బాబు, మోడీ కలయికతో చేటే

18 Dec, 2013 06:17 IST|Sakshi
బాబు, మోడీ కలయికతో చేటే

 సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తీర్మానం
 సాక్షి, హైదరాబాద్:  చిరకాల మిత్రపక్షం టీడీపీతో సీపీఐ తెగతెంపులు చేసుకుంది. మతతత్వవాదులతో కలిస్తే చంద్రబాబు కూడా మతతత్వవాదేనని పేర్కొంది. టీడీపీ, బీజేపీల మధ్య ఎన్నికల అవగాహన లౌకిక వ్యవస్థకే ముప్పని అభిప్రాయపడింది. సోమవారమిక్కడ జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ మేరకు తీర్మానం చేసింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ‘‘టీడీపీ, బీజేపీలు ఎన్నికల అవగాహనకు వెళ్తున్నాయి. మోడీ భజనలో చంద్రబాబు మునిగిపోయారు. ఈ పొత్తు లౌకిక వ్యవస్థకు ప్రమాద ఘంటికలే. అదే జరిగితే కోట్లాది మైనారిటీలే కాక ప్రజాస్వామ్యవాదులూ మిగలరు. అందులో చంద్రబాబు కూడా ఒకడవుతారు. దశావతారాలను మించిన రాజకీయ అవతారాలతో చంద్రబాబు  రాజకీయాలలో విశ్వాసం పోగొట్టుకున్నారు’’ అని తీర్మానించినట్టు నారాయణ చెప్పారు.
 
 టీడీపీతో తెగతెంపులు చేసుకున్నామని, ఎన్నికల్లో ఎవ్వరూ కలిసిరాకుంటే స్వతంత్రంగానే పోటీ చేయాలని పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించిందని తెలిపారు. సభకు బిల్లొస్తే ఓడిస్తాం, పొడిచేస్తామని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన సీఎం కిరణ్‌కుమార్, ఇతర నాయకులు సోమవారం సభలో ఎందుకు లేరని ప్రశ్నించారు. తెలంగాణ ఇవ్వడం తమకు అభ్యంతరం లేదన్న చంద్రబాబు తమ పార్టీ ఎమ్మెల్యేలు బిల్లును చించిపోగులు పెడుతుంటే ఎందుకు నోరు మెదపలేదని నిలదీశారు. అసెంబ్లీలో బిల్లును అడ్డుకోవడం అప్రజాస్వామికమని విమర్శించారు. చట్టసభల్ని నమ్మాలని, లేకుంటే తుపాకులతో అడవుల్లోకి వెళ్లాలని వ్యాఖ్యానించారు.
 
 చండ్ర సీడీ ఆవిష్కరణ
 కమ్యూనిస్టు కురువృద్ధుడు చండ్ర రాజేశ్వరరావు శత జయంతి ఉత్సవాలలో భాగంగా ‘లౌకిక వ్యవస్థను కాపాడండి’ అనే నినాదంతో ఈనెల 26న పార్టీ 88వ వ్యవస్థాపకదినోత్సవాలను నిర్వహిస్తున్నట్టు నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా చండ్ర జీవితంపై ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రూపొందించిన ఒగ్గుకథ సీడీని మంగళవారమిక్కడ ఆవిష్కరించారు. నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సినీ ప్రముఖులు తమ్మారెడ్డి భరద్వాజ, వందేమాతరం శ్రీనివాస్, నల్లూరి వెంకటేశ్వర్లు, పరుచూరి గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు