మన రాష్ట్రంలో ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని తపించారు. ఆ తపన నుంచే వైఎస్సార్ అద్భుత పథకాలు పుట్టాయి. అటువంటి మహానేత వైఎస్సార్ ఆ వేళ చేసిన ప్రజాప్రస్థానం పాదయాత్రకు కొనసాగింపే మా పాదయాత్ర.’’     
 - షర్మిల

 

>
మరిన్ని వార్తలు