ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడిగా చంద్రశేఖర్‌ రెడ్డి

2 Feb, 2020 16:22 IST|Sakshi

సాక్షి, విజయవాడ: రాష్ట్ర ఏపీ ఎన్జీవో సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఆదివారం ఎన్నికల అధికారులు చేపట్టారు. గడువు ముగిసిన తర్వాత ఒక్కో పదవికి ఒక్కో నామినేషన్‌ మాత్రమే దాఖలు కావడంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడిగా ఎన్‌ చంద్రశేఖర్‌ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా బండి శ్రీనివాస రావు, సహాధ్యక్షుడిగా పురుషోత్తం నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఏపీ ఎన్జీవో ఉద్యోగులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మాపై ఇప్పుడు మీరు మరిన్ని బాధ్యతలు పెట్టారు. ప్రభుత్వంతో కలిసి సమన్వయంతో ముందుకెళ్తూ.. ఎప్పటికప్పుడు ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాము. రాష్ట్రాభివృద్ధిని కాంక్షించి సీఎం జగన్‌ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము. పాలనా రాజధానిని విశాఖగా ప్రకటించిన సందర్భంగా ఉద్యోగులు వైజాగ్‌ వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగులను అన్ని విధాలుగా మోసం చేసింది' అని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు అన్నారు. చంద్రశేఖర్‌రెడ్డి 1985 నుంచి ఏపీ ఎన్జీవో సంఘంలో వివిధ పదవులు నిర్వహించారు. ఐదున్నరేళ్లుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బండి శ్రీనివాస్‌ ప్రకాశం జిల్లా ఎన్జీవో సంఘ అధ్యక్షునిగా, ఇరిగేషన్‌ ఉద్యోగుల సంఘ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. 

మరిన్ని వార్తలు